ఎవరిది అధికారం… అదే జరిగితే?

హైదరాబాద్ నగరంలో ఓటర్లు సగం మంది పోలింగ్ బూత్ వైపునకే పోరు. దిగువ మధ్యతరగతి, శ్రామిక వర్గాలు, బస్తీ ప్రజలే ఓటింగులో ఎక్కువగా కనిపిస్తుంటారు. మేదావులుగా, మధ్యతరగతిగా [more]

Update: 2020-11-30 14:30 GMT

హైదరాబాద్ నగరంలో ఓటర్లు సగం మంది పోలింగ్ బూత్ వైపునకే పోరు. దిగువ మధ్యతరగతి, శ్రామిక వర్గాలు, బస్తీ ప్రజలే ఓటింగులో ఎక్కువగా కనిపిస్తుంటారు. మేదావులుగా, మధ్యతరగతిగా ముద్ర వేసుకున్న వైట్ కాలర్ బుద్ధిజీవులు ఎన్నికలను తమకు సంబంధించిన అంశంగా భావించారు. నగరంలో ఓట్లు వేసే వారిలో మూడొంతుల మంది ధనం, మద్యం, సెంటిమెంటు చూసుకుంటూ పోలింగ్ లో పాల్గొంటారు. అందుకే నాయకులు సైతం ప్రధానాంశాలు పక్కన పెట్టేశారు. ప్రజలు ఎటు తీర్పు ఇచ్చినా ఒరిగేది ఏమీ లేదని ఫలితానికంటే ముందే పక్కాగా చెప్పేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు వేరు, స్థానిక సంస్థల బాధ్యతలు వేరన్న అంశాన్ని ప్రజల దృష్టిలో కనబడకుండా చేసేశారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఈ ప్రచారం సాగడాన్ని బట్టి చూస్తే ఇక్కడ విజయం సాధిస్తే తెలంగాణపై జెండా ఎగరవేసినట్లే ఆయా పార్టీలు భావిస్తున్నాయనుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అంత పెద్ద విజయం సాధించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సైతం ఈ ఎన్నికలో ఓడిపోతే మొత్తం విజయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అన్నట్లుగా తలుస్తోంది. కాంగ్రెసు కుచించుకుపోయిన పరిస్థితిలో తెలుగుదేశం వంటి పార్టీల అగ్రనాయకులే చేతులెత్తేసిన దుస్థితిలో హైదరాబాద్ ఎన్నిక త్రిముఖంగా మారిపోయింది. బీజేపీ రాష్ట్రంపై రాజకీయ పట్టుకోసం, టీఆర్ఎస్ పరువు కోసం, ఎంఐఎం విస్తరణ కోసం పాకులాడుతున్నట్లుగా ఈ ఎన్నిక స్పష్టం చేసింది.

అజెండా అయోమయం…

స్థానిక రహదారులు, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, ప్రజారోగ్యం వంటివి మునిసిపాలిటీల ప్రధాన విధులు. ప్రజల దైనందిన జీవితంతో ముడిపడిన విషయాలివే. కానీ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలో అతికీలకమైన కార్పొరేషన్ బాధ్యతలపై పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేదు. పైపెచ్చు పార్టీలు తమ నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసుకోవడానికే ప్రయత్నించాయి. స్థానిక నాయకత్వం మాటనే ప్రస్తావనలోకి తీసుకు రాలేదు. నిజానికి ముంబై, బెంగుళూరు వంటి నగరాల ఆదాయంతో పోలిస్తే హైదరాబాద్ ఆదాయం అంతంతమాత్రమే. కానీ తెలంగాణకు ప్రధాన ఆదాయవనరుగా నగర ప్రజానీకం నిలుస్తున్నారు కేంద్రానికి సైతం పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల్లో అదాయం సమకూర్చి పెడుతున్నారు. దీంట్లో మతలబు స్థానిక ఆదాయం మెరుగుపడకుండా పన్నుల రూపంలో మొత్తం ఆదాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే పొందుతున్నాయి. కానీ స్థానిక సంస్థ రాజకీయాధికారాన్ని మాత్రం గుప్పెట్లో పెట్టుకోవాలని పార్టీలు చూస్తున్నాయి. అందుకే హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రతినిధులు తామేం చేయగలమో చెప్పి ఓట్లు అడగలేకపోయారు. పార్టీల పెద్దలు మాత్రం అన్నీ చేసేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీదనే పౌరవసతులు ఆధారపడి ఉంటాయని చెప్పకనే చెప్పేశారు.

