గుడివాడకు భజన స్టార్ట్ అయింది…?

విశాఖ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ది రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం. ఆయన తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే. [more]

Update: 2021-02-04 14:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ది రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం. ఆయన తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే. తండ్రి, మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు కూడా జిల్లాలో డైనమిక్ లీడర్. కాంగ్రెస్ రాజకీయాలను కొన్నేళ్ళ పాటు గట్టిగానే శాసించారు. ఇక ఆయన వారసుడిగా గుడివాడ అమరనాధ్ టీడీపీలో కార్పోరేటర్ గా గెలిచి ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసి ఇంతటి లీడర్ అయ్యారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన గుడివాడ అమరనాధ్ అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో నెగ్గారు.

తృటిలో మిస్ అయినా…?

ఇక 2019లో వైసీపీ గెలిచిన తరువాత విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి కి వినిపించిన పేర్లలో గుడివాడ అమరనాధ్ ది కూడా ఒకటి. ఆయనకు కచ్చితంగా రూరల్ కోటాలో అయినా మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. ఇటు ఎంపీ విజయసాయిరెడ్డికి అటు జగన్ కి కూడా ఇష్టుడు అయిన గుడివాడ మంత్రి కావడం ష్యూర్ అనుకుంటే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. ఈ ఏడాది చివరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు. దాంతో తనకు లక్కీని తెచ్చే ఇయర్ గా 2021ని గుడివాడ అమరనాధ్ భావిస్తున్నారుట.

నినాదాలు అదిరాయ్….

ఈ మధ్యనే గుడివాడ అమరనాధ్ తన బర్త్ డేని కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్యాడర్ ఇచ్చిన నినాదాలు ఒక రేంజిలో ఉన్నాయి. రాబోయే కాలానికి కాబోయే మంత్రి మన గుడివాడ అంటూ వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, ఈసారి గుడివాడ అమరనాధ్ మంత్రి కావడం ఖాయం, ఎవరూ ఆపలేరు అంటూ గుడివాడ అభిమానులైతే తెగ హడావుడి చేశారు. యువ ఎమ్మెల్యే కటౌట్లు పెట్టి మరీ మంత్రిగానే వారు పేర్కోనడం విశేషం. మొత్తానికి గుడివాడ అమరనాధ్ కు ఇది ఆనందించే విషయంగా ఉన్నా వైసీపీ రాజకీయాల్లో మాత్రం అతి పెద్ద చర్చగా ఉందిపుడు.

మంచి మార్కులతో …

విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రిగా ఉన్న ముత్తంశెట్టికి మైనస్ మార్కులు అయితే లేవు. ఆయనకు ముఖ్యమంత్రితో మంచి సాన్నిహిత్యమే ఉంది. ప్రత్యేకించి అవినీతి మచ్చ కానీ, భూ దందాలు చేసిన ఉదంతాలు కానీ లేవు. పైగా ఆయన అటు జగన్ కి ఇటు విజయసాయిరెడ్డికి కూడా విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన్ని తప్పించరు అన్న మాట కూడా ఉంది. అయితే కొత్త జిల్లాలను చేసినపుడు మాత్రం విశాఖ రూరల్ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే రూరల్ లో గుడివాడ అమరనాధ్ తో పాటు చాలా మంది రేసులో ఉన్నారు. గుడివాడ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడానూ. దాంతో ఆయన కోరిక తీరాలంటే అద్భుతమే జరగాలి అన్న మాట పార్టీలో వినిపిస్తోంది. కానీ ఈ యువ ఎమ్మెల్యే మాత్రం మంత్రి కుర్చీ ఎక్కేవరకూ ఆగేట్లుగా లేరు. మొత్తానికి జగన్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News