హెచ్ఐవి కి ” సెంట్రల్ “

రాజమండ్రి సెంట్రల్ జైలు దేశంలోనే అత్యంత పురాతన చారిత్రక కారాగారం. 1864 లో మొదలై శతాబ్దంన్నర కు పైగా చరిత్ర కలిగిన జైలు లో ఇప్పుడు ఖైదీల్లో [more]

Update: 2019-08-02 02:30 GMT

రాజమండ్రి సెంట్రల్ జైలు దేశంలోనే అత్యంత పురాతన చారిత్రక కారాగారం. 1864 లో మొదలై శతాబ్దంన్నర కు పైగా చరిత్ర కలిగిన జైలు లో ఇప్పుడు ఖైదీల్లో భయం రాజ్యమేలుతుంది. కారణం హెచ్ఐవి జైల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న వార్త కలకలం రేపుతోంది. ఇటీవల జరిపిన వైద్యపరీక్షల్లో ఈ విషయం బయటపడి నెమ్మదిగా బయటకు పొక్కింది. దాంతో ఎపి హైకోర్ట్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సైతం ఈ వైనంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చేసింది. 1648 మంది కి మాత్రమే సౌకర్యాలు వున్న ఈ జైల్లో అంతకుమించి ఖైదీలను కుక్కేయడం కూడా అనేక సమస్యలకు తెరతీస్తోంది.

ఎయిడ్స్ బారిన 29 మంది ఖైదీలు ….

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో హెచ్ ఐ వి సోకిన ఖైదీలు 29 మందిగా గుర్తించినట్లు తెలుస్తుంది. వీరిలో 21 మంది జైల్లో ప్రవేశానికి ముందే హెచ్ ఐ వి బాధితులని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 8 మందికి వ్యాధి వ్యాప్తి చెందిందని వెల్లడించారు జిల్లా వైద్య అధికారి డాక్టర్ రమేష్ కిషోర్. మరో పక్క వీరి వైద్య చికిత్స కోసం మూడు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని, అలాగే ఈ ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ సైతం ఏర్పాటు చేసినట్లు జైలు డిప్యూటీ సూపరిండెంట్ ఎస్ రాజారావు వెల్లడిస్తున్నారు. మరోపక్క ఎపి హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ల బెంచ్ ఒక కేసు విచారణలో తెలిసిన ఈ సమాచారంతో సీరియస్ గా దృష్టి పెట్టింది. జైలు వర్గాలను పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని సైతం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వ్యవహారం టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపొయింది.

పేరు గొప్ప ….జైలు దిబ్బ

రాజమండ్రి సెంట్రల్ జైలు రాష్ట్రంలో పేరున్న కారాగారమే తప్ప ఇందులో ఖైదీల సంరక్షణ అంతా తూతుమంత్రంగా నడుస్తోందన్న విమర్శలు ఎప్పటినుంచో వినవస్తున్నాయి. గత ప్రభుత్వంలో జైలు ఆధునీకరణ పనులు అయితే చేపట్టారే కానీ ఖైదీల సంక్షేమం గాలికి వదిలేశారు. ముఖ్యంగా అనారోగ్యంతో పలువురు ఖైదీలు కన్నుమూస్తున్నా పట్టించుకునే నాధులే లేకుండా పోయారు. ఓపెన్ ఎయిర్ జైలు ద్వారా, రెండు పెట్రోల్ బంక్ లు ద్వారా ఖైదీలను వినియోగిస్తూ కోట్లాది రూపాయలను జైలు సముపార్జిస్తున్నా వారికి ఆరోగ్య సంబంధిత అంశాల్లో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని పౌరసంఘాలు, ప్రజా సంఘాలు ఎప్పటినుంచో గొంతు చించుకుంటున్నాయి. సెంట్రల్ జైల్లో విజృంభిస్తున్న హెచ్ ఐ వి నేపథ్యంలో వందలాదిగా వున్న ఇతర ఖైదీల కుటుంబాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని తమ వారిని కాపాడాలని బంధువులు కోరుకుంటున్నారు. ఇప్పుడు సర్కార్ ఎలాంటి చర్యలు చేపడుతుంది , హై కోర్ట్ ఇచ్చే ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశం చర్చనీయాంశం గా మారింది.

Tags:    

Similar News