చూసి ..నేర్చుకోండి..?

కోవిడ్ కొరడా ఝళిపిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలలో పార్టీలు పరస్పర విమర్శలతో రాజకీయ వైరస్ ను వ్యాపింప చేస్తున్నాయి. తమ పార్టీల ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు [more]

Update: 2021-05-18 16:30 GMT

కోవిడ్ కొరడా ఝళిపిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలలో పార్టీలు పరస్పర విమర్శలతో రాజకీయ వైరస్ ను వ్యాపింప చేