అందుకేనా నరసింహన్ ని మార్చింది

ఆయన బ్యూరోక్రాట్. రాజకీయాలు పెద్దగా తెలియవు. అయినా దేశంలో ఏ గవర్నర్ కి లేని రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. అటు యూపీయే అయినా ఇటు ఎన్డీయే [more]

Update: 2019-07-23 09:30 GMT

ఆయన బ్యూరోక్రాట్. రాజకీయాలు పెద్దగా తెలియవు. అయినా దేశంలో ఏ గవర్నర్ కి లేని రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. అటు యూపీయే అయినా ఇటు ఎన్డీయే అయినా ఆయన మాత్రం అందరికీ ప్రీతిపాత్రుడే. అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు, ఇపుడు జగన్ ఇలా ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఇష్టుడిగానే మెలిగారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్, జగన్ లకు గవర్నర్ నరసింహన్ మరింత ఆత్మీయుడుగా ఉన్నారనిపించారు. గవర్నర్ వీడ్కోలు సమావేశంలో అటు జగన్, ఇటు గవర్నర్ ఇద్దరి మనసులోని మాటలను గమనిస్తే వారి బంధం రాజ్యాంగపరమైన పదవులకు అతీతంగా సాగిందని చెప్పాలి. తనకు నరసింహన్ తండ్రి సమానులు అని జగన్ అంటే ఆ పుత్ర వాత్సల్యమే నరసింహన్ కూడా చూపించారు. మరి ఇది కేంద్రంలోకి పెద్దలకు అంతగా రుచించింది కాదేమో హఠాత్తుగా నరసింహన్ ని పక్కక పెట్టేసి తమవాడనుకున్న ఒడిషా పెద్దాయనను తీసుకువచ్చారు.

జగన్ అంటే ప్రత్యేకంగా….

ఆయన నేరస్తుడు, ఆర్ధిక ఉగ్రవాది అటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇస్తారా అంటూ ఓ వైపు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అరచి గీ పెట్టినా కూడా నరసింహన్ విపక్ష నేతగా ఉన్న జగన్ ని తరచూ కలుస్తూనే ఉన్నారు. ఆయన చంద్రబాబుపై పెట్టిన అభియోగాలని స్వీకరిస్తూనే ఉన్నారు. ఏకాంత చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇది బాబు అండ్ కోకు అసలు గిట్టేది కాదు. ఇక జగన్ ఆవేశంగా రాజ్ భవన్ కి వెళ్ళినప్పటికీ సీనియర్ గా, పెద్దగా నరసింహన్ జగన్ కి చెప్పాల్సిన హితబోధలు చెప్పి పంపించేవారన్న ప్రచారమూ ఉంది. యువకుడు, జనాదరణ అశేషంగా ఉన్నవాడు, తొందరపడకుందా సరైన దారిలో వెళ్తే ముఖ్యమంత్రి అవుతాడన్న ఆలోచన నరసింహన్ కి అప్పట్లోనే ఉంది. అది ఆయన గవర్నర్ గా ఉండగానే నిజమైంది కూడా. తన చేతులతోనే ప్రమాణం చేయించి మొదటి అడుగులు వేయించారు. మరి కొంతకాలం ఆయనే ఉంటే జగన్ కి వెన్ను దన్నుగా ఉండేవారు. కేంద్ర దూతగా ఉన్న గవర్నర్ నరసింహన్ జగన్ కు ముందస్తు జాగ్రత్తలు కూడా చెప్పి ముప్పులు, తప్పులూ లేకుండా చూసేవారన్న భావన వైసీపీ నేతల్లో ఇపుడు ఉంది.

మనసులో మాట బయట పెట్టిన…

తనకు నిజంగా తండ్రి మాదిరిలాగానే వేలు పట్టి నడిపించారంటూ నరసింహన్ పై తన అభిమానాన్ని జగన్ చాటుకున్నారు. ఆయన ఇంకా కొంత కాలం గవర్నర్ గా ఉంటే బాగుండునని కూడా జగన్ అన్నారంటే ఆ బంధం గట్టిదని చెప్పకతప్పదు. ఇక జగన్ పాలనకు కొత్త, ఆయనకు నరసింహన్ లాంటి గవర్నర్ తో అయితే ఎటువంటి భేషజాలు లేకుండా సలహాలు, సంప్రదింపులు చేసేందుకు వీలు ఉండేది. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఆయన రాజకీయ నేత కాదు కాబట్టి. పైగా గత పదేళ్ళ పరిచయంలో జగన్ ఆయన గురించి బాగా తెలుసుకుని చనువు పెంచుకున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర బీజేపీ పెద్దల ఆలోచనలు ఆగిపోయాయి. నరసింహన్ వంటి గవర్నర్ ఉంటే జగన్ పాలనా రధానికి ఎలాంటి బ్రేకులు ఉండవని భావించారో ఏమో మార్చేశారు. ఏది ఏమైనా ఓ గవర్నర్, ఓ ముఖ్యమంత్రి మధ్య మంచి సాన్నిహిత్యం ఈ రోజులలో తక్కువగా చూస్తాం. అందువల్ల అటు జగన్ ఇటు నరసింహన్ అరుదైన బంధాలనే పెంచుకుని ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

Tags:    

Similar News