ఈయన వల్లనే సాధ్యమవుతుందా?

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ సొంత గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరు అధిష్టానం దూతలు హర్ష కుమార్ రీ [more]

Update: 2020-10-16 06:30 GMT

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ సొంత గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరు అధిష్టానం దూతలు హర్ష కుమార్ రీ ఎంట్రీ పై చర్చలు సాగించినట్లు ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ లో మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం చేసి ఆ పార్టీ నుంచి రాష్ట్ర విభజన సమయంలో డిస్మిస్ అయ్యారు హర్ష కుమార్. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం లోని జై సమైక్యాంధ్ర పార్టీ లో ఉపాధ్యక్షుడిగా ఉంటూ 2014 ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల చివరి నిమిషంలో తనకు రాజకీయ బద్ధ విరోధి టిడిపి లో చేరి అమలాపురం టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు.

ఆత్మాభిమానంతో టిడిపి కి గుడ్ బై …

ఈ నేపథ్యంలోనే హర్ష కుమార్ టిడిపి అధినేత చంద్రబాబు కాళ్ళు మొక్కడం పెద్ద వివాదమే కావడం ఆత్మాభిమానంతో ఆయన ఆ పార్టీకి దూరం కావడం నాటకీయంగా చక చక జరిగిపోయాయి. దాంతో కొంత కాలం సైలెంట్ అయిన హర్ష కుమార్ ఆ తరువాత జగన్ సర్కార్ వరుస కేసులు అరెస్ట్ ల నేపథ్యంలో అనూహ్యంగా టిడిపి తో అనధికార అనుబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల ముందు కానీ ఈ లోపు కానీ ఆయన తెలుగుదేశం లో అధికారిక చేరిక ఉంటుందని అంతా అంచనా వేశారు. అయితే ఇక ప్రాంతీయ పార్టీల్లో చేరే ఉద్దేశ్యం లేకపోవడం బిజెపి కి తొలి నుంచి దూరం గా ఉండటంతో హర్ష కుమార్ కాంగ్రెస్ చెయ్యి అందుకోవడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. కోస్తా ప్రాంతంలో దళిత సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉండటంతో పాటు ఉద్యమాల నుంచి ఎదిగిన నేతగా హర్ష కుమార్ కి మంచి గుర్తింపు ఉంది.

హస్తాన్ని పైకి లేపగలరా …?

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగు పోయిన కాంగ్రెస్ ను పైకి లేపేందుకు దళిత సామాజిక వర్గం అండ దండా చాలా అవసరమని అంచనా వేసే హస్తం అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా హర్షకుమార్ చేరికకు వెల్కమ్ పలికేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎపి పిసిసి అధ్యక్షుడిగా శైలజానాధ్ ఉన్నా ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసిన చందంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దళిత ఓటు బ్యాంక్ గంప గుత్తగా వైసిపి వైపే ఉంటుందని లెక్కలు తేల్చేస్తున్నాయి. ఇవన్నీ అంచనా వేసుకున్న తరువాత హర్ష కుమార్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లడమే సరైనదిగా భావించారని ఆయన సన్నిహితుల సమాచారం. అయితే ఆయన రాక కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా ? లేక హర్ష కుమార్ కి ఆ పార్టీ కేవలం పునరావాస కేంద్రంగా మారుతుందా అన్నది వేచి చుడాలిసివుంది.

Tags:    

Similar News