ఉత్సవ విగ్రహాలేనా? పవర్ నిల్ అటగా?

రాజకీయాల్లో ఉత్సవ విగ్రహాలకు చాలా డిమాండ్ ఉంటుంది. వివిధ కారాణాల వల్ల, సామాజిక సమతూకాల కోసం కొన్ని కీలకమైన పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటపుడు ఆ పదవుల్లో [more]

Update: 2020-04-13 15:30 GMT

రాజకీయాల్లో ఉత్సవ విగ్రహాలకు చాలా డిమాండ్ ఉంటుంది. వివిధ కారాణాల వల్ల, సామాజిక సమతూకాల కోసం కొన్ని కీలకమైన పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటపుడు ఆ పదవుల్లో ఉన్న వారు భవిష్యత్తులో ఏకు మేకు అవకుండా ఉండేందుకు సకల జాగ్రత్తలు తీసుకుంటారు. అలా ఏరి కోరీ కొందరిని నియమిస్తారు. వారు పేరుకే పదవుల్లో ఉంటారు. కానీ చడీ చప్పుడూ లేకుండా పనులు మాత్రం వేరే వారు చక్కబెడుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే అయినా కూడా విజయవంతంగా ఇది కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో తీసుకుంటే హోం మంత్రుల గురించి అపుడూ ఇపుడూ ఇదే పెద్ద చర్చగా ఉంది.

సీఎం తరువాత…?

నిజానికి ప్రోటోకాల్ ప్రకారం చూస్తే హోం మంత్రి పదవి ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉంటుంది. అంటే అతి ముఖ్యమైన శాఖ అన్న మాట. ఇలా నంబర్ టూగా వ్యవహరించేవారు. పదవి మీద మోజు పుట్టి ఎప్పటికైనా మొదటి స్థానానికి ఎసరు పెడాతారేమోనన్న కంగారు, కలవరం ముఖ్యమంత్రులకు ఉండడం కద్దు. దాంతో వారు తనకు అనుకూలమైన వారికే ఈ పదవులు అప్పగిస్తారు. ఉమ్మడి ఏపీలో తీసుకుంటే 2004న వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతో పాటుగా సీనియర్ గా ఉన్న కుందూరు జానారెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ కీలకమైన పదవి ఇమ్మంది. అలా ఆయన హోం మంత్రి అయ్యారు. జానారెడ్డి అప్పట్లో వైఎస్సార్ కంటే కూడా కొంత దూకుడుగా ఉంటూ చికాకు పెట్టారని అంటారు.

ఆమెతో మొదలా…

అలా అయిదేళ్ళ పాటు జరిగిపోయాక వైఎస్సార్ 2009 ఎన్నికల్లో మారో మారు సీఎం అయ్యారు. ఈసారి ఆయన మరింత బలోపేతమయ్యారు కాబట్టి తనకు అనుకూలంగా ఉండే సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిని చేశారు. అలా ఆమె ఆయనకు చేవెళ్ళ చెల్లెమ్మగా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. మహిళకు హోం శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించామన్న కీర్తిని కూడా వైఎస్సారె సొంతం చేసుకున్నారు. కానీ మొత్తం వైఎస్సార్ కనుసన్నల్లోనే జరిగేది అంటారు. ఇక విభజన తరువాత నవ్యాంధ్రలో చంద్రబాబు కూడా తనకు నమ్మకస్తుడు అయిన నిమ్మకాయల చినరాజప్పను హోం మంత్రిగా నియమించుకున్నారు.

చిన రాజప్పేగా…

దానికి తోడు ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా కూడా బాబు ప్రకటించారు. గోదావరి జిల్లాలో ఉన్న బలమైన కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి కీలకమైన పదవి ఇచ్చినట్లు చంద్రబాబు చేసినా అసలు కధ వేరేగా సాగిందని అంటారు. చిన రాజప్ప ఏనాడు హోం మంత్రిగా గట్టిగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో పోలీస్ కానిస్టేబుల్ ని కూడా బదిలీ చేయించుకోలేని హోం మంత్రి అని కూడా ప్రచారం జరిగింది. మొత్తం ఆయన శాఖలో టీడీపీ పెద్దలే జోక్యం చేసుకుని చక్రం తిప్పారని అంటారు. మొత్తానిక్ ఆయన చిన రాజప్పగానే మిగిలారు. ఆయన శాఖాపరమైన రివ్యూస్ కూడా సరిగ్గా చేయలేకపోయారు.

అంతేగా అంతేగా…..

ఇక 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కీలకమైన హోం శాఖను తన తండ్రి వైఎస్సార్ బాటలో మహిళకే ఇచ్చాననిపించుకున్నారు. ఈ శాఖ కోసం ఎంతో మంది ఆశపెంచుకున్నా గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరితకు దక్కింది. పైగా ఆమె కూడా ఉప ముఖ్యమంత్రిగా విశేషమైన హోదాతో ఉన్నారు. కానీ ఇపుడు సీన్ చూస్తూంటే శాఖాపరంగా ఆమె ఏమాత్రం పట్టు సాధించలేకపోయారనే చెప్పాలి. ఏపీ హోం మంత్రి ఎవరు అంటే తడుముకోకుండా జవాబు చెప్పేవారు లేరంటేనే ఆమె పరపతి తెలుస్తుంది. ఇక అనేక కీలకమైన నిర్ణయాలు అన్నీ ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చక్కబెడతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు ఆరోపిస్తున్నారంటే ఆమె పేరుకే హోం మంత్రిగా ఉన్నారా అన్న భావన కలుగక మానదు. ఏది ఏమైనా కూడా హోం మంత్రులు అంటే పవర్ ఫుల్ అన్న మాట నుంచి పవర్ నిల్ అన్న తీరుకు అలవాటు పడే జమానా నడుస్తోందిపుడు.

Tags:    

Similar News