ఇక్కడ జగన్ కు అంతా రివర్సే

వైఎస్ జగన్ కి విశాఖ అందరాని చందమామగా ఉంది. జగన్ వస్తే చాలు జనం విరగబడతారు, ఆయన సభలన్నీ జనంతో పోటెత్తిపోతాయి. అయ్హితే ఎన్నికల్లో మాత్రం ఫలితాలు [more]

Update: 2019-07-20 15:30 GMT

వైఎస్ జగన్ కి విశాఖ అందరాని చందమామగా ఉంది. జగన్ వస్తే చాలు జనం విరగబడతారు, ఆయన సభలన్నీ జనంతో పోటెత్తిపోతాయి. అయ్హితే ఎన్నికల్లో మాత్రం ఫలితాలు రివర్స్ లో వస్తూంటాయి. 2014 అయినా, 2019 అయినా జగన్ కి చిక్కకుండా తప్పించుకున్న సిటీ విశాఖ ఒక్కటే. 2014 ఎన్నికల్లో చూసుకుంటే ఏకంగా జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. ఇందులో రెండు సీట్లు పాతిక వేల పై చిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించినవి ఉండడం విశేషం. దాంతో జగన్ విశాఖ మీద ఇపుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు. చేతిలో ప్రభుత్వం ఉంది. అధికారం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని విశాఖ జనం మనసు గెలవాలని జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఆగస్ట్ వేడుకలు ఇక్కడే….

ఇక ఆగస్ట్ 15 జెండా వందనం కార్యక్రమాన్ని ఈసారి విశాఖలో నిర్వహించాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. జగన్ తొలిసారిగా అధికారంలోకి వచ్చారు. ఆయన మొదటి జెండా వందనం పండుగను విశాఖలో నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు. నిజానికి గతంలో కూడా విశాఖలో ఆగస్ట్ 15వ తేదీన ఉత్సవాలు జరిగాయి. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహించింది. విశాఖ బీచ్ రోడ్ వేదికగా జరిగిన ఈ పండుగ నాడు విశాఖ వాసులను అలరించింది. తిరిగి నాలుగేళ్ల తరువాత జగన్ ముఖ్యమంత్రిగా విశాఖలో ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఈసారి వేదిక మారింది. ఆంధ్రా యూనివర్సిటి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జెండా పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాడు అలా …

ఇక విపక్ష నేతగా జగన్ గత ఏడాది ఆగస్ట్ 15 వేడుకలను విశాఖ జిల్లాలో జరుపుకున్నారు. ఆ రోజున ఆయన నర్శీపట్నంలో పాదయాత్రలో భాగంగా బస చేశారు. అక్కడే ఆయన జెండా వందనాన్ని చేశారు. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో ఇదే విశాఖలో ఆగస్ట్ 15 పండుగలో పాలుపంచుకోవడం విశేష పరిణామమే. ఇదిలా ఉండగా వైసీపీ సర్కార్ విశాఖ అభివ్రుధ్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు. పర్యాటకపరంగా, సినీ రాజధానిగా కూడా అభివ్రుధ్ధి చేయాలనుకుంటోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకో భాగంగానే తొలి అధికారిక కార్యక్రమం కోసం జగన్ విశాఖను ఎంచుకున్నారని అంటున్నారు. మరో వైపు రాజకీయంగా కూడా పట్టు సాధించేందుకు జగన్ విశాఖను కేంద్రంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే విభజన ఏపీలో విశాఖ ప్రాముఖ్యత నాటి, నేటి పాలకులు గుర్తించారు. మరి వైసీపీ పాలనలోనైనా అభివ్రుధ్ధి జరిగితే అదే పదివేలు అంటున్నారు.

Tags:    

Similar News