జీవీఎల్ తో జింతాక్…జింతాక్

జీవీఎల్ నరసింహారావు….గుంటూరు జిల్లావాసి అయినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఆయనకున్న పట్టు మామూలుగా ఉండందని ఆయనను దగ్గరగా చూసిన వారెవరైనా చెబుతారు. భారతీయ జనతా పార్టీలో తొలుత [more]

Update: 2019-08-30 13:30 GMT

జీవీఎల్ నరసింహారావు….గుంటూరు జిల్లావాసి అయినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఆయనకున్న పట్టు మామూలుగా ఉండందని ఆయనను దగ్గరగా చూసిన వారెవరైనా చెబుతారు. భారతీయ జనతా పార్టీలో తొలుత హస్తిన కార్యాలయంలో పనిచేసిన జీవీఎల్ నరసింహారావు అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు జీవీఎల్ నరసింహారావు బాగా దగ్గరయ్యారు. జీవీఎల్ నరసింహారావు విశ్లేషణలు, నివేదికలు అమిత్ షాను ఆకట్టుకున్నాయంటారు. అందుకే ఆయనకు రాజ్యసభ పదవి తక్కువ కాలంలోనే దక్కిందన్నది ఎవరైనా అంగీకరించే నిజమే.

టీడీపీ హయాంలో….

అలాంటి జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారారు. జీవీఎల్ నరసింహారావు గత తెలుగుదేశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. అనేక సార్లు ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పోలవరం అవినీతిని ఆయన ఎండగట్టిన సందర్భాలు అనేకం. అలాగే చంద్రబాబు పాలనపై కూడా ఆయన తరచూ విరుచుకుపడేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కువగా పాల్గొనే వారు. ప్రధానంగా చంద్రబాబు బీజేపీతో విభేదించిన తర్వాత చంద్రబాబును ఎన్నికల సమయంలో ఒక ఆటాడుకున్నారు.

ఏపీకి దూరంగా…..

అయితే ఎన్నికల అనంతరం ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎల్ నరసింహారావు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సునీల్ దేవ్ ధర్, రామ్ మాధవ్ లాంటి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నా జీవీఎల్ నరసింహారావు మాత్రం ఏపీకి దూరంగా ఉన్నారు.ఇందుకు ప్రధాన కారణం ముఖ్యంగా సుజనాచౌదరి, సీఎం రమేష్ లను పార్టీలోకి చేర్చుకోవడమేనంటున్నారు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావులు ఒకానొకదశలో వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. గతంలో చంద్రబాబుపై ప్రభుత్వంపై విమర్శలు చేసిన తాము ఇప్పుడు ఆ పార్టీకి ఎలా వత్తాసు పలుకుతామని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వంత పాడటం ఇష్టంలేకే….

మరోవైపు కన్నాలక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు చంద్రబాబుకు వంత పాడటం కూడా జీవీఎల్ నరసింహారావుకు నచ్చడం లేదంటున్నారు. అందుకే జీవీఎల్ నరసింహారావు రాజధాని విషయంలో ఫైనల్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ తేల్చి చెప్పారని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వెంటనే వెలికితీయాలన్న డిమాండ్ కూడా జీవీఎల్ నరసింహారావు చేస్తున్నారు. ఇలా జీవీఎల్ నరసింహారావు మాత్రం చంద్రబాబు విష‍యంలో రాజీపడకూడదని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారట. మరి జీవీఎల్ నరసింహారావు బీజేపీకి దగ్గరవ్వాలని భావిస్తున్న చంద్రబాబుకు మోకాలడ్డుతారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News