టీడీపీలోకి ఎవ‌రైనా రావాలంటే ఈ నేత‌కు క‌ప్పం క‌ట్టాల్సిందే..!

టీడీపీలో ఆయ‌నో కీల‌క నేత‌, చంద్రబాబుకు, లోకేష్‌కు అత్యంత స‌న్నిహితుడు.. పైకి చూడ‌డానికి అమాయ‌కంగా మొఖం పెట్టి క‌నిపిస్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయ‌న కీల‌క ప‌ద‌వులు [more]

Update: 2020-09-09 13:30 GMT

టీడీపీలో ఆయ‌నో కీల‌క నేత‌, చంద్రబాబుకు, లోకేష్‌కు అత్యంత స‌న్నిహితుడు.. పైకి చూడ‌డానికి అమాయ‌కంగా మొఖం పెట్టి క‌నిపిస్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయ‌న కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించారు. మొన్నటి ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడినా ఆయ‌న మాత్రం చ‌చ్చీ చెడీ గెలిచారు. అలాంటి నేత లోకేష్‌ను ఏదోలా మ‌చ్చిక చేసుకుని జిల్లాలో మాత్రం పార్టీ నేత‌ల‌ను ఎద‌గ‌నీయ‌కుండా చేయ‌డంతో పాటు అధికార పార్టీ నేత‌ల‌తో చేతులు క‌లిపి వాటాలు పంచుకుంటున్నార‌న్న విమ‌ర్శలు తీవ్రంగా ఉన్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లా తెలుగు త‌మ్ముళ్లు ఆ నేత పేరు చెపితే టీడీపీని ఆయ‌న చంపేస్తారేమోన‌ని తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

పైకి అమాయకత్వంగా…..

పార్టీలో కొన్ని సంవ‌త్సరాలుగా ఒకే ప‌ద‌విని ప‌ట్టుకుని వేలాడిన ఆయ‌న అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో చంద్రబాబు కీల‌క‌మైన పెద్ద ప‌ద‌వి క‌ట్టబెట్టారు. వాస్తవానికి అదే తూర్పు గోదావ‌రి జిల్లా టీడీపీలో చాలా మంది కీల‌క నేత‌లు, అనుభ‌వం ఉన్నవారు ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మ‌రో కీల‌క ప‌ద‌విలో ఉన్న నేత స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు లేక‌పోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌పై వ‌చ్చిన వ్యతిరేక‌త నేప‌థ్యంలో ఆయ‌న ఇప్పుడు సైలెంట్‌గానే ఉన్నారు. అయితే పైకి అమాయ‌కుడిగా న‌టిస్తోన్న స‌ద‌రు నేత మాత్రం జిల్లా టీడీపీని త‌న కాళ్ల కింద నొక్కి ప‌ట్టి, నేత‌ల తాట తీస్తున్నార‌ట‌.

ఆయన వైఖరితో….

ముఖ్యంగా కోన‌సీమ‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఒక్క సీటు గెల‌వ‌లేదు స‌రిక‌దా.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘోరంగా ఓడిపోయింది. రాజోలు లాంటి చోట్ల ఏకంగా మూడో ప్లేసుతో స‌రిపెట్టుకుంది. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో టీడీపీలోకి వ‌చ్చే వారిని, పార్టీ కోసం క‌ష్టప‌డే వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవ‌స‌రం ఇక్కడ సీనియ‌ర్ నేత‌ల‌పై ఉంది. అయితే కోన‌సీమ రాజ‌కీయాల‌ను చూసే స‌ద‌రు అమాయ‌కంగా న‌టించే నేత మాత్రం వ్యవ‌హ‌రిస్తోన్న తీరు దారుణంగా ఉంద‌ట‌. ఆయ‌న తీరుతో ఇప్పుడు టీడీపీ అంటే ప‌డిచ‌చ్చే బీసీల్లో బ‌ల‌మైన శెట్టి బ‌లిజ వ‌ర్గం పార్టీకి దూరం అవుతోన్న ప‌రిస్థితి.

ఎన్ఆర్ఐల ఆసక్తి…..

టీడీపీ అంటే ఎంతో ప్రేమ ఉన్న కొంద‌రు శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన‌ ఎన్నారైలు రామ‌చంద్రాపురం రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తిగా ఉన్నా స‌ద‌రు నేత మాత్రం వారిని రానివ్వడం లేద‌ని తెలుస్తోంది. రామచంద్రాపురంలో నిన్న మొన్నటి వ‌ర‌కు కాపు వ‌ర్గానికి చెందిన తోట త్రిమూర్తులు పార్టీలో ఉన్నా ఆయ‌న వైసీపీలోకి జంప్ చేసేశారు. దీంతో అక్కడ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణును ఢీ కొట్టేందుకు కొంద‌రు శెట్టిబలిజ వ‌ర్గం ఎన్నారైలు ఆస‌క్తిగా ఉన్నా స‌ద‌రు నేత మాత్రం ఇక్కడ కుల రాజ‌కీయాలు చేయ‌డంతో పాటు, త‌న‌కు క‌ప్పం క‌ట్టే స్కెచ్‌ల‌తో ఎవ‌రిని నియోజ‌క‌వ‌ర్గంలోకి రానివ్వకుండా అడ్డుపుల్లలు వేస్తున్నార‌ట‌.

ఈయనను సంప్రదిస్తేనే…?

కోన‌సీమ‌లో కొత్త నేత‌ల‌ను టీడీపీలో చేర్చుకోవాల‌న్నా, ఎవ‌రికి అయినా ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇవ్వాల‌న్నా స‌ద‌రు నేత‌ను లోకేష్‌, చంద్రబాబు త‌ప్పక సంప్రదిస్తున్నారు. దీంతో ఆ నేత ఆడిందే ఆట పాడిందే పాట‌గా మారింది. రాజోలు, టి.గ‌న్నవ‌రంలో కూడా కొంద‌రు నేత‌లు పార్టీని న‌డిపించేందుకు ముందుకు వ‌చ్చినా ఆ నేత వారిని తొక్కిప‌ట్టి… నేత‌ల పోటీ పెరిగాక ఎవ‌రు అయితే త‌న‌కు క‌ప్పం ఎక్కువ క‌డ‌తారో వారికే నాయ‌క‌త్వ ప‌గ్గాలు అప్పగించే కొత్త ప్లాన్‌కు స‌ద‌రు నేత తెర‌దీశారంటున్నారు. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నేత‌ల‌తో క‌లిసి.. వారి మైనింగ్‌, మ‌ట్టి దోపిడీకి స‌హ‌క‌రిస్తూ త‌న వాటా మాత్రం తాను గుట్టుగా తీసుకుని గ‌మ్మునంటున్నార‌ట‌. ఆయ‌న ప్రవ‌ర్తన ఇలాగే కొన‌సాగితే జిల్లాలో టీడీపీ కోసం క‌ష్టప‌డిన వారికి విలువ ఉండ‌ద‌ని.. కోన‌సీమ‌లో పార్టీ భ్రష్టు ప‌ట్టిపోతుంద‌ని టీడీపీ కేడ‌ర్ తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News