బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ “పిట్ట “

జీవీ శ్రీ రాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే. అమలాపురం మాజీ ఎంపి హర్ష కుమార్ తనయుడు కావడం తప్ప ఆయనకంటూ వ్యక్తిగత గుర్తింపు వచ్చిన సందర్భాలు [more]

Update: 2021-08-23 09:30 GMT

జీవీ శ్రీ రాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే. అమలాపురం మాజీ ఎంపి హర్ష కుమార్ తనయుడు కావడం తప్ప ఆయనకంటూ వ్యక్తిగత గుర్తింపు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. లండన్ లో చదువుకుని రాజకీయాలపై ఆసక్తితో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తానేమిటో నిరూపించుకోవాలనే తపన శ్రీ రాజ్ లో చాలా ఉంది. ఈ క్రమంలో కొన్ని దూకుడు పనులు చేసి వివాదాల్లో చిక్కుకోవడం శ్రీ రాజ్ కు అలవాటుగా మారింది. ఒక్కోసారి శ్రీరాజ్ చేసే కార్యక్రమాలు తండ్రి హర్ష కుమార్ కు తలపోటుగా మారతాయనే ప్రచారం ఆయన ప్రత్యర్ధులు చేస్తూ ఉంటారు. తాజాగా శ్రీ రాజ్ ట్విట్టర్ కు వ్యతిరేకంగా చేపట్టిన వినూత్న నిరసన దేశవ్యాప్త చర్చకు కాంగ్రెస్ లో తెరతీసింది.

కొత్తగా చేయాలనే ఆత్రం …

సమైక్య ఆంధ్ర ఉద్యమ కారులు హర్ష కుమార్ కాలేజ్ పై దాడి కి పాల్పడినప్పుడు వారిని చితకొట్టి వార్తల్లో నిలిచాడు శ్రీ రాజ్. ఆ తరువాత రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా రాజమండ్రి విమానాశ్రయం కు వెళ్ళి విమానాలనే ఆపాలని చూశాడు హర్ష తనయుడు జీవీ శ్రీ రాజ్. నాడు మీడియా లో శ్రీ రాజ్ హై లైట్ అయ్యాడు. అయితే ఆ కేసు నుంచి బయటపడటానికి చాలా కాలమే పట్టింది. అదే విధంగా హర్ష కుమార్ ను జగన్ సర్కార్ న్యాయమూర్తి పై దూషణ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఎస్ ఐ రొటీన్ గా మాట్లాడిన మాటలను వీడియో రికార్డ్ చేసి వైరల్ గా మారింది. ఇలా సంచలనాలు సృస్ట్టించే క్రమంలో శ్రీరాజ్ తాజాగా కాంగ్రెస్ అధినేత యువరాజు రాహుల్ గాంధీ దృష్టిలో నేరుగా చేసిన ప్రయత్నం వికటించి పార్టీనుంచి సస్పెండ్ కావాలిసి వచ్చింది.

కౌంజు పిట్టను వండి తినడంతో …

ఇటీవల రాహుల్ గాంధీ వర్సెస్ ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఆయన ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ఈ అంశంపై రాహుల్ గాంధీ వరకు తాను చేసిన కార్యక్రమం వెళ్ళాలి అని శ్రీ రాజ్ భావించాడు. వెంటనే కౌంజు పిట్టను తెచ్చి కాల్చి తన అనుచరులతో కలిసి తింటూ కొంత పక్షి మాంసం ట్విట్టర్ ఢిల్లీ హెడ్ క్వార్ట్రర్ కి పోస్ట్ చేశాడు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు శ్రీ రాజ్. ట్విట్టర్ తమ అధినేత కు చేసిన అవమానానికి నిరసనగా శ్రీ రాజ్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు. అనుకున్నట్లే ప్రచారం లభించింది.

రాహుల్ ప్రతిష్టకు…..

అయితే ఈ కార్యక్రమం వివాదాస్పదం అయ్యింది. హర్ష కుమార్ వ్యతిరేక వర్గం పార్టీకి సంబంధం లేని కార్యక్రమాలు తో శ్రీ రాజ్ ఇబ్బంది పెడుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. పక్షిని హింసించి కాల్చి తింటూ రాహుల్ గాంధీ కి చెడ్డపేరు తెస్తున్నారని ఫిర్యాదులు వెళ్ళడంతో చిత్రంగా ఈ వ్యవహారం పై అధిష్టానం సీరియస్ అయ్యింది. శ్రీ రాజ్ ను పార్టీ సస్పెండ్ చేసింది. తానొకటి తలిస్తే పార్టీ మరొకటి తలచిందని మదన పడ్డ శ్రీ రాజ్ సోనియా గాంధీ కి తానే తప్పు చేయలేదంటూ మరో వీడియో పంపి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ వేడుకున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఇటీవలే కాంగ్రెస్ లో కుమారుడితో సహా చేరిన హర్ష కుమార్ కి ఎపి పిసిసి అధ్యక్షుడి పదవి ఖరారు అయ్యేలా ఉన్న తరుణంలో సన్ స్ట్రోక్ ఇబ్బందిగా మారింది.

Tags:    

Similar News