నైతికంగా ఓడినట్లేనా?

తమ పరిపాలనపై నమ్మకం కోల్పోతున్నాయి ప్రభుత్వాలు. ఒక్క ఓటమి ఎదురవుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజలను సర్వవిధాలా ప్రలోభ పరచాలని యత్నిస్తున్నాయి. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. [more]

Update: 2021-08-03 15:30 GMT

తమ పరిపాలనపై నమ్మకం కోల్పోతున్నాయి ప్రభుత్వాలు. ఒక్క ఓటమి ఎదురవుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజలను సర్వవిధాలా ప్రలోభ పరచాలని యత్నిస్తున్నాయి. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. 119 సీట్ల శాసనసభలో సొంతంగా గెలిచినవి, కలుపుకున్నవి కలిస్తే వంద సీట్లు తమ పక్షానివే. అయినా ఎందుకో తెలియని వెంపర్టాట. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కోసం తలకిందులుగా తపస్సు చేస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. తన బలహీనతలను తానే బట్టబయలు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గంలో పర్యటించడం తప్పులేదు. తాను నియోజకవర్గాన్ని బాగా చూసుకుంటానని హామీ ఇచ్చినా ఫర్వాలేదు. కానీ గెలుపుకోసం అవసరమైతే రాష్ట్ర ఖజానా మొత్తాన్ని గుమ్మరిస్తామన్నట్లుగా ప్రవర్తించడమే విచిత్రం. రాచరికంలో ప్రభువులు హామీ ఇచ్చినట్లుగా ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అక్కడే కొత్త పథకాలు ప్రారంభించడం. ఎన్నికల కోడ్ ఇంకా అమలులోకి రాకపోయి ఉండవచ్చు. కానీ నైతికంగా నియమాలకు నీళ్లొదిలి గెలుపు కోసం పాకులాడుతున్న తీరు మాత్రం టీఆర్ఎస్ ను నవ్వుల పాలు చేస్తోంది.

పరోక్ష ఓటమి…

టీఆర్ఎస్ రెండుసార్లు రాష్ట్రంలో గెలిచింది. అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించింది. ఈ స్థితిలో ఈటల రాజేందర్ అదిష్ఠానంతో విభేదించి బయటకు వెళ్లిపోయారు. ఒక రకంగా పొమ్మనకుండానే టీఆర్ఎస్ నాయకత్వం పొగబెట్టింది. ఒక్క సీటు వల్ల బలాబలాల్లో వచ్చే మార్పులేమీ ఉండవు. అయితే ఈటల ను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చూడాలని కేసీఆర్ పంతం పట్టినట్లు కనిపిస్తోంది. తనను ధిక్కరించిన వారు రాజకీయంగా మనుగడ సాధించకూడదనుకోవడం పెత్తందారీ తనమే. భిన్న వాదనలు, సైద్ధాంతిక విభేదాలు ప్రజాస్వామ్యంలో సహజం. నాయకులు వాటిని జీర్ణించుకోవాలి. పరిణతి చెందిన నాయకత్వాలు ఒకే ఒక నియోజకవర్గంపై ఇంతగా దృష్టి పెట్టకూడదు. మిగిలిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలకు అసూయ కలిగే రీతిలో హూజూరాబాద్ పై వరాల జల్లు కురుస్తోంది. మేము కూడా రాజీనామాలు చేస్తామంటున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. ఇది మాట వరసకే అయినప్పటికీ ప్రభుత్వాన్ని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. పరోక్షంగా ఈ నియోజకవర్గంలో ఓటమిని అంగీకరించినట్లే అనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. గెలుపు కోసం ప్రయత్నించడం తప్పు కాదు. కానీ గెలుపొక్కటే సర్వస్వమన్నట్టుగా టీఆర్ఎస్ నాయకత్వం దిగజారడం మాత్రం విచారకరం.

టీడీపీ అనుభవాలు…

ఉప ఎన్నికల ఫలితాలను అధికార టీఆర్ఎస్ పార్టీ సామదానభేదోపాయాలతో గెలవవచ్చు. అడిగినవారికి అడిగినట్లు వరాలు గుప్పించవచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో అసలు సత్తా తేలిపోతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నిక సందర్బంగా రకరకాల ప్రలోభాలు ప్రయోగించింది. గెలిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతయ్యింది. ఉప ఎన్నికలు ఎప్పడూ సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయలేవు. కొత్తగా ఒక ప్రతిపక్ష గళం అసెంబ్లీలో వినిపించడాన్ని సహించలేకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని సైతం అవమానపరచడమే. రాష్ట్రంలో కేసీఆర్ కు ఉన్న ప్రజాబలం అందరికీ తెలుసు. దానిని ఆయనే స్వయంగా అంగీకరించలేక బలహీనతకు లోనవుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమల్లోకి తేనున్న దళిత బంధు పథకం మాటల మూటగా మిగిలిపోయే సూచనలే కనిపిస్తున్నాయి. నామమాత్రంగా ఒక్క నియోజకవర్గంలో అమలైన తర్వాత చేతులెత్తేసే అవకాశమూ ఉంది. రాష్ట్రంలో 12 లక్షల మంది అర్హులైతే, ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామంటూ కేసీఆర్ హామీ ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోతుందా? ఆచరణ సాధ్యమేనా? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

మూడెకరాల సంగతేమిటి?

దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఉచితంగా ఇస్తామంటూ టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అది అమలుకు నోచుకోకుండానే మూలన పడింది. పైపెచ్చు భూముల విలువ పెరగడం వల్ల అమలు చేయలేకపోయామంటున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో భూముల విక్రయాల ద్వారా వేలకోట్ల రూపాయలు ఖజానాకు సమకూరుతున్నాయి. ఆ నిధులను నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ దళితులకు గ్రామాల్లో భూముల కొనుగోలుకు ఉపయోగించవచ్చు. రాజకీయ అవసరాలే పరమావధిగా హామీలు ఇస్తూ పైచేయి సాధించాలని అధికారపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వాలపైనే ప్రజలకు విశ్వసనీయత తగ్గిపోతోంది. ఎన్నికలలో గెలుపోటములు సహజం. ఒక వేళ హుజూరాబాద్ లో దారుణమైన ఓటమి ఎదురైతే పార్టీ పరిస్థితులను సరిదిద్దుకునేందుకు టీఆర్ఎస్ కు అవకాశం చిక్కుతుంది. మసి పూసి మారేడు కాయ చేస్తూ బలవంతపు గెలుపు తెచ్చుకున్నా సార్వత్రిక ఎన్నికల నాటికి ఉపయోగపడదు. ఒక్క ఉప ఎన్నిక పేరుతో రాజకీయ వ్యవస్థే చర్చనీయం కావడం బలహీనపడుతున్న ప్రజాస్వామ్యానికి నిదర్శనం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News