క్విట్ అన్నారు సరే.. క్లిక్ కావాలిగా?

రాజకీయాల్లోకి ఉన్నతాధికారులు రావడం మామూలే. ఎన్నికల సమయంలో పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ పదవికి స్వచ్ఛంద రాజీనామా చేసి వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే [more]

Update: 2020-09-30 17:30 GMT

రాజకీయాల్లోకి ఉన్నతాధికారులు రావడం మామూలే. ఎన్నికల సమయంలో పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ పదవికి స్వచ్ఛంద రాజీనామా చేసి వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే వారందరిలో కొందరు క్లిక్ కాగా, మరికొందరు రాజకీయాల్లో తేలిపోయారు. అయితే ఎక్కువ మంది రాజకీయాల్లో రాణించలకపోయిన వారే ఎక్కువ ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అధికారిగా ఉండగా ప్రజలు ఆదరించడం వేరు. అదే సమయంలో రాజకీయ నాయకుడి అవతారమెత్తి రావడాన్ని ప్రజలు మరో రకంగా చూస్తున్నారు.

లక్ష్మీనారాయణ కూడా….

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ మంచి అధికారిగా పేరుపొందారు. ఆయన అధికారిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడకు వెళ్లినా మీడియాతో సహా ప్రజలు కూడా నీరాజనాలు పలికేవారు. లక్ష్మీనారాయణను జేడీగా చూసేందుకు అధిక సంఖ్యలో నాడు జనం తరలి వచ్చే వారు. సిబీఐలో స్ట్రిక్ట్ అధికారిగా ఆయన పేరు తెచ్చుకోవడం, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేసులను ఆయన డీల్ చేయడం వంటివి లక్ష్మీనారాయణకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయని చెప్పాలి.

తాజాగా బీహార్ డీజీపీ….

ఇక ఆయన అధికారిగా రాజీనామా చేసి జనం బాట పట్టారు. కానీ రాజకీయాల్లో లక్ష్మీనారాయణ ప్రయాణం సాఫీగా లేదనే చెప్పాలి. పాలిటిక్స్ లో ప్లాప్ అయ్యారు. జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపార్టీలోనూ లేరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో వచ్చిన ఈ నిజాయితీ గలిగిన అధికారిని జనం విశ్వసించలేదు. ఇప్పుడు ఇదే బాటలో బీహార్ డీజీపీ ఉన్నారు. బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆయనకు 2021 ఫిబ్రవరి వరకూ పదవీ కాలం ఉన్నా తన పదవికి రాజీనామా చేశారు.

ప్రజలు ఆదరిస్తారా?

ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నుంచి ఆయన రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. బీజేపీ నాయకత్వం కూడా హామీ ఇవ్వడంతో గుప్తేశ్వర్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన బక్సర్ నుంచి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఆయన సుశాంత్ సింగ్ మృతికేసును సీబీఐకి అప్పగించడంలో కీలక భూమిక పోషించారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే రాబిన్ హుడ్ అంటూ ఆయనను ఆకాశానికెత్తుతూ పెద్దయెత్తున బీహార్ లో ప్రచారం జరుగుతుంది. మరి ఈ మాజీ డీజీపీని జనం ఎలా ఆదరిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News