గురజాల గడ్డపై గెలుపెవరిది..?

గుంటూరు జిల్లాలో హాట్ సీట్ గా ఉన్న నియోజకవర్గం గురజాల. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన [more]

Update: 2019-04-07 13:30 GMT

గుంటూరు జిల్లాలో హాట్ సీట్ గా ఉన్న నియోజకవర్గం గురజాల. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టడంతో పోరు తీవ్రంగా మారింది. రెండు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి. మైనింగ్ కు అడ్డాగా ఉన్న ఈ నియోజకవర్గంలో డబ్బు ప్రభావం కూడా ఎక్కువగా ఉండనుంది. రెండు పార్టీలూ గురజాల నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గురజాలలో ఏ పార్టీ గెలుస్తుందనేది ఎవరి అంచనాలకూ అందడం లేదు.

ఆరోసారి పోటీ చేస్తున్న యరపతినేని

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున యరపతినేని శ్రీనివాసకరావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జంగా కృష్ణమూర్తిపై 7,187 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి యరపతినేని శ్రీనివాసరావు వరుసగా ఐదుసార్లు పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు. ఆరోసారి పోటీ చేస్తున్న ఆయన నియోజకవర్గంలో బాగా బలం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిన జంగా కృష్ణమూర్తిని ఈసారి పక్కన పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల క్రితం కాసు మహేష్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనకు టిక్కెట్ కేటాయించింది. దీంతో రెండేళ్ల ముందే గురజాల నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. కాసు కుటుంబానికి సైతం ఈ ప్రాంతంలో మంచి పేరు ఉండటంతో యరపతినేనికి ఆయన బలమైన ప్రత్యర్థిగా మారారు.

ఇద్దరు నేతలు కలవడంతో…

కాసు మహేష్ రెడ్డిని గురజాల వైసీపీ ఇంఛార్జిగా నియమించినా జంగా కృష్ణమూర్తి పార్టీలోనే కొనసాగారు. బీసీ సామాజకవర్గానికి చెందిన ఆయనకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గతంలో రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు ఇక్కడ మంచి పట్టుంది. దీంతో కాసు, జంగా సమన్వయంతో పనిచేస్తుండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మహేష్ రెడ్డి యువకుడు కావడం, పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి అవడం, రెండేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసుకొని బలం పెంచుకోవడం, ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. వైసీపీకి కూడా ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది.

అభివృద్ధితో పాటు ఆరోపణలు కూడా…

ఇక, యరపతినేని శ్రీనివాసరావు ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. ఇరవై ఐదు ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండటం, ప్రజలతో సత్సంబంధాలు ఉండటం, ప్రజల్లో ఉండారనే పేరు ఉండటం ఆయనకు సానుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఆయన విజయంపై టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే స్థాయిలో యరపతినేనిపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆయన అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు బాగా వచ్చాయి. మైనింగ్ వ్యాపారం చేసే ఆయన ఇతర చిన్నచిన్న వ్యాపారులను ఎదగనీయరనే పేరుంది. ఈ ఆరోపణలను వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే, కాసు మహేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా యరపతినేనిని ఓడించడం మాత్రం అంత సులువుగా కనిపించడం లేదు.

Tags:    

Similar News