అదే టార్గెట్… అందుకే ఒక్కడిగానే?

దుబ్బాక ఉప ఎన్నికలు అధికార పార్టీకి ఛాలెంజ్ గా మారింది. అయితే అంతా హరీశ్ రావు మాత్రమే ఈ ఎన్నికలకు నేతృత్వం వహిస్తున్నారు. రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక [more]

Update: 2020-11-02 09:30 GMT

దుబ్బాక ఉప ఎన్నికలు అధికార పార్టీకి ఛాలెంజ్ గా మారింది. అయితే అంతా హరీశ్ రావు మాత్రమే ఈ ఎన్నికలకు నేతృత్వం వహిస్తున్నారు. రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం తర్వాత హరీశ్ రావు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు ఆనుకుని ఉండటంతో హరీశ్ రావుకు దుబ్బాక ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

గత ఉప ఎన్నికల్లో……

గతంలో నారాయణఖేడ్, పాలేరు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మంత్రుల సేవలందరినీ వినియోగించుకుంది. మండలాల వారీగా మంత్రులను బాధ్యులనుగా నియమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మంత్రులకు ఆ మండలాల బాధ్యతలను అప్పగించారు. ఆ మూడు ఉప ఎన్నికలు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కాదు. అందుకే కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలో మాత్రం హరీశ్ రావు ఒక్కరే బాధ్యతను తీసుకుంటున్నారు.

ఈ ఎన్నికలో మాత్రం…..

హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలే బాధ్యులుగా ఉన్నారు. వారే ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. మంత్రులు ఎవరూ దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లకపోగా, బాధ్యతలను కూడా స్వీకరించలేదు. కొందరు మంత్రులు తమకు ఉప ఎన్నికలో కొన్ని మండలాలను అప్పగించాలని కోరినా హరీశ్ రావు అందుకు అంగీకరించలేదంటున్నారు. గెలుపు తథ్యమని, మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని హరీశ్ రావు వారికి చెప్పినట్లు తెలిసింది.

స్థానిక నేతలతోనే…..

అంటే దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను హరీశ్ రావు భుజానకెత్తుకున్నారు. మండలాలు, గ్రామాల వారీగా తనకు నమ్మకమైన పార్టీ నేతలను నియమించారు. ద్వితీయ శ్రేణి నేతలను ఎక్కువ మందిని హరీశ్ రావు ఇన్ వాల్వ్ చేస్తున్నారు. దుబ్బాక నియోజవకర్గంలో గెలుపు ఖాయమంటున్న హరీశ్ రావు అంతా ఒంటిచేత్తోనే ఉప ఎన్నికను నడిపిస్తున్నారు. కేసీఆర్ కూడా ఉప ఎన్నిక భారాన్ని హరీశ్ రావు మీదనే పెట్టారు. దుబ్బాకలో గెలుపు ఖాయమైనా మెజారిటీ ఎక్కువ తీసుకురావడమే ఇప్పుడు హరీశ్ రావు ముందున్న లక్ష్యం.

Tags:    

Similar News