కిషన్…. మిషన్ సక్సెస్ అవుతుందా?

భారతీయ జనతా పార్టీలో లక్కీ ఫెలో ఎవరంటే కిషన్ రెడ్డి ఠక్కున చెబుతారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన కిషన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన [more]

Update: 2020-10-16 09:30 GMT

భారతీయ జనతా పార్టీలో లక్కీ ఫెలో ఎవరంటే కిషన్ రెడ్డి ఠక్కున చెబుతారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన కిషన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచిగెలిచిన కిషన్ రెడ్డికి తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా లభించింది. హోం సహాయ మంత్రి పదవి లభించిన కిషన్ రెడ్డికి దక్కిన అదృష్టం తెలంగాణ బీజేపీలో మరెవరికీ దక్కలేదంటారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో…..

అయితే కిషన్ రెడ్డి కి రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి తన నియోజకవర్గంలోనైనా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తన సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కార్పొరేటర్ల అభ్యర్థుల ఎంపిక ను సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఒక్కరంటే ఒక్క కార్పొరేటర్ కూడా లేడు.

సర్వే ద్వారా…..

దీంతో కిషన్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో ఆయన ప్రత్యేకంగా సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక సక్రమంగా ఉంటే గెలుపు సులువవుతుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఒక ప్రత్యేక సంస్థ ద్వారా ఆయన తన నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్ల అభ్యర్థులపై సర్వే చేయిస్తున్నారని తెలిసింది. డివిజన్ కు ముగ్గురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి సర్వేలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికే టిక్కెట్లు ఇవ్వాలని కిషన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

అత్యధిక స్థానాలను….

గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 వార్డులుండగా గత ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం నలుగురు కార్పొరేటర్లు మాత్రమే విజయం సాధించారు. ఈసారి ఎక్కువ మొత్తంలో సీట్లు సాధించాలన్నది బీజేపీ ఆలోచన. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో ఆరుగురు పార్టీ నేతలను నియమించింది. వీరి సంగతి ఎలా ఉన్నా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం మాత్రం కిషన్ రెడ్డికి ఖచ్చితమనే అంటున్నారు. మరి కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయవంతమవుతారా? లేదా? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News