ఎన్ని తరాలు.. ఈ అంతరాలు…?

భారత సమాజంలో వందల సంవత్సరాలు కొన్ని వర్గాలు అణచివేతకు, వివక్షకు గురయ్యాయి. స్వతంత్ర భారతదేశంలో ఈ లోపాన్ని సరిదిద్దేందుకు పూనుకున్నారు. అందుకు ఎంచుకున్న సాధనమే రిజర్వేషన్లు. విద్య, [more]

Update: 2021-03-23 16:30 GMT

భారత సమాజంలో వందల సంవత్సరాలు కొన్ని వర్గాలు అణచివేతకు, వివక్షకు గురయ్యాయి. స్వతంత్ర భారతదేశంలో ఈ లోపాన్ని సరిదిద్దేందుకు పూనుకున్నారు. అందుకు ఎంచుకున్న సాధనమే రిజర్వేషన్లు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సామాజికంగా బలహీనంగా ఉన్నవారిని పైకి తేవడం వీటి లక్ష్యం. తద్వారా సామాజిక మార్పు సాధించవచ్చుననేది రాజ్యాంగ నిర్మాతల ఆశయం. డెబ్భై సంవత్సరాలు గడచినా ఆ మార్పు వచ్చిందా? ప్రభుత్వాలు అమలు చేస్తున్నసంక్షేమ ఫలాలు, విద్య, ఉద్యోగ ఫలితాలు ఏమైపోతున్నాయి.? ఏ ఒక్క వర్గమూ ఈ ఏడు దశాబ్దాల్లో అసమానతను ఎందుకు అధిగమించలేదు? ఇవే ప్రశ్నలు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం నుంచి వెలువడ్డాయి. ఏదో లోపం ఉంది? ఎక్కడో తేడా కొడుతోంది. రిజర్వేషన్ల అమలు ప్రక్రియలోనే అవకతకవలున్నాయి. లేకపోతే ఇప్పటికి స్వాతంత్ర్యానంతరం మూడు తరాలు గడచినా ఇంకా సంఘంలో మిగిలిన వారితో సమానమైన స్థాయి రిజర్వేషన్ పొందుతున్న వర్గాలకు ఎందుకు లభించలేదు? ఇంకా ఎన్ని తరాలపాటు వీటిని అమలు చేయాలంటూ సుప్రీం ప్రశ్నించింది. రాజకీయ పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అంశమిది.

తొలిదశలో…

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలిదశలో పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు చేస్తే చాలు . బలహీన వర్గాలు తమ కాళ్లపై తాము నిలబడతాయని నేతలు ఆకాంక్షించారు. కానీ వాటిని పదే పదే పొడిగించుకుంటూ రావాల్సి వచ్చింది. మరిన్ని వర్గాలను తెచ్చి రిజర్వేషన్ల కోటా కల్పిస్తూ వచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో ఇంకా కొత్త డిమాండ్లను పార్టీలే ముందుకు తెస్తున్నాయి. ఒక్కసారి రిజర్వేషన్ ప్రవేశపెట్టిన తర్వాత ఉపసంహరించడం భారత్ లో సాధ్యం కాదు. ఆ సామాజిక వర్గం ముందంజ వేసినా ఏ ప్రభుత్వమూ రిజర్వేషన్ల ఉపసంహరణ జోలికి పోదు. దీనివల్ల సమానత్వమనే ప్రాతిపదికకు శాశ్వతంగా సమాధి కట్టేసినట్లవుతోంది. రిజర్వేషన్ పొందుతున్న వర్గాలు, లేని వర్గాల మధ్య అంతరం ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో సంఘర్షణలకు దారి తీసే ప్రమాదమూ ఉంది. నిర్దిష్టమైన లక్ష్యాలు, మార్గదర్శకాలు, అమలు – నిషేధాలు పెట్టకుండా గంపగుత్తగా అమలు చేసేందుకు పూనుకోవడంతో రిజర్వేషన్ల ఉద్దేశం నెరవేరడం లేదనేది మేదావుల భావన. మూడు , నాలుగు తరాల నుంచి అమలు చేస్తున్న రిజర్వేషన్లు చిత్తశుద్ధితో ఆచరణలోకి వచ్చి ఉంటే ఈపాటికి ఆయా సామాజిక వర్గాలు ఎంతగానో అభ్యున్నతిని సాధించి ఉండాలి. కానీ ఇంకా వెనకబాటు తనమే కొనసాగుతోంది. మాకు రిజర్వేషన్లు కావాలంటూ కొత్త వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ఉన్నవాటిని తీసి పక్కనపెట్టలేక, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వలేక దేశం సతమతమవుతోంది. ఓట్ల లెక్కలతో రాజకీయ నేతలు హామీల వర్షం కురిపిస్తూ మరింతగా రిజర్వేషన్లను విస్తరింప చేస్తామంటూ చెబుతున్నారు. ఇది నిజంగానే సమస్యను పరిష్కరిస్తుందా? లేక సమాజంలో అసమానతకు, సంఘర్షణకు దారితీస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవే కుటుంబాలు ..వారసత్వాలు..

