అప్పటి వరకూ అంతేనట

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి ఎక్కువ స్థానాలు రావడం కష్టమేనని భావిస్తున్నారు. దీంతో అధికార [more]

Update: 2020-11-16 09:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి ఎక్కువ స్థానాలు రావడం కష్టమేనని భావిస్తున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి సర్వే చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు, ఆ తర్వాత ప్రభుత్వ సాయం అందరికీ అందకపోవడం, విపక్షాలు వరదసాయంపై విమర్శలకు దిగడంతో అధికార పార్టీ కూడా కొంత వెనకడుగు వేయాల్సి వస్తోంది.

నవంబరు నెలలోనే…..

నిజానికి నవంబరు, డిసెంబరు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం కూడా నిర్ణయించింది. అయితే ప్రభుత్వమే వెనకడుగు వేసింది. వరద సహాయ కార్యక్రమాలు సక్రమంగా అమలు కాకపోవడంతో పాటు, సాయం అందరికీ అందడం లేదని మంత్రి కేటీఆర్ కే వ్యక్తిగతంగా ఫిర్యాదులు అందుతున్నాయి. వందల కోట్ల సాయన్ని నగదు రూపంలో పంచడాన్ని కూడా విపక్షాలు తప్పుపడుతున్నాయి.

సంక్రాంతి తర్వాతనే…..

ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. అప్పటి వరకూ పరిస్థితులు కుదుట పడతాయని కేటీఆర్ భావిస్తున్నారు. దీంతో పాటు వరద ప్రభావానికి గురైన ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ఇక్కడ ప్రజలు స్థానిక సంస్థల ప్రతినిధులపై తిరగబడుతున్నారు. మంత్రులను సయితం నిలదీస్తున్నారు. వారందరికీ సాయం అందించి, తర్వాత అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతనే ఎన్నికలను జరపాలని కేటీఆర్ భావిస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను……

ఈలోపు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని కేటీఆర్ భావిస్తున్నారు. దీంతో పాటు మరోసారి సర్వే చేయించాలని నిర్ణయించారు. గతంలో జరిపిన సర్వేలో పదిహేను మంది సిట్టింగ్ కార్పొరేటర్లపై వ్యతిరేకత వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. కానీ ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశముందని భావించి మరోసారి సర్వేకు కేటీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పరిస్థితులు తమకు అనుకూలంగా మారినప్పుడే గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News