ప్రజల్లో ఉదాసీనత…

నగర ప్రజల్లో ఉదాసీనత పాలకులకు వరంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ మునిసిపాలిటీ కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే నగర ప్రజలు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు. అలాగే ఎన్నికలలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడం పై శ్రద్ద పెట్టరు. ఎప్పుడూ 50 శాతం కూడా చేరని పోలింగ్ పర్సంటేజీ దీనికి నిదర్శనం. గ్రామాల్లోనూ, నగర పంచాయతీలు, చిన్న మునిసిపాలిటీల్లో కనిపించిన ఓటరు చైతన్యం హైదరాబాద్ లో కాగడా పెట్టి వెతికినా కానరాదు. అక్షరాస్యత, తలసరి ఆదాయం వంటి విషయాల్లో ముందుండే నగర పౌరులు తమ రోజువారీ జీవితానికి వసతులు సమకూర్చే పాలక సంస్థ ఎన్నికను పట్టించుకోకపోవడం దురదృష్టకరమే. అందుకే ప్రధాన పార్టీలన్నీ భావోద్వేగాల ఆధారంగానే ఓటర్లను సమీకరించే ఎత్తుగడలు వేశాయి. సెంటిమెంటును రంగరించేందుకు మూడు పార్టీలు ప్రయత్నించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను జాతీయ స్థాయి నాయకుడిని కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవంతో ఢిల్లీని ఢీకొట్టాలంటే హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలనే భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించారు. ప్రచారం పేరెత్తకపోయినా పరోక్షంగా ఓటర్లపై ముద్ర పడే విధంగా ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రచారం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్లారు. అదీ కరోనా వంటి ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక అంశంపై సమీక్షించారు. దేశంలో ముంబై , ఢిల్లీ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకంగా సాగుతుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరింది. పార్టీలు ఎంతగా ప్రయత్నించినా ఓటింగు పర్సంటేజీ పెరగకపోతే నిజమైన ప్రజాభిప్రాయం వ్యక్తం కాదు. జనాభాలో 50 శాతం లోపునకే పోలింగు పరిమితమైతే మొత్తం ప్రజలఓట్లలో 20 శాతం తెచ్చుకున్నవారు సైతం గద్దెనెక్కి కూర్చునే అవకాశం ఉంది. పోటాపోటీగా సాగిన ప్రచారాన్ని , ఓటరు నాడిని బట్టి చూస్తే హైదరాబాద్ లో అయిదో వంతు ఓట్లతోనే అధికారం దఖలయ్యే సూచనలు కానవస్తున్నాయి.

నీవు నేర్పిన విద్యయే…

నిజానికి ఈ ఎన్నికలో అధికార పార్టీ ప్రస్థానం చాలా సాఫీగా సాగిపోవాలి. కానీ టీఆర్ఎస్ కు ఈ సారి సెంటిమెంటు అస్త్రాలు పెద్దగా దొరకకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2016 హైదరాబాద్ ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ బరిలో ఉండటం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది. 2018లో కాంగ్రెసు, టీడీపీ చేతులు కలపడమూ అయాచితంగా లభించింది. చంద్రబాబు మళ్లీ హస్తం చేయూతతో తెలంగాణపై పెత్తనం చేస్తారనే భావన అప్పట్లో ఏర్పడింది. దాంతో అప్రతిహత విజయం టీఆర్ఎస్ కు దక్కింది. అలాగే గతంలో గ్రేటర్ ఎన్నికల్లో సైతం లోకేశ్ హడావిడి స్థానిక ఓటర్టలో ఆందోళన కలిగించింది. అప్పటికి మంచి సెంటిమెంటు కాక మీద ఉన్న టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఆంధ్రప్రాంతం ఓటర్లు సైతం సాహసించలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. చంద్రబాబు, లోకేశ్ ల ఊసే ఎన్నికల్లో లేకుండా పోయింది. రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెసు కొన్ని వార్డులలోనే బలమైన పోటీదారుగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సెంటిమెంటు క్రమేపీ బలహీనపడింది. తాజాగా దేశవ్యాప్తంగానే మతపరమైన సమీకరణలు పుంజుకుంటున్నాయి. రైజింగ్ పార్టీగా బీజేపీ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. పుంజుకొంటోంది. హైదరాబాద్ లో పాత బస్తీలో ఎంఐఎం బలంగా ఉండటం బీజేపీకి హైదరాబాద్ లో అదనపు అడ్వాంటేజ్. అందువల్లనే టీఆర్ఎస్ ను ఢీకొట్టిందుకు అవసరమైన ఓటర్ల సమీకరణ కమలం పార్టీకి సులభంగానే సాధ్యమవుతోంది. ఈ ఎన్నిక బీజేపీకి తెలంగాణలో ఫుట్ హోల్డ్ ఇస్తుందో, టీఆర్ఎస్ ను ఒడ్డున పడేస్తుందో ఓటరు తీర్పే తేల్చనుంది. ఏది ఏమైనా తన స్థానాల్లో మాత్రం ఎంఐఎం సేఫ్… అందుకు అవసరమైన పరోక్ష ప్రచారాన్ని బీజేపీ ఇప్పటికే చేసి పెట్టింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News