మండలి విషయం ఈయనను అడగాల్సిందే

హసరాజ్ భరధ్వాజ్… ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఆయన సంక్షిప్త నామమైన హెచ్.ఆర్.భరద్వాజ్ పేరు రాజకీయ వర్గాల్లో చాలా మందికి సుపరిచితమే. కేంద్ర [more]

Update: 2020-01-28 16:30 GMT

హసరాజ్ భరధ్వాజ్… ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఆయన సంక్షిప్త నామమైన హెచ్.ఆర్.భరద్వాజ్ పేరు రాజకీయ వర్గాల్లో చాలా మందికి సుపరిచితమే. కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం, గవర్నర్ గా పనిచేసిన ఈ కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు మధ్యప్రదేశ్ కు చెందిన నేత. ప్రజాక్షేత్రంలో పెద్దగా బలం లేనప్పటికీ గాంధీ కుటుంబం ప్రాపంకంలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అశోక్ కుమార్ సేన్ తర్వాత సుదీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు హెచ్.ఆర్ భరధ్వాజ. ఎక్కువ కాలం ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

రెండు బిల్లులూ…..

హెచ్.ఆర్. భరధ్వాజకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలితో అవినాభావ సంబంధం ఉంది. ఒకసారి శాసనమండలి రద్దు, మరోసారి శాసనమండలి పునరుద్ధరణ రెండూ ఆయన చేతుల మీదుగానే జరిగినవే కావడం విశేషం. రెండూ ఆయన చేతుల మీదుగా జరిగినవే కావడం విశేషం. రెండుసార్లు ఇద్దరు ప్రధానుల మంత్రివర్గాల్లో ఈ తంతుకు సారథ్యం వహించిన వ్యక్తి హెచ్.ఆర్ భరధ్వాజ్. కేంద్ర న్యాయశాఖమంత్రి హోదాలో ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లును, 2007లో అదే శాసనమండలి పునరుద్ధరణ బిల్లును ప్రతిపాదించింది హెచ్.ఆర్ భరధ్వాజ కావడం కాకతాళీయం. అందువల్లే శాసనమండలితో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది.

ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు….

1983 జనవరిలో ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు మండలిలో కాంగ్రెస్ ఆధిక్యతతో అనేక ఇబ్బందులు పడ్డారు. బిల్లుల ఆమోదానికి చిక్కులు ఎదుర్కొన్నారు. అప్పట్లో మండలిని కాంగ్రెస్ నాయకుడు కొణిజేటి రోశయ్య తన వాదనా పటిమతో ఎన్టీఆర్ కు చెమటలు పట్టించే వారు. ప్రభుత్వ విధానాలను చీల్చి చెండాడేవారు. అనుభవ రాహిత్యం, తగినంతమంది సభ్యులు లేకపోవడంతో రోశయ్యను ఎదుర్కొనలేక ఎన్టీఆర్ ఆపసోపాలు పడేవారు. దీంతో చివరకు విసిగిపోయిన ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు. కానీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇందుకు సుముఖంగా లేరు. దీంతో మండలి రద్దు తీర్మానాన్ని తొక్కి పెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందలేకపోయింది. చివరకు ఇందిర హత్యానంతరం తనయుడు రాజీవ్ గాంధీ హయాంలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కేంద్ర న్యాయశాఖమంత్రి హెచ్ ఆర్ భరధ్వాజ ఉండేవారు. తమ ప్రభుత్వానికి లోక్ సభలో 415 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ సమాఖ్య భావనను గౌరవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. 1985లో చివరకు ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది.

పునరుద్ధరణ సమయంలోనూ…..

2004లో ఉమ్మడి ఏపీ లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని తిరిగి పునరుద్ధరించారు. ఈ మేరకు 2004 జులై 8న అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చని హామీ మేరకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు అప్పట్లో వైఎస్ చెప్పారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదింప చేసే బాధ్యతను అప్పట్లో కంతేటి సత్యనారాయణరాజుకు అప్పగించారు. ఈ పని పూర్తి చేసినందుకు బహ‍ుమతిగా అప్పట్లో ఆయనను వైఎస్ ఎమ్మెల్సీని చేయడం విశేషం. ఆరు నెలల అనంతరం ఏపీ మండలి పునరుద్ధరణ తీర్మానంన పార్లమెంటు ముందుకు వచ్చింది. అప్పట్లో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో బిల్లును ఆమోదింప చేసుకోవడం వైఎస్ కు సులువయంది. 2005 జనవరి 12న పార్లమెంటులో ఏపీ మండలి బిల్లును అప్పటి కేంద్ర న్యాయశాఖమంత్రి హోదాలో మళ్లీ హెచ్ ఆర్ భరధ్వాజ ప్రవేశపెట్టారు. ఇది కాకతాళీయం అయినప్పటికీ ఆసక్తికర పరిణామం. నాడు ఎన్టీఆర్ పంపిన మండలి రద్దు బిల్లును, తర్వాత వైఎస్ పంపిన మండలి పునరుద్ధరణ తీర్మానాన్ని తానే ప్రవేశపెట్టానని ఈ సందర్భంగా భరధ్వాజ గుర్తు చేసుకున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనమండలితో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. భరద్వాజ చివరి రోజుల్లో 2009 నుంచి 2014 వరకూ కర్ణాటక గవర్నర్ గా పనిచేశారు. మధ్యలో కొంతకాలం కేరళ గవర్నర్ గా అదనపు బాధ్యతలను నిర్వహించారు. కర్ణాటక గవర్నర్ గా నాటి సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ కు చుక్కలు చూపించారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News