గుణ 369 మూవీ రివ్యూ

బ్యానర్‌: జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ నటీనటులు: కార్తికేయ, అనఘ, సాయికుమార్‌, ఆదిత్య మేనన్‌, నరేష్‌, మంజు భార్గవి, హేమ, మహేశ్‌ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: చైతన్‌ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ: [more]

Update: 2019-08-02 13:04 GMT

బ్యానర్‌: జ్ఞాపిక ప్రొడక్షన్స్‌
నటీనటులు: కార్తికేయ, అనఘ, సాయికుమార్‌, ఆదిత్య మేనన్‌, నరేష్‌, మంజు భార్గవి, హేమ, మహేశ్‌ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: రామ్‌
నిర్మాత: అనిల్‌ కడియాల, తిరుమలరెడ్డి
దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల

RX 100 అనే బోల్డ్ సినిమాతో ఒక్కసారిగా హీరో గా ఫేమ్ సంపాదించిన కార్తికేయ.. ఆ సినిమా హిట్ అవడంతో కార్తికేయ క్రేజ్ పెరిగింది. RX 100 తర్వాత కార్తికేయ కూడా అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ లా మరిపోయి బాగా బిజీ అవుతాడని అనుకున్నారు. కానీ కార్తికేయ తెలుగు, తమిళంలో హిప్పీ అనే సినిమా చేసాడు. ఆ సినిమా కార్తికేయ క్రేజ్ ని అమాంతం కిందకి లాగేసింది. హిప్పీ సినిమా తో కార్తికేయ ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యింది. తరవాత బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, ప్రవీణ్ కడియాల, అనిల్ కడియాల మొదటిసారి నిర్మిస్తున్న గుణ 369 లో నటించాడు కార్తికేయ. దర్శకుడు కొత్తవాడే, నిర్మాతలు కొత్తవారే అయినా.. గుణ 369 మీద మొదటినుండి అంచనాలు ఉన్నాయి. సినిమా పోస్టర్స్ దగ్గరనుండి, సినిమా ట్రైలర్ వరకు గుణ 369 మీద అంచనాలు పెరిగేలా చేశాయి. మరి మూడో సినిమా తో కార్తికేయ మంచి హిట్ అందుకున్నాడా? మొదటిసారి దర్శకత్వం వహించిన అర్జున్ జంధ్యాల గుణ తో ఎలాంటి హిట్ కొట్టాడు? మొదటిసారి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన అనిల్ కడియాల నిర్మాతగా సక్సెస్ అయ్యారా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకునే గుణ(కార్తికేయ) మధ్య తరగతి యువకుడు. గుణకు కుటుంబం అంటే చాలా ఇష్టం. గుణకి ఓ చెల్లెలు ఉంటుంది. గుణ చెల్లెలి కోసం సంబంధాలు చూస్తుంటారు. ఇక గుణ ఎవరి విషయంలోనూ తలదూర్చడు చాల సౌమ్యుడు. అంత డీసెంట్ గా ఉండే అలాంటి అబ్బాయి గీత(అనఘ) ను మొదటిసారి చూసి ఇష్టపడతాడు. గీత కూడా గుణను ప్రేమిస్తుంది. అలా ప్రశాంతంగా సాగిపోతున్న గుణ జీవితం ఒక్కసారిగా కుదుపులకు లోనవుతుంది. తన స్నేహితుడిని కాపాడబోయి గుణ చిక్కుల్లో పడడమే కాకుండా అతని కుటుంబాన్ని, ప్రేమించిన గీతని కూడా ప్రమాదంలో పడేస్తాడు. ఒకడికి మంచి చేయడం వల్ల గుణకి చెడే ఎదురవుతుంది. అసలు గుణ స్నేహితుడికి వచ్చిన సమస్య ఏంటి? స్నేహితుణ్ని కాపాడబోయి గుణ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? ఎప్పుడూ గొడవలకు వెళ్లని గుణ తన కుటుంబాన్నే సమస్యల్లోకి ఎందుకు నెట్టాల్సి వస్తుంది? ఆ సమస్య నుండి గుణ తనని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేది గుణ 369 మిగతా కథ.

నటీనటుల నటన:

