గుడివాడకు లైన్ క్లియర్ అయినట్లేనా ?

జీవీఎంసీ ఎన్నికలు ఎమ్మెల్యేల పనితీరుకు కొలమానాలుగా మారాయి. ఈ విషయంలో మంత్రి హోదాలో ఉండి కూడా అవంతి శ్రీనివాస్ ఫెయిల్ అయ్యారు. అలాగే వైసీపీలోకి వచ్చిన వాసుపల్లి [more]

Update: 2021-03-30 12:30 GMT

జీవీఎంసీ ఎన్నికలు ఎమ్మెల్యేల పనితీరుకు కొలమానాలుగా మారాయి. ఈ విషయంలో మంత్రి హోదాలో ఉండి కూడా అవంతి శ్రీనివాస్ ఫెయిల్ అయ్యారు. అలాగే వైసీపీలోకి వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా సైడ్ అయిపోయారు. గాజువాకలో రియల్ హీరో అంటూ జగన్ పొగిడిన తిప్పల నాగిరెడ్డి అయితే డేంజర్ జోన్ లో పడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అటు పంచాయతీల్లోనూ ఇటు జీవీఎంసీ ఎన్నికల్లోనూ దెబ్బ తిన్నారు. మొత్తంగా చూస్తే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ సక్సెస్ అయి హై కమాండ్ దృష్టిలో పడ్డారు అంటున్నారు.

భేష్ అన్న సాయిరెడ్డి…

విశాఖలో జీవీఎంసీ మీద వైసీపీ జెండా ఎగరడానికి గుడివాడ అమరనాధ్ కూడా ముఖ్య కారణమని ఏకంగా మీడియా ముఖంగానే ఎంపీ విజయసాయిరెడ్డి పొగిడారు. అంటే జగన్ మదిలో కూడా యువ ఎమ్మెల్యేకు మంచి స్థానం ఉందని అర్ధమవుతోంది. ఇప్పటికే హై కమాండ్ వద్ద మంచి మార్కులు సంపాదించిన గుడివాడ అమరనాధ్ తొలి విడతలోనే మంత్రి పదవి దక్కుతుందనుకున్నారు. కానీ అవంతి శ్రీనివాసరావు రూపంలో పోటీ ఎదురైంది. ఈసారి తప్పక తనకే చాన్స్ అని ఆయన నమ్ముతున్నారు.

ఈయనా రెడీనా….

ఇక రూరల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన వారిలో చోడవ‌రం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పైగా వైఎస్సార్ కుటుంబం అంటే ఆయనకు అమితమైన ఇష్టం. దాంతో పాటు ఆయన కూడా మంత్రి కావాలని తన కోరికను తరచూ వ్యక్తం చేస్తున్నారు. మంచి సబ్జెక్ట్ ఉన్న కరణం ధర్మశ్రీ కూడా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మరో ప్లస్ పాయింట్. దాంతో ఈ ఇద్దరి మధ్యన పోటీ ఉంటుందని అంటున్నారు.

యువతకే పెద్ద పీట ….

ఇక జగన్ అయితే యువకులకే పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టాలని కూడా ఆయన భావిస్తున్నట్లుగా అనేక నియామకాలు తెలియచేస్తున్నాయి. గుడివాడ అమరనాధ్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు గట్టిగా నడిపారు. తెలుగుదేశం పార్టీ మీద అలుపెరగని పోరాటం చేశారు. దూకుడుగా రాజకీయాలు చేస్తారని పేరు. దాంతో జగన్ గుడివాడ అమరనాధ్ కే చాన్స్ ఇస్తారని టాక్ అయితే ఉంది. ఎటూ విజయసాయిరెడ్డి ఆశీస్సులు కూడా ఉండడంతో మొగ్గు గుడివాడకే ఉందని అంటున్నారు. మొత్తానికి గుడివాడను అపుడే అనుచరులు కాబోయే మంత్రి అనేస్తున్నారు.

Tags:    

Similar News