గురజాడకు గుజరాత్ కు లింకు ఎక్కడ కుదిరిందబ్బా?

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మహాకవి గురజాడ అప్పారావుని ఈ తరం రాజకీయ నాయకులు అసలు తలచుకోరు. చాలా మందికి ఆయన పేరు కూడా తెలియదు. ఆయన ఎక్కడ [more]

Update: 2021-01-18 03:30 GMT

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మహాకవి గురజాడ అప్పారావుని ఈ తరం రాజకీయ నాయకులు అసలు తలచుకోరు. చాలా మందికి ఆయన పేరు కూడా తెలియదు. ఆయన ఎక్కడ పుట్టాడు అన్నది కూడా ఎవరికీ ఎరుక లేదు. ఇక ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం కూడా తెలిసిన వారు ఎంతమంది అంటే చెప్పడం కష్టమే. మరి ఎక్కడి విజయనగరం, మరెక్కడి ఢిల్లీ. ఎక్కడి గురజాడ, మరెక్కడి గుజరాతీ మోడీ. అయినా లింక్ కలిపేశారు. అతి పెద్ద భారతావనిని అజేయంగా ఏడేళ్ళుగా ఏలుతున్న ఎదురులేని ప్రధాని నోటి వెంట గురజాడ దేశభక్తి గీతం పలికింది అంటే తెలుగు వారికి ఒకింత గర్వమే. ప్రత్యేకించి ఉత్తరాంధ్రులకు అది ఇంకా గర్వ కారణ‌మే.

దక్షిణాది మీద‌ ప్రేమలో….

మోడీకి ఇప్పటికీ ఉత్తరాది మోజు పోయిందని ఎవరూ అనుకోరు. ఆయన ఏ భారీ ప్రాజెక్ట్ చేపట్టినా అక్కడే శ్రీకారం చుడతారు. నోరున్న దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో కొంత నిధులు అయినా దక్కుతాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవేశం తప్ప ఆలోచన లేని ఏపీని కేంద్రం అసలు పట్టించుకోదు అన్నది కూడా అందరికీ విదితమే. మరి అటువంటి మోడీ వరసగా రెండు రోజుల పాటు దక్షిణాది ప్రముఖుల పేర్లు తన ఉపన్యాసాలలో వల్లించారు. అది యాధృచ్చికం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దక్షిణాది మీద ఈ మధ్యకాలంలో బీజేపీకి పొంగిపోతున్న ప్రేమగానే దాన్ని చూడాలి.

తమిళ ఇలవేలుపుగా…?

తొందరలో తమిళనాడు శాసనసభ‌ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి జనాల హృదయాల్లో ఎప్పటికీ కొలువుండి పోయే ఆరాధ్య దైవం ఎమ్జీఆర్ పేరుని ప్రధాని మోడీ తన నోటి వెంట ఉచ్చరించారు. ఎమ్జీఆర్ ని పొగిడారు. ఆయన సేవల గురించి మనసారా తలచుకున్నారు. దేశంలో ఎనిమిది రైళ్ళను ఒకేసారి ప్రారంభించిన వేళ తమిళనాడు గురించి ఆయన మాట్లాడుతూ ఎమ్జీఆర్ ప్రస్తావన తెచ్చారు. దానికి ఎన్నికలే కారణం అనుకుంటే తెలుగు కవి గురజాడ పేరుని చదవడం వెనక కూడా అలాంటి పరమార్ధం ఉండే తీరుతుందని అనుకోవడంలో తప్పులేదుగా.

ఉత్తరాంధ్రా వైతాళికుడు…

గురజాడ అప్పారావు ఉత్తరాంధ్రా వైతాళికుడు. ఆయన పేరుని ఆయన గేయాన్ని చదవడం ద్వారా మోడీ ఉత్తరాంధ్ర వాసుల గుండె తలుపులు తట్టారు. ఈ మధ్యకాలంలో బీజేపీ ఉత్తరాంధ్రను టార్గెట్ చేసింది. సరిగ్గా ఇదే సమయాన మోడీ కూడా గురజాడ అడుగుజాడలలో నడిచారు దీన్ని బట్టి చూస్తే బీజేపీకి తెలుగు రాజకీయాల మీద అందునా ఏపీ మీద ఎంతటి ఆరాటం ఉందో అర్ధమవుతోంది అన్న వారు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర మీద బీజేపీ ప్రేమ ఉత్త మాటల్లోనే అన్న వారూ ఉన్నారు. ఏపీలోని వెనకబడిన ఏడు జిల్లాల‌కు కేంద్రం ఏటా ఇచ్చే 350 కోట్ల రూపాయల నిధులను మోడీ మూడేళ్ళ క్రితమే ఆపేశారు. అందులో ఉత్తరాంధ్రా జిల్లాల వాటా 150 కోట్లు ఉంది. ఇప్పటికి అది 450 కోట్లు దాటింది. మరి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే ఆ నిధులు ఇవ్వవచ్చు కదా అంటున్నారు మేధావులు. విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించి చేతులు దులుపుకున్నారు కానీ ఇంతవరకూ దాని అతీ గతీ లేదు. ఇక ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు పరిశ్రమను సౌత్ కొరియాకు చెందిన పోస్కో సంస్థకు అప్పగిస్తున్నారు అన్న ప్రచారం మరో వైపు ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే అర్జంటుగా గురజాడ మోడీకి గుర్తుకురావడం ఆశ్చర్యమే అంటున్నారు. చూడాలి మరి ఇంకెంతమంది తెలుగు ప్రముఖుల పేర్లు బీజేపీ పెద్దల నోటి వెంట వస్తాయో. ఈ సంబరం ఎందాక సాగుతుందో.

Tags:    

Similar News