RX 100 సినిమాలో చాలా నేచురల్ గా నటించిన కార్తికేయ హిప్పీ సినిమాలో బాడీ ని చూపిస్తూ తనెంతగా సిక్స్ ప్యాక్ కోసమా కష్టపడ్డానో అంటూ చొక్కా విప్పి తెగ చూపించాడు తప్ప.. నటన పరంగా హిప్పీలో అంతగా లేదు. కానీ మూడో సినిమా గుణ 369 కొచ్చేటప్పటికీ కార్తికేయ నటనలో చాలా ఇంప్రూవ్ మెంట్ కనబడింది. ఫస్ట్ హాఫ్ లో చాలా సైలెంట్ గా అల్లరి చేస్తూ డీసెంట్ గా కనబడిన కార్తికేయ సెకండ్ హాఫ్ లో చాలా ఫాస్ట్ గా యాక్షన్ హీరోలా మెప్పించాడు. ప్రీ క్లయిమాక్స్ కొచ్చేసరికి కార్తికేయ నటన అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనఘా లుక్స్ పరంగా సింపుల్ గా ఉన్నాయి. అలాగే.. నటనలో కూడా పర్వాలేదనిపించింది. ఇక హీరో తల్లి తండ్రి పాత్రలో హేమ, నరేష్ లు ఆకట్టుకున్నారు. గద్దల గుట్ట రాధాగా ఆదిత్య మీనన్ తన భారీ విగ్రహంతో డైలాగ్ డెలివరీతో భయపెట్టాడు.ఇక గుణ 369 సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో జబర్దస్త్ మహేష్ సూపర్బ్. ఈ సినిమాతో మహేష్ కి మరింతగా మంచి ఫేమ్ రావడం ఖాయం. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ కి మెచ్చే మసాలా సినిమాలు. మరి ఆయన శిష్యుడు అర్జున్ జంధ్యాల కూడా దర్శకుడిగా మారి సినిమా తీస్తే… అది బోయపాటి సినిమాలకు దగ్గరగానే ఉంటుంది. గురువు గారి మాస్ ని తన సినిమాలోనూ చూపించడానికి ప్రయత్నిస్తాడు కానీ.. కొత్తగా ఎందుకు ట్రై చేస్తాడు అన్నట్టుగా ఉంది గుణ 369 సినిమా కూడా. ప్రేమకథ లకు యాక్షన్ జోడిస్తే.. అన్నపాయింట్ లో చాలా సినిమాలే అవచ్చాయి. ప్రేమకథలు పాతవే అయినా… యాక్షన్ ని కొత్తగా ప్రెజెంట్ చేస్తూ కథనాన్ని గొప్పగా నడిపించగలిగితే ఆ సినిమాలు హిట్ అవుతాయి. ఇక గుణ 369 సినిమా కథ విషయానికొస్తే.. మద్యారగతి యువకులు.. గొడవల్లో వేలుపెడితే తమతో పాటు తమ కుటుంబం కూడా సమస్యల్లో ఇరుక్కుంటుందని అలోచించి గొడవలకు ఓ అడుగు దూరంగానే ఉంటారు. అలానే గుణ కూడా ఉంటాడు. కానీ అనుకోకుండా గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తే… తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళియువకుడే గుణ. సమాజంలో మనకు కనిపించిన విషయాలే తెరపై కథగా మలచడానికి దర్శకుడు అర్జున్ జంధ్యాల ప్రయత్నించాడు. కథను చాలా సున్నితంగా ప్రారంభించి మెల్లిగా అసలు విషయంలోకి వెళ్లాడు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో హీరోగారి ప్రేమ వ్యవహారాలు, పాటలు కాస్త బోరు కొట్టించినా,…. ఇంటరెవెల్ బ్యాంగ్ లో వచ్చే ఓ ట్విస్ట్ అబ్బురపరుస్తుంది. అసలు ఆ ట్విస్ట్ ని ఎవరు ఊహించనిది. ఇక సెకండ్ హాఫ్ లో హీరో తనకొచ్చిన సమస్యకు కారణాలు, దానివెనుకున్న వ్యక్తులను వెతుకుతూ బయలు దేరుతాడు. ఇక విలన్స్ మీద ఎలా పగదీర్చుకున్నాడో అనేది… సినిమా అయిపోతుందనగా, కథకు సంబంధించిన మరో ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. అది మరింత ఆశ్చర్య పరుస్తుంది. నిజానికి ఆ మలుపే గుణకు ప్రత్యేకత తీసుకొస్తుంది. ఇక సినిమాకి మెయిన్ బలం క్లైమాక్స్ ఒక్కటే. తాను చెప్పాలనుకున్న పాయింట్ ని ఇక్కడ దర్శకుడు స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశాడు.

సాంకేతికంగా…

చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం తన మాత్రం బాగానే ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. అక్కడక్కడా నేపధ్య సంగీతం సినిమాని నిలబెడుతుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో మెయిన్ అస్సెట్. ప్రొడక్షన్ వాల్యూస్ వీక్ గా ఉన్నప్పటికీ వాటిని కప్పేసి ప్రయత్నం కెమెరా బాగా చేసింది. ఎడిటింగ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ లో చాలా కత్తెర వేయాల్సిన సీన్స్ ని చాలా ఈజిగా వదిలేశారేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ఇక నిర్మాణ విలువలు మాత్రం అంతంత మాత్రంగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్: ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, కార్తికేయ నటన, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, కథ, కథనం, లవ్ ట్రాక్, పాటలు

రేటింగ్: 2.25/5

Tags:    

Similar News