జగన్ జట్టులో స్ట్రాంగ్ అవుతున్నారా?

నిజానికి ఇది ఏ గురువు అయినా ఆనందించాల్సిన విషయమే. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. గురువు అయినా శిష్యుడు అయినా పదవి దగ్గరకు వచ్చేసరికి బంధాలు ఏవీ [more]

Update: 2019-09-26 09:30 GMT

నిజానికి ఇది ఏ గురువు అయినా ఆనందించాల్సిన విషయమే. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. గురువు అయినా శిష్యుడు అయినా పదవి దగ్గరకు వచ్చేసరికి బంధాలు ఏవీ వుండవు. అలాంటి మాటలంతకంటే గిట్టవు. అందుకే గురువు గుర్రుగా శిష్యుడిని చూస్తున్నాడంటున్నారు. ఇంతకీ గురువు ఎవరు, శిష్యుడెవరు, ఏమా కధ అంటే విశాఖ జిల్లా రాజకీయాల్లోకి ఒక్కసారి రావాల్సిందే. రాజకీయ కుటుంబంగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు కుమారుడు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ రాజకీయంగా దూకుడుగా ఉంటున్నారు. ఆయన ప్రతిపక్షంలో సైతం తనదైన బాణీలో ముందుకు సాగారు. విశాఖకు రైల్వే జోన్ కోసం అమరణ దీక్ష చేసి జగన్ చేత శభాష్ అనిపించుకున్నారు. సుదీర్ఘకాలం పాటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు గురువు ఎవరంటే ప్రస్తుత జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు.

పోటీ ఇద్దరికే….

ఇక గుడివా అమర్నాధ్ అవంతి శ్రీనివాసరావు ఇంజనీరింగ్ కళాశాలలోనే చదువుకున్నారు. ఆ విధంగా అవంతి శ్రీనివాస్ ఆయనకు గురువు అవుతారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక ఇద్దరి బాట వేరు అయింది. టీడీపీ నుంచి వైసీపీలోకి గుడివాడ అమరనాధ్ వస్తే ప్రజారాజ్యం, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అవంతి శ్రీనివాస్ వచ్చారు. ఈ ఇద్దరూ కలసి తలపడిన ఎన్నిక అనకాపల్లి ఎంపీ సీటులో 2014లో జరిగింది. వైసీపీ నుంచి గుడివాడ అమర్నాధ్ పోటీకి దిగితే టీడీపీ టికెట్ మీద పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ మంచి మెజారిటీతో నాడు గెలిచారు. ఇక తాజా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలీ నుంచి పోటీ చేసి గెలవడమే కాదు, మంత్రి పదవిని కూడా అవంతి శ్రీనివాస్ పట్టేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే అదే మంత్రి పదవి కోసం గుడివాడ అమరనాధ్ చివరి వరకూ విశ్వప్రయత్నం చేశారు. అది గురువు తన్నుకుపోవడంతో శిష్యుడు ఒకింత నిరాశ పడ్డా కూడా ఇపుడు రెచ్చిపోయి మరీ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.

మాటలు తూటాలే……

తండ్రి గుడివాడ గురునాధరావు వాక్చాతుర్యం గుడివాడ అమరనాధ్ కి బాగానే అబ్బిందంటారు. అందుకే ఆయన చంద్రబాబు మొదలుకుని జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సహా ఎవరినైనా గట్టిగా తన మాటలతో ఎదుర్కొంటారు. ప్రభుత్వ పక్షాన నిలిచి ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టే చాతుర్యం కూడా గుడివాడ అమరనాధ్ కి ఉంది. ఇక మంత్రి కాకపోయినా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో ఆయన జిల్లా అంతటా ఎక్కడైన పర్యటించగలనని నిరూపించుకుంటున్నారు. తనకంటూ గట్టి వర్గాన్ని తయారు చేసుకున్న గుడివాడ అమరనాధ్ మంత్రి కంటే చురుకుగా జిల్లా రాజకీయాల‌పైన అవగాహనతో మాట్లాడడం ద్వారా గురువు అవంతి శ్రీనివాస్ కి గట్టి ఝలక్ ఇస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మంత్రిగా అవంతి ఉన్నా కూడా ఎక్కడా తగ్గకుండా తన ఉనికిని చాటుకుంటూ గుడివాడ అమరనాధ్ జగన్ దృష్టిలో పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ గురు శిష్యుల మధ్య రచ్చకు దారితీస్తున్నాయని అంటున్నారు. ఈ పోరు ఎంతవరకూ సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News