గోదాట్లో దాటేద్దామనేనా?

పాత సామెత ఒకటుంది. …తోక పట్టుకుని గోదావరి ఈదినా…. ఇప్పుడు రాజకీయ నాయకులకు గోదావరి బోటు ప్రమాదం ఒక వరంగా మారింది. తిరిగి లైమ్ లైట్ లోకి [more]

Update: 2019-09-22 00:30 GMT

పాత సామెత ఒకటుంది. …తోక పట్టుకుని గోదావరి ఈదినా…. ఇప్పుడు రాజకీయ నాయకులకు గోదావరి బోటు ప్రమాదం ఒక వరంగా మారింది. తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేందుకు గోదావరి అంశాన్ని వదలకుండా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇందులో మాజీ ఎంపీ హర్షకుమార్ ఒకరు. మాజీ అయి పదేళ్లు అయిన హర్షకుమార్ కు గోదావరి తన పాలిటిక్స్ కు ఊతంలా దొరికినట్లుంది. నిన్న మొన్నటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న హర్షకుమార్ ఇప్పుడు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు.

పడవ ప్రమాదంపై…..

మాజీ ఎంపీ హర్షకుమార్ గోదావరి పడవ ప్రమాదాన్ని అస్సలు వదిలిపెట్టడం లేదు. రెండు రోజుల క్రితం బోటు ప్రమాదానికి కారణం మంత్రి అవంతి శ్రీనివాస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లనే పోలీసులు ఆ బోటును గోదావరిలోకి అనుమతించారని చెప్పారు. పోలీసులు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినా మంత్రి ఫోన్ కాల్ రావడంతో వారు నిస్సహాయులుగా మారారన్నారు. దీనిపై అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పడవ ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దన్నారు. హర్షకుమార్ పై తాను పరువు నష్టం దావా వేస్తానని కూడా హెచ్చరించారు.

వైసీపీనే టార్గెట్ చేసుకుని….

తొలుత ముఖ్యమంత్రి జగన్ ను కొందరు మంత్రులు, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన హర్షకుమార్ తాజాగా ముఖ్యమంత్రి జగన్ కు చిత్తశుద్ధిలేదని నిందించారు. 93 మంది బోటులో ఉన్నారని, ఆ విషయం బయటపడుతుందనే బోటును ప్రభుత్వం కావాలని బయటకు తీయడం లేదని హర్షకుమార్ ఆరోపించారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాదని ఆయన శాపనార్థాలు పెట్టారు. ఇలా హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.

లైమ్ లైట్ లోకి వద్దామని….

హర్షకుమార్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాల జోలికి రాలేదు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేనప్పటికీ సామాజిక అంశాలపై స్పందిస్తారు. గతంలో వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు కూడా జగన్ తన బాబాయి వైఎస్ వివేకాను కొట్టారని సంచలన ట్వీట్ చేశారు. ఇలా వార్తల్లో ఉండాలనుకునే హర్షకుమార్ తిరిగి తన నియోజకవర్గంలో పుంజుకోవాలని చూస్తున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేత హరీష్ మాధుర్ నియోజకవర్గంలో లేకపోవడం, వైసీపీ ఎంపీ పెద్దగా జనంలోకి రాకపోవడంతో తాను తిరిగి నిలదొక్కుకునేందుకు ఇదే సమయమని భావిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరవచ్చని, తాను ప్రజల్లో ఉంటే పార్టీలే టిక్కెట్ ఇస్తాయన్న నమ్మకంతో ఉన్నారట హర్షకుమార్. అందుకే గోదావరిని పట్టుకుని రాజకీయ వెతుకులాటను ప్రారంభించారు.

Tags:    

Similar News