బెంజి కారు.. సారును ఇంటికి పంపుతుందా?

మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లే కన్పిస్తుంది. ఏపీ మంత్రివర్గంలో వరస ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. [more]

Update: 2020-09-24 08:00 GMT

మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లే కన్పిస్తుంది. ఏపీ మంత్రివర్గంలో వరస ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. జయరాం పై వచ్చిన ఆరోపణలపై నిజమెంతో తెలుసుకోవాలని జగన్ సీఎంఓ ఉన్నతాధికారిని కోరినట్లు సమాచారం. విచారణలో తప్పు ఉన్నట్లు తేలితే గుమ్మనూరి జయరాంను మంత్రివర్గం నుంచి జగన్ తొలిగించడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

పదిహేను నెలల్లో…..

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను అవినీతిని సహించనని చెప్పారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని తొలి మంత్రివర్గ సమావేశంలోనే జగన్ హెచ్చరించారు. ఈ పదిహేను నెలల కాలంలో జయరాం మీద తప్పించి పెద్దగా ఏ మంత్రిపైనా అవినీతి ఆరోపణలు ఇంతగా రాలేదు. ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి తప్పించి మంత్రులపై మాత్రం రావడం లేదు. నేరుగా సీఎంఓ పర్యవేక్షిస్తుండటంతో మంత్రులు కూడా అవినీతికి పాల్పడే ఆస్కారం లేదని జగన్ భావించారు.

వరస ఆరోపణలు…..

కానీ గుమ్మనూరి జయరాం పై వరస ఆరోపణలు వస్తుండటం జగన్ కు కూడా చికాకు తెప్పిస్తుందంటున్నారు. ఆయన సొంత గ్రామం గుమ్మనూరులో పేకాట క్లబ్ ను నిర్వహిస్తుండగా పోలీసులు రైైడ్ చేశారు. ఈ పేకాట క్లబ్ ను మంత్రి జయరాం సోదరుడు నిర్వహిస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిని మంత్రి జయరాం ఖండించారు. తాజాగా ఈఎస్ఐ స్కాం కూడా జయరాం మెడకు చుట్టుకునేలా కన్పిస్తుంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జయరాం కుమారుడికి ఈఎస్ఐ స్కాంలో ఉన్న నిందితుడు బెంజి కారు కొనిచ్చారని ఆరోపణ చేశారు. అయితే దీనిని మంత్రి జయరాం ఖండించారు.

మంత్రిపై నిర్ణయం….?

తాను మంత్రిగా ఉండి బెంజికారు బహుమతిగా తీసుకుంటే కార్తీక్ అనే వ్యక్తి నిందితుడిగా ఎలా ఉంటాడని జయరాం ప్రశ్నించారు. అయితే కార్తీక్ ను మంత్రి సిఫార్సుల మేరకే 14వ నిందితుడిగా ఏసీబీ చేర్చిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ బెంజి కారు వివాదంలో మంత్రి పాత్ర ఎంత ఉందన్నది పక్కన పెడితే జగన్ దృష్టిలో ఈయన పడినట్లేనని అంటున్నారు. జగన్ కు ఈ ఆరోపణలపై స్పష్టత వస్తే మంత్రి జయరాం విషయంలో కఠిన నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి జయరాం ఈ బెంజికారు వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి మరి.

Tags:    

Similar News