అప్పటి ఎన్నికలంత ఈజీ మాత్రం కాదట

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నవంబరు రెండోవారంలో జరగనున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగనున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ గా [more]

Update: 2020-10-09 09:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నవంబరు రెండోవారంలో జరగనున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగనున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ గా మారనుంది. ప్రధానంగా మంత్రి కేటీఆర్ కు ఛాలెంజ్ అని చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఈసారి కూడా సెంచరీ సాధిస్తామని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. వంద సీట్లు కైవసం చేసుకుని తిరిగి గ్రేటర్ పై గులాబీ జెండా ఎగురవేస్తామని పూర్తి ఆత్మవిశ్వాసంతో కేటీఆర్ ఉన్నారు.

అప్పటి వాతావరణం…?

అయితే గత ఎన్నికలప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఉన్న వాతావరణం వేరు. అప్పటికి తొలిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమ పార్టీగా రావడంతో నగర ప్రజలు కూడా ఎక్కువగా టీఆర్ఎస్ వైపు చూశారు. అందుకే 99 స్థానాలను నాడు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లోనూ కేటీఆర్ పార్టీకి నేతృత్వం వహించారు. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తుంది. నగర ప్రజలు కూడా పాలనపై పూర్తిగా అవగాహనకు వచ్చారు.

కరోనా తో…..

ప్రధానంగా కరోనా సమయంలో పడిన ఇబ్బందులు, ఆసుపత్రుల దోపిడీ, ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వంటి కారణాలు అధికార పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు పెట్టిన కేసులు కూడా టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారనుంది. దీంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలతో నగరం చిత్తడయిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలే. మ్యాన్ హోల్స్ లో పడి ప్రాణాలు పోతున్నాయి. కాలనీలకు కాలనీలే జలదిగ్భాంధానికి గురవుతున్నాయి. ఈ సమయంలోపార్టీని ఎలా విజయం వైపు కేటీఆర్ నడిపిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.

కార్పొరేటర్లపై అసంతృప్తి…..

అందుకే కేటీఆర్ సిట్టింగ్ కార్పొరేటర్లకు టిక్కెట్ కేటాయించే విషయంలో ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే పదిహేను మంది కొర్పొరేటర్లు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేరుకు పదిహేను మాత్రమే కాని అధికశాతం కార్పొరేటర్లది ఇదే పరిస్థితి. దీంతో గ్రేటర్ లో పూర్తి స్థాయి సర్వే నిర్వహించిన తర్వాతనే టిక్కెట్లను కేటాయించాలని కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతలను ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించారని చెబుతున్నారు. మొత్తం మీద కేటీఆర్ కు గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదన్నది మాత్రం వాస్తవమంటున్నారు. కానీ ప్రభుత్వానికి మరో మూడున్నరేళ్ల పదవీకాలం ఉండటం గ్రేటర్ లో గెలుపునకు టీఆర్ఎస్ కు సానుకూలించే అంశమని అనే వారు కూడా లేకపోలేదు.

Tags:    

Similar News