ఎస్సీ,ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వారి జనాభా నిష్పత్తిని అనుసరించి అమలు చేస్తున్నారు. ఇప్పటికి మూడు , నాలుగు తరాలుగా సమగ్రంగా అందరికీ రిజర్వేషన్లు అంది ఉంటే ఆయా వర్గాలు ఇప్పటికే పై మెట్టుకు చేరి ఉండాలి. కానీ రిజర్వేషన్ల అమలులోనూ దోపిడీ సాగుతోంది. ఒకసారి రిజర్వేషన్ సదుపాయాన్నివినియోగించుకున్న కుటుంబాలే మళ్లీ మళ్లీ సదుపాయాన్నిపొందుతున్నాయి. ముత్తాత వద్ద మొదలైన రిజర్వేషన్ సదుపాయం మునిమనవడి వరకూ కొనసాగుతోంది. అదే సామాజిక వర్గంలోని కొత్తవారు వీటిని అందుకోలేకపోతున్నారు. ఒకసారిప్రభుత్వఉద్యోగం,ఉన్నత స్థాయి పదవి పొందిన తర్వాత ఆ కుటుంబాన్ని రిజర్వేషన్ సదుపాయం నుంచి మినహాయించాలి. తమ తర్వాత తరాలను పైకి తెచ్చే బాధ్యతను వారే తీసుకోవాలి. అప్పడే ఆ సామాజిక వర్గంలోని మిగిలిన వారికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. కానీ ఒకసారి వినియోగించుకున్న వారు దానిని పొందే మార్గాన్ని సుగమం చేసుకుని తమ బిడ్డలకు, మనవళ్లకు రూట్ ఏర్పాటు చేస్తున్నారు. తమ సామాజిక వర్గంలోనిమిగిలిన వాళ్లకు చాన్సు దక్కకుండా అడ్డుపడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులు మొదలు ఐఏఎస్,ఐపీఎస్ వంటి సర్వీసుల వరకూ ఇదే ధోరణి కొనసాగుతోంది. దాంతో సామాజిక పంపకంగా సాగాల్సిన రిజర్వేషన్లు కొన్ని కుటుంబాల ఆస్తిగా మారిపోతున్నాయి. అందరికీ చెందాల్సిన రిజర్వేషన్ ఫలాలు కొందరి పరమై పోతున్నాయి. ఒక నూతన సంపన్న, సామాజిక వర్గం అవతరిస్తోంది. ఫలితంగా రిజర్వేషన్లను ఎన్ని తరాలు కొనసాగించినా అందరి అవసరాలు తీరడం లేదు. ఇంకా మిగిలే ఉంటున్నారు. ఇన్నేళ్ల లో కేవలం రిజర్వేషన్ సదుపాయం ఉన్నవారిలో 20 నుంచి 30 శాతం మంది మాత్రమే వాటి ఫలాలను పూర్తిగా అనుభవించగలిగారు. వారసత్వ హక్కు తరహాలో తరతరాలు కొన్ని కుటుంబాలకే అవి అందుతున్నాయి.

సామాజిక అసహనం…

రిజర్వేషన్ కొన్ని కుటుంబాలే పొందినా సామాజికంగా ఆ వర్గమే కదా అనేది కొందరి వాదన. రిజర్వేషన్ ద్వారా సామాజిక సంపదను బలహీనంగా ఉన్నవారికి అందించి పైకి తేవడమనేది ఆశించిన ఉద్దేశం. ప్రభుత్వ పదవులు, ఉద్యోగాలతో ఇప్పటికే పైకి వచ్చిన వారి కుటుంబాలకు మరోసారి అపాత్ర దానం చేయడం కాదు. కానీ రిజర్వేషన్ల అమలులో చేదు నిజమిదే. ఏవో కొన్ని కుటుంబాలు తరతరాలుగా రిజర్వేషన్లను అందుకుంటూ నియో రిచ్ గా మారుతున్నాయి. కళ్లముందే ఆ సంపన్నులు తిరుగాడటం తో తాము మోసపోతున్నామనే అసహనం ఇతర వర్గాలలో ఏర్పడుతోంది. ఇది సాంఘిక సంఘర్షణకు దారి తీస్తుంది. దీనికి విరుగుడుగా ఒక కుటుంబంలో ఒకరు రిజర్వేషన్ పొందిన తర్వాత వారి పిల్లాపాపలను తీర్చిదిద్దుకునే బాధ్యతను వారే తీసుకోవాలి. రిజర్వేషన్ సదుపాయం నుంచి తర్వాతి తరాలు బయటికి రావాలి. ఈ రకమైన మార్పుతో రిజర్వేషన్ల ప్రక్రియను పునర్వ్యవస్థీకరించాలి. లేకపోతే వందేళ్లైనా వెనకబాటు తనం కొనసాగుతూనే ఉంటుంది. అసమానతలు అలాగే ఉంటాయి. రిజర్వేషన్ వర్గాల పట్ల అసహనం ఇతరుల్లో పెరుగుతూనే ఉంటుంది. సుప్రీం కోర్టు ప్రశ్న ఈ దిశలో ప్రభుత్వాలను ఆలోచింపచేయగలిగితేనే విముక్త భారత్ సాధ్యమవుతుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News