హర్షకు అక్కడ లైన్ క్లియర్ అయినట్లేనా?

మాజీ పార్లమెంట్ సభ్యుడు, కోస్తా దళిత నేతల్లో ఛరిష్మా ఉన్న జివి హర్ష కుమార్ కి టిడిపి లైన్ క్లియర్ చేస్తున్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. గత [more]

Update: 2020-04-10 02:00 GMT

మాజీ పార్లమెంట్ సభ్యుడు, కోస్తా దళిత నేతల్లో ఛరిష్మా ఉన్న జివి హర్ష కుమార్ కి టిడిపి లైన్ క్లియర్ చేస్తున్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. గత ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ టికెట్ ను ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడికి చంద్రబాబు ఇవ్వడంతో హర్ష కుమార్ అలిగి ఆ పార్టీ కి గుడ్ బై కొట్టేశారు. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇంటికే పరిమితం అయ్యారు. అంతకుముందు టిడిపి ప్రభుత్వం పై విమర్శలు, ఉద్యమాలతో హోరెత్తించారు. వైసిపి లోకి ఆయన చేరడమే ఆలస్యం ఎంపీ టికెట్ ప్రకటించడమే తరువాయి అన్న రీతిలో గట్టిగా ప్రచారం సాగింది.

రెండు పార్టీలు హ్యాండిచ్చాయి …

అయితే అప్పటికే జగన్ వేరేవారికి బెర్త్ కన్ఫర్మ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సరిగ్గా ఎన్నికల ముందు సైకిల్ ఎక్కేసి తాను ఆధునిక పొలిటీషియన్లకు తీసిపోను అనే భావన జనంలో తెచ్చారు. జివి హర్ష కుమార్ ఈ నిర్ణయం దళితుల్లో ఆయనకు డ్యామేజ్ తెచ్చిపెట్టింది. ఐదేళ్లపాటు టిడిపిని, చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పసుపు పార్టీ జండా కట్టేయడం ఏమిటి ? బాబు కాళ్ళు మొక్కడం ఏమిటి? అన్న ప్రశ్నలు ఆయన్ను అభిమానించే వారి నుంచే మొదలు అయ్యాయి. అయితే ఆ వెంటనే టికెట్ రాకపోవడంతో సైకిల్ దిగి బాబు నమ్మించి మోసం చేశారని దళితులకు ఇది అవమానమే అంటూ మీటింగ్ పెట్టి బూతులు తిట్టి మౌన ముద్ర వహించారు.

వైసిపి అధికారంలోకి వచ్చాకా …

కాంగ్రెస్ పార్టీ వున్నప్పుడు వైఎస్ కి వ్యతిరేక గ్రూప్ లో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రధాన భూమిక వహించిన జివి హర్ష కుమార్ వైసిపి అధికారంలోకి వచ్చాకా ఖాళీగా కూర్చోలేదు. తనకు ఓట్లు వేసిన దళితుల్ని జగన్ దగా చేస్తున్నారనే స్లోగన్ మొదలు పెట్టారు. తద్వారా టిడిపి కి తన అవసరాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. గోదావరి లో మునిగిన బోటు ప్రమాదం పై సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేశారు. ఇలా వచ్చిన ఏ అవకాశం అయన వదులుకోలేదు. ఆయనకు టిడిపి మీడియా సపోర్ట్ కూడా బాగా కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా న్యాయస్థానం కి చెందిన స్థలంలో పేదలను ఖాళీ చేయిస్తున్న సమయంలో హర్షకుమార్ పై కేసు నమోదు అయ్యింది. సాక్షాత్తు జ్యుడీషియరీ వ్యవస్థపై పోరాటం కావడంతో అరెస్ట్ అయిన హర్ష కుమార్ కి బెయిల్ అంత ఈజీ గా రాలేదు. ఒక పక్క ప్రభుత్వం, మరోపక్క జ్యుడీషియరీ ఇంకో పక్క పోలీస్ వ్యవస్థలతో ఒకేసారి వివాదాలు తెచ్చుకోవడంతో సుమారు రెండునెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే హర్షకుమార్ గడపాల్సి వచ్చింది. ఈ కేసును ఉపయోగించుకుని గతంలో చంద్రబాబు సర్కార్ పెట్టిన పాత కేసులను తవ్వి ఆయన నిర్బంధం కొనసాగేలా వ్యవహారం సాగింది.

జైలుకి క్యూ కట్టిన టిడిపి …

హర్ష కుమార్ జైలు జీవితం మొదలు కాగానే ఆయన్ను అత్యధిక శాతం వచ్చి కలిసి వెళ్ళింది టిడిపి నేతలే కావడం గమనార్హం. అందులోను టిడిపి లోని మాజీ మంత్రులు దళిత నేతలు ఉండటం విశేషం. కట్ చేస్తే జైలు నుంచి వచ్చాకా చంద్రబాబు నేరుగా ఫోన్ లో జివి హర్ష కుమార్ ను పలకరించడం వారిద్దరూ చాలా సేపు చర్చించుకోవడం జరిగాయి. ఆ తరువాత హర్ష కుమార్ పూర్తిగా మారిపోయారు. వీలైనప్పుడల్లా సామాజిక వేదికలు మీడియా సమావేశాల్లో జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ ను వైసిపి సానుభూతి పరులు అడ్డుకోవడం తెలిసిందే. ఆ సమయంలో వారి దాడిని ఖండిస్తూ లోకేష్ ఇప్పుడు పరిపూర్ణ నాయకుడుగా గుర్తింపు పొందాడు అంటూ ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో వ్యాఖ్యలు పెట్టారు. తాజాగా కరోనా వైరస్ కట్టడిలో జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతీ చర్య పైనా విమర్శలు ఆరోపణల దాడులు తన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తునే మొదలు పెట్టారు హర్ష కుమార్.

సమయం వచ్చినప్పుడే …

ఈ పరిణామాలు అన్ని గమనిస్తే హర్ష కుమార్ రూట్ ఇక తిరిగి సైకిల్ వైపే అన్నది స్పష్టం అవుతుందంటున్నారు విశ్లేషకులు. టిడిపి కి కూడా ఒక బలమైన దళిత నేత అవసరం చాలా ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైసిపి దళిత ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టే నాయకుడు ప్రస్తుతం టిడిపి లో ఎవరు కనపడటం లేదని అంటున్నారు. వర్ల రామయ్య వంటివారు మౌత్ పీస్ లుగా పనికొస్తారు కానీ క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు నిర్మించడం సుదీర్ఘ రాజకీయ వ్యూహాలతో సాగడం వంటివి చేయలేరని హర్ష కుమార్ వంటివారితో ఆ లోటు భర్తీ అవుతుందన్నది తెలుగుదేశం అంచనాగా పొలిటికల్ టాక్. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు టిడిపి తీర్ధాన్ని రెండోసారి హర్షకుమార్ స్వీకరించే అవకాశాలు లేనట్లు స్పష్టం అవుతుంది. పార్టీలో చేరి విమర్శించడం కన్నా ఏ పార్టీలో లేకుండా చేసే విమర్శలకే విలువ ఉంటుందన్న స్ట్రేటజీ నే హర్షకుమార్ ఫాలో అవుతున్నారని సమయం వచ్చే వరకు వేచి చూస్తారని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం.

Tags:    

Similar News