ఫ్లాగ్ షిఫ్ ప్రోగ్రాం కు మసి పడుతోందా..?

రాష్ట్రసర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం ’ వివాదాల సుడిగుండంలో మగ్గుతోంది. 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ [more]

Update: 2020-08-20 15:30 GMT

రాష్ట్రసర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం ’ వివాదాల సుడిగుండంలో మగ్గుతోంది. 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకుగాను ప్రభుత్వ భూమితో పాటు భూసేకరణ, భూసమీకరణ వంటి వివిధ మార్గాలను అనుసరించింది. మొత్తం వ్యయం 20 వేల కోట్ల రూపాయల వరకూ వెచ్చించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు తీయించింది. అయితే వివిధ కారణాలతో ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. నిజానికి ఉగాది సందర్భంగా పేదలకు ఇళ్లను కేటాయించాలనేది తొలి ఆలోచన. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా ఇవ్వాలని ప్రయత్నించి, వాయిదా వేసుకున్నారు. చివరికి ఆగస్టు పదిహేను ముహర్తం సైతం మూలనపడింది. ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్నకు ప్రభుత్వ వర్గాలు రకరకాల కారణాలను చూపుతున్నాయి. రాజకీయ కారణాలూ ఇందుకు జోడవుతున్నాయి.

సర్కార్ కు సవాల్…

రాష్ట్రంలో కోటి యాభై లక్షల వరకూ కుటుంబాలున్నాయి. అందులో అయిదో వంతు కుటుంబాలకు ఇళ్ల స్థలాలంటే మాటలు కాదు. చరిత్రాత్మకం. అందుకే రికార్డు స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంతటి పెద్ద కార్యక్రమం కావడంతో యంత్రాంగానికి సవాల్ గా నిలిచింది. ప్రభుత్వ హడావిడిని చూసి కొందరు అక్రమార్కులూ ఇదే అదనుగా భావించారు. అధికారపార్టీలోని కొందరువారికి తోడయ్యారు. వేల కోట్ల రూపాయల కార్యక్రమం కావడంతో కొన్ని చోట్ల అనువుగాని భూములను కొనేశారు. మరికొన్ని చోట్ల భూముల ధరలు విపరీతంగా పెంచేసి వాటాలు పంచుకున్నారు. ఇదంతా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. అయినప్పటికీ లక్ష్యం చేరుకోవడానికి ఏదో ఒక మార్గం అనుసరించకతప్పదని ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకున్నారు. మొత్తం 16 వేల ఎకరాలు సేకరించారు. అనుకున్నట్లుగా పంపిణీ పూర్తయితే వైసీపీ సర్కారుకు రికార్డు విజయంగానే చూడాలి. కానీ పథకం అమలు చేయాలనే తొందరలో తొలి నుంచి అనుసరించిన విధానాలు మోకాలడ్డుతూ వస్తున్నాయి. ఆదిలోనే హంసపాదులా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా మార్చి నుంచి ఎదురుచూస్తున్న లబ్ధిదారులను నిరాశ వెన్నాడుతోంది. ముందుగా దేవాదాయశాఖ భూములను సైతం కొంతమేరకు ఈ పథకానికి కేటాయించాలని ప్రభుత్వం భావించింది. భారీ ఎత్తున విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇంత పెద్ద పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపకల్పన చేయకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.

న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు…

రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విషయాల్లో న్యాయస్థానాల నుంచి ప్రతికూల తీర్పులు వస్తున్నాయి. నిబంధనలు అనుసరించకపోవడం, ప్రాథమిక హక్కులకు భంగం కలగడం, గతంలో ఉన్న చట్టాలను తోసిరాజనడం వంటి అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలు వీగిపోతున్నాయి. ఇళ్ల పట్టాల విషయంలోనూ అదే సమస్య. అమరావతి ప్రాంతంలో భూసమీకరణలో వచ్చిన భూముల్లో పేదలకు ఇళ్లు కేటాయించడం ఇందులో ఒకటి. అసైన్డ్ భూములను లబ్ధిదారుల నుంచి తీసుకుని ఇళ్లుగా మార్చడం మరొకటి. అదేవిధంగా విద్యాసంస్థల నిర్వహణకు ఉద్దేశించిన ప్రభుత్వ స్థలాలనూ పట్టాలుగా మార్చేశారు. ఇవన్నీ న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. ముఖ్యంగా విద్య వంటి ప్రాథమిక హక్కుకు సంబంధించి భావితరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలను ప్రభుత్వం కేటాయించడంపై న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే రాజధాని నిర్మాణానికి పరస్పర ప్రయోజన ప్రాతిపదికపై ఉచితంగా భూములిచ్చిన రైతుల స్థలాలను పట్టాలుగా పంచాలనుకోవడంపైనా న్యాయస్థానం విచారిస్తోంది. ఇవన్నీ ఆటంకాలే. పేదలకు గతంలో జీవనభ్రుతికి కొన్ని దశాబ్దాల క్రితం అసైన్డ్ భూములనుకేటాయించారు. అవి ఇప్పుడు ఎంతో విలువైనవి. చట్టంలోని నిబంధనలను సాకుగా చేసుకుంటూ వాటిని సైతం సేకరించడమూ న్యాయపోరాటానికి తావిస్తోంది. మొత్తమ్మీద ప్రభుత్వం వీటన్నిటినీ కలగాపులగం చేసుకుని తనకాళ్లకు తానే బంధనాలు వేసుకున్నట్లవుతోంది.

దశల వారీగా…

విద్యాసంస్థల భూములు, అసైన్డ్ భూములు, రాజధాని భూములను పక్కన పెడితే ప్రభుత్వం పథకం ప్రారంభించడానికి ఎటువంటి ఆటంకాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. న్యాయస్థానం వివాదాల్లో ఉన్న వాటిని మినహాయించి పథకం అమలు చేస్తే ఇప్పటికే సేకరించిన భూములు వినియోగంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వం భారీ ఇళ్ల నిర్మాణ పథకాలను ప్రకటించింది. అందులో మేజర్ వాటా దక్కించుకోవాలంటే స్థలాలు సిద్దంగా ఉండటం అవసరం. 16 వేల ఎకరాల్లో దాదాపు నాలుగోవంతు మాత్రమే వివాదాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని పక్కనపెట్టి దశలవారీగా పథకాన్ని మొదలు పెడితేనే ప్రయోజనదాయకం. రెండేళ్లలో 30 లక్షల మందికి పట్టాలిచ్చినా రికార్డుగానే చూడాలి. అందువల్ల ఈ పథకం మొత్తం వివాదాస్పదం కాకుండా ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చుకునే దిశలో చర్యలు తీసుకుంటే మంచిది. కేంద్రం వార్షికంగా దేశవ్యాప్తంగా జరిపే ఇళ్ల కేటాయింపుల్లోనూ అగ్రభాగం దక్కించుకోవడం అప్పుడే సాధ్యమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News