కష్టాలు కంటిన్యూ? ఇప్పట్లో వదిలేలా లేవుగా?

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ కి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆంధ్రప్రదేశ్ విభజన తో విభేదించిన ఆయనను పార్టీ డిస్మిస్ చేసింది. [more]

Update: 2020-04-29 05:00 GMT

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ కి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆంధ్రప్రదేశ్ విభజన తో విభేదించిన ఆయనను పార్టీ డిస్మిస్ చేసింది. విభజన సరే కానీ ఆంధ్ర కు న్యాయం చేయని ఆ పార్టీలో తాము వుండమంటూ కొందరు ఎంపీలతో ఆయన గళం కలిపి ప్రజా ఉద్యమ బాట పట్టారు. ఇక ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం లో ఏర్పాటు అయిన జై సమైక్యాంధ్ర పార్టీలో కీ రోల్ పోషించి ఖంగుతిన్నారు. అమలాపురం నుంచి పోటీ చేసిన హర్ష కుమార్ కు జీవితంలో ఎన్నడూ ఎదురుకానీ చేదు అనుభవాలే ఓటమి రూపంలో చవి చూశారు.

బాబు తో ఐదేళ్ళు యుద్ధమే …

అధికారపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా పోరాటమే హర్ష కుమార్ కి అలవాటు అయిన పద్ధతి. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో లేకుండానే ఐదేళ్లపాటు దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంటూ చేయని ఉద్యమమే లేదు. పర్యవసానంగా అనేక కేసులు, గృహ నిర్బంధాలు ఒకటేమిటి అన్ని రుచి చూశారు. అయినా కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇక సార్వత్రిక ఎన్నికలు బాగా దగ్గర పడ్డాకా వైసిపి టికెట్ హర్ష కుమార్ కే జగన్ కేటాయిస్తారని అంతా అనుకున్నా అప్పటికే ఫ్యాన్ పార్టీ అధినేత మరొకరికి టిక్ పెట్టినట్లు తెలియడంతో బాటు ఎంత ఖర్చు చేయగలరనే తూకం ఆయన్ను పసుపు జెండా వైపు చూసేలా చేసింది.

సైకిల్ ఎక్కి తొక్కేలోగా …

అందరూ అనుకున్నట్లే హర్ష కుమార్ తన సెకండ్ ఆప్షన్ లో భాగంగా చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కేశారు. ఈ సందర్భంలో ఆయన దీవెనల కోసం నడుం వంచి పాదాభివందనం చేశారు. ఇది తప్పేమి కానప్పటికీ హర్ష కుమార్ విషయంలో మాత్రం దళితులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు. ఎన్ని అగచాట్లు పడినా అమలాపురం పార్లమెంట్ సీటు తనకే దక్కుతుందన్న హర్ష కుమార్ కు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చేశారు. ఆ స్థానం మాజీ పార్లమెంట్ స్పీకర్ బాలయోగి కుమారుడి కి ఇచ్చేయడంతో హర్ష కుమార్ కి కోపం వచ్చి వెంటనే సైకిల్ దిగిపోయారు. బాబు కి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ దళితులకు ఫత్వా జారీ చేశారు.

రెండిటికి చెడ్డ రేవడిలా …

కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళు ఎంపీ గా వెలుగు వెలిగి రెండు ప్రాంతీయ పార్టీల్లో ఊహించని పరిణామాలను ఎదుర్కొన్న హర్ష కుమార్ అనుకోని పరిస్థితుల్లో టిడిపి కి మళ్ళీ దగ్గరయ్యారు. టిడిపి సర్కార్ లో పెట్టిన కేసులను తరచూ తమ ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్న హర్ష పై చక్కగా వినియోగించుకుంది వైసిపి. ఒక కోర్ట్ లో ఉన్న స్థల వివాదంలో జ్యుడీషియరీ వారితో తగవు పడిన విధానాన్ని గుర్తించి ఆయనపై పాతకేసులు తిరగదోడి నెలన్నరపాటు సెంట్రల్ జైలు ఖైదీని చేసింది పోలీస్ వ్యవస్థ. ఈ సమయంలో జైలు లో ఉన్న హర్ష ను టిడిపి రాష్ట్ర నాయకులు పదేపదే కలవడంతో ఆయన గాలి తిరిగి టిడిపి వైపే తిరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ అధికార వైసిపి పై నిప్పులు చెరిగి చంద్రబాబుకి మరింత దగ్గరయ్యారు హర్ష కుమార్.

కరోనా కష్టాలతో …

హర్ష కుమార్ నిత్యం ప్రజల మధ్య వుండే అలవాటు ఆయన యూనివర్సిటీలో రాజకీయాలు చేసిన సమయం నుంచి ఉంటూ వస్తూనే ఉంది. అయితే కేసులు గృహ నిర్బంధాలు, అరెస్ట్ లు జైలు జీవితంతో నానా సమస్యలు ఎదుర్కొని బయట పడిన హర్ష కుమార్ ఇప్పుడు స్వేచ్ఛగా విహరించకుండా కరోనా వచ్చి పడింది. అదీ ఆయన కు అతి సమీపంలోని మునిసిపల్ కాలనీ లో కావడం ఆ ప్రాంతం రెడ్ జోన్ పరిధి లో ఉండటంతో తిరిగి ఇంట్లో ఉండాలిసిన పరిస్థితి వచ్చేసింది హర్ష కుమార్ కు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదన్నట్లు హర్ష కు అనుకోకుండా వచ్చిన కరోనా ఉపద్రవం కాళ్ళు చేతులు కదలకుండా ఇంటిపట్టునే ఉండేలా బంధించింది. దాంతో కరోనా సేవా కార్యక్రమాల్లో ఆయన ఇంటి నుంచే అన్ని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తమ కళాశాలల తరపున పెద్ద మొత్తాన్నే ఆర్ధిక సాయం ప్రకటించారు కూడా. ఇలా ఆయన పొలిటికల్ గ్రాఫ్ లో 2014 నుంచి గత ఆరేళ్లుగా కష్టాలే మిగిలాయి.

Tags:    

Similar News