గుడివాడకు అదే మైనస్ ?

విశాఖ జిల్లా మీద జగన్ పూర్తి దృష్టి పెట్టారు. ఆయనకు సిటీ రాజకీయం అనుకూలం కాకపోయినా కూడా వైసీపీని పటిష్టం చేయడానికి చేయాల్సినది అంతా చేస్తున్నారు. టీడీపీ [more]

Update: 2020-11-20 15:30 GMT

విశాఖ జిల్లా మీద జగన్ పూర్తి దృష్టి పెట్టారు. ఆయనకు సిటీ రాజకీయం అనుకూలం కాకపోయినా కూడా వైసీపీని పటిష్టం చేయడానికి చేయాల్సినది అంతా చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పుతున్నారు. మరికొందరు నేతలను సైలెంట్ మోడ్ లో ఉంచుతున్నారు. ఇలా ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్న జగన్ కి సొంత పార్టీ నేతలతోనే కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి జగన్ తన చేయి సాయం అందించి నాయకులుగా తీర్చిదిద్దిన వారే ఇపుడు కట్టుబాట్లు దాటి ముందుకు పోవడం కచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామమే.

గురువు మీదనే….

ఇక విశాఖ జిల్లాలో గుడివాడ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉంది గుడివాడ అమ్మన్న పెందుర్తి తొలి ఎమ్మెల్యే, ఆయన వారసుడిగా వచ్చిన గురునాధరావు పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇపుడు మూడవ తరంలో అమరనాధ్ ని జగన్ చేయి పట్టి నడిపించారు. అమరనాధ్ ని టీడీపీ వాడుకుని వదిలేస్తే జగన్ గత ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఇక విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా కూడా చేసి పెద్ద నాయకుడిని చేశారు. గత ఏడాది ఎన్నికలలో అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్ నాధ్ గెలిపించారు. ఆయనకు రాజకీయ గురువుగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇపుడు అమరనాధ్ ఏకంగా గురువు మీదనే బాణాలు వేస్తున్నారు. ఇది జిల్లాలో అతి పెద్ద చర్చగా ఉంది.

బ్యాడ్ లక్కేనా…?

గుడివాడ అమరనాధ్ కి తొలి విడతలోనే మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే ఆయనకు చట్ట సభల్లో అనుభవం లేదన్న కారణాన జగన్ పక్కన పెట్టి అవంతి శ్రీనివాస్ ని మంత్రిని చేశారు. మలి విడత విస్తరణలో అమరనాధ్ కి బెర్త్ ఖాయం అని అంతా భావిస్తున్న వేళ ఆయన హై కమాండ్ దృష్టిలో చెడ్డ అయ్యారు. అనకాపల్లిలో భూ దందాలపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ తో గుడివాడ అమరనాధ్ గుస్సా అయ్యారు. అది జగన్ దాకా పంచాయతీకి దారితీసింది. జగన్ క్లాస్ తీసుకున్నారు. ఇక జగన్ వద్ద ఒకసారి రెడ్ మార్క్ పడితే వైసీపీలో ఎదగడం కష్టమేనని అంటున్నారు.

జోరు తగ్గాల్సిందే…?

అనకాపల్లికి నాన్ లోకల్ అయినప్పటికీ అక్కడి వైసీపీ నాయకులు గుడివాడ అమరనాధ్ ను గెలిపించారు. గెలవగానే వారినే ధిక్కరించే ధోరణితో ఈ యువనేత వ్యవహరిస్తూ వచ్చారని ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇక గతంలో జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నపుడు కూడా ఇతర నాయకుల మాట వినకుండా హై కమాండ్ దన్ను ఉందన్న కారణాన హవా చలాయించారని విమర్శలు ఉన్నాయి. ఇన్నాళ్ళూ అంతా ఊరుకున్నది హై కమాండ్ అండ ఉందనే. ఇపుడు ఎటూ జగనే క్లాస్ తీసుకున్నారు కాబట్టి గుడివాడ అమరనాధ్ యాంటీ వర్గం రెచ్చిపోవడం ఖాయం. అదే విధంగా ఆయనకు మంత్రి పదవి ఆశలు కూడా నెరవేరకపోవచ్చుననే అంటున్నారు. మొత్తానికి నోరా పదవికి చేటే అన్న కొత్త సామెతను ఈ యువనేతను చూసి చెప్పాలేమో.

Tags:    

Similar News