విశాఖ సిటీని కెలుకుతున్న గుడివాడ ?

విశాఖ సిటీలో వైసీపీ వీక్ గా ఉన్న మాట వాస్తవమే. ఆ లోటుని భర్తీ చేసేందుకు స్థానికంగా వేరే పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తెచ్చారు. ఇక [more]

Update: 2021-01-12 08:00 GMT

విశాఖ సిటీలో వైసీపీ వీక్ గా ఉన్న మాట వాస్తవమే. ఆ లోటుని భర్తీ చేసేందుకు స్థానికంగా వేరే పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తెచ్చారు. ఇక మరో వైపు లోకల్ లీడర్స్ కూడా ఈ మధ్య జోరు చేస్తున్నారు. జగన్ ఆదేశాల మేరకు తమ పనితీరు మెరుగుపరచుకుంటున్నారు. కానీ సందంట్లో సడేమియా అనుకుంటూ రూరల్ జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు సిటీ మీద పెత్తనానికి రెడీ అయిపోవడంతో సొంత పార్టీలోనే విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

ఎక్కడి గుడివాడ…?

గుడివాడ అమరనాధ్ రూరల్ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే. ఆయన రూరల్ వ్యవహారాలను చూసుకోకుండా సిటీ రాజకీయాల్లో వేలు పెట్టడం పట్ల ఇపుడు వైసీపీలో నేతలు ఒక్క లెక్కన రగులుతున్నారు. ఆయనకు ఇక్కడ ఏం పని అని కూడా గుస్సా అవుతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళూ ఈ మధ్యన నడచాయి. దానికి బదులుగా అన్నట్లుగా తూర్పు వైసీపీ ఇంచార్జి అక్రమాని విజయనిర్మల వెలగపూడిని టార్గెట్ చేశారు. ఆమె ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపట్టారు. అయితే మధ్యలోకి గుడివాడ అమరనాధ్ ఎంటర్ కావడమే అసలైన పొలిటికల్ ట్విస్ట్.

సత్తా లేదనా…?

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమాన విజయనిర్మల వచ్చిన తరువాత వైసీపీ కార్యక్రమాల జోరు పెరిగింది. ఆమె కూడా టీడీపీ ఎమ్మెల్యేని గట్టిగా ఢీ కొంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె చివరి నిముషంలో పోటీకి దిగినా కూడా వెలగపూడి మెజారిటీని సగానికి సగం తగ్గించారు. ఆమెకే 2024లో టికెట్ ఇస్తారని కూడా అంటున్నారు. అయితే ఆమెని పూర్తిగా సైడ్ చేసి మరీ గుడివాడ అమరనాధ్ తూర్పులో హల్ చల్ చేయడమే ఇపుడు వైసీపీలో చిచ్చు రేపుతోంది. పైగా అక్రమానని పక్కన పెట్టి ఆమె ఓటమిని కృషి చేసిన పార్టీలో మరో నేతను వెంటబెట్టుకుని గుడివాడ సొంతంగా ఆందోళనలు చేయడం వల్ల వర్గ పోరు మరింత పెరిగింది అంటున్నారు. దీన్ని అక్రమాన వర్గీయులు హై కమాండ్ దృష్టికి తెచ్చి ఫిర్యాదు చేశారు కూడా.

మంత్రి కోసమేనా…?

ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరిగే విస్తరణలో మంత్రి కావాలన్న ఏకైక అజెండాతోనే గుడివాడ అమరనాధ్ ఇలా హద్దులు దాటుతున్నాడని వైసీపీలో మరో వర్గం ఆరోపిస్తోంది. ఆయన ఉన్న అనకాపల్లిలో పార్టీని పట్టించుకోకుండా సిటీ మీద చూపు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. మంత్రి అవంతి వర్గాన్ని పక్కన పెట్టి వ్యతిరేక వర్గాన్ని చేరదీయడం ద్వారా సిటీలో వైసీపీని మరింతంగా నష్టపరచాలని గుడివాడ అమరనాధ్ అనుకుంటున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అధినాయకత్వం కూడా కచ్చితంగా ఉండాలని, సిటీ రాజకీయాల్లో రూరల్ నేతల‌ జోక్యం నివారించాలని కూడా గట్టిగా డిమాండ్ వస్తోంది మరి. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News