పల్నాడులో ఆ సీటు మళ్లీ వైసీపీదే..?

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 12 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా వైఎస్సార్ [more]

Update: 2019-05-22 00:30 GMT

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 12 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి గుంటూరు జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని, రాజధాని కూడా గుంటూరు జిల్లాలోనే రావడంతో జిల్లాలో మరోసారి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. ఇక, ఈసారైనా జిల్లాలో సీట్ల సంఖ్యను పెంచుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ తహతహలాడుతోంది. దీంతో సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకోవడంతో పాటు కొత్తగా తెలుగుదేశం పార్టీ స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది.

విజయంపై ధీమాగా పిన్నెల్లి

జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. ఇక్కడ వైసీపీ రెండుసార్లు విజయం సాధించింది. 2012 ఉప ఎన్నికల్లోనూ మాచర్లలో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. 2009లో ఆయన కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ 15 అసెంబ్లీ స్థానాలను గెలవగా 2014లో వీటిల్లో 12 స్థానాల్లో ఓడిపోయింది. ఉప ఎన్నికల్లో గెలిచి మళ్లీ 2014లో వైసీపీ గెలిచిన మూడు స్థానాల్లో మాచర్ల ఒకటి. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బలమైన నేతగా ఉండటం, నిత్యం ప్రజల్లో ఉంటారనే పేరు ఉండటం, సామాజకవర్గ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో పిన్నేల్లి రామకృష్ణారెడ్డికి కలిసివచ్చింది. దీంతో ఈసారి కూడా మళ్లీ తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమాగా ఉన్నారు.

టీడీపీ బలహీనతలే వైసీపీ బలం

ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనతలే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లికి బలంగా మారాయి. గత మూడు ఎన్నికలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. 2009లో ఓడిన బ్రహ్మానందరెడ్డికి 2012 ఉప ఎన్నికలో టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో మధుబాబును పోటీకి దింపిన టీడీపీ 2014లో చలమారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో మధుబాబు, చలమారెడ్డి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరకు అంజిరెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. దీంతో మాచర్ల తెలుగుదేశం పార్టీ మూడువర్గాలుగా ఉంది. ఇది టీడీపీకి ప్రధాన మైనస్ గా మారింది. ఎన్నికల నాటికి విభేదాలు వీడినట్లు కనిపించినా టీడీపీ గెలుపు కోసం కొందరు టీడీపీ నేతలే మనస్ఫూర్తిగా పనిచేయలేదు. నియోజకవర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. 34 వేలు ఉన్న ఎస్సీ ఓట్లు ఎటువంటి మొగ్గితే విజయం వారిదే. వీరి తర్వాత రెడ్లు 30 వేలు ఉన్నారు. ఈ రెండు వర్గాల ఓట్లు వైసీపీకి ఎక్కువ పడే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థి కూడా రెడ్డినే అయినా వారి ఓట్లు మాత్రం వైసీపీకే ఎక్కువ పడ్డట్లు కనిపిస్తోంది. టీడీపీ కమ్మ, బీసీ ఓట్లపై నమ్మకం పెట్టుకుంది. ఇక, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయకపోవడం ఆయనకు మైనస్ గా కనిపిస్తోంది. మొత్తంగా పోటీ కొంచెం తీవ్రంగానే ఉన్నా వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News