హరీష్ రావు దూరమవుతున్నారా..?

తన్నీరు హరీష్ రావు… మామ కేసీఆర్ కి తగ్గ అల్లుడు. మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి అండగా ఉన్న నేత. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ [more]

Update: 2019-01-02 02:30 GMT

తన్నీరు హరీష్ రావు… మామ కేసీఆర్ కి తగ్గ అల్లుడు. మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి అండగా ఉన్న నేత. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ రోల్ పోషించే నాయకుడు. టీఆర్ఎస్ కొంత కాలం కింది వరకు హరీష్ రావుకి చాలా ప్రాధాన్యత ఉండేది. అయితే, క్రమంగా ఈ ప్రాధాన్యత తగ్గిపోతుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా కేటీఆర్ కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు అప్పగించాక హరీష్ రావు పార్టీ వ్యవహారాల్లో నామమాత్రం అయిపోయారు. కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే మాత్రమే అన్నట్లుగా హరీష్ రావు మారిపోయారు. ఇటీవలి ఎన్నికలకు ముందు కూడా హరీష్ రావు కీలకంగానే పనిచేశారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ కి సమానంగా పలు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుని ప్రచారం చేసి ఆ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేశారు. తాజా పరిణామాలు చూస్తుంటే హరీష్ రావుకి ప్రగతి భవన్ కి మధ్య గ్యాప్ పెరుగుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.

కేటీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ అయ్యాక

ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత మొదటి రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే, హరీష్ రావు పైకి మాత్రం ఎటువంటి అసంతృప్తి చూపించలేదు. పైగా కేటీఆర్ కి ముందుగా శుభాకాంక్షలు చెప్పింది కూడా ఆయనే. ఇక, కేటీఆర్ కూడా హరీష్ రావు ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి సహకరించాల్సిందిగా కోరారు. హరీష్ రావు కూడా కేటీఆర్ కి తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఓ వైపు కేటీఆర్ బిజీగా మారిపోతే హరీష్ రావు మాత్రం సిద్ధిపేటకే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలంతా కేటీఆర్ ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉండగా హరీష్ రావు మాత్రం ఒంటరిగా మారిపోయారు.

హరీష్ రావుకు ఆ శాఖ ఇవ్వరా..?

అయితే, ఇటీవల ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సమీక్షలో కూడా హరీష్ రావు ఎక్కడా కనిపించలేదు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శించిన సమయంలోనూ హరీష్ రావు లేరు. వాస్తవానికి హరీష్ రావు ఉండాల్సిన అవసరం ఏమీ లేకున్నా… గత క్యాబినెట్ లో హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో హరీష్ చాలానే కృషి చేశారు. దీంతో అన్ని ప్రాజెక్టులపై హరీష్ రావుకు మంచి అవగాహన ఉంది. మరి, మంత్రిగా పనిచేసి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న హరీష్ రావు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు, ప్రాజెక్టు సందర్శనకు హరీష్ దూరంగా ఉండటం ఊహాగానాలకు తెరతీస్తుంది. ఈ క్యాబినెట్ లో హరీష్ రావుకు మంత్రి పదవి దక్కడం ఖాయం కానీ, ఇంతకుముందు ఉన్న నీటి పారుదల శాఖ దక్కే అవకాశం కనిపించడం లేదు. ఇక, ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత కూడా హరీష్ రావు ప్రగతి భవన్ కి కూడా రాలేదనే ఓ ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి, హరీష్ రావులో ఎటువంటి అసంతృప్తి లేదని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఇటీవలి పరిణామాలను బట్టి చూస్తే హరీష్ రావు ఎందుకే ఇబ్బందిగా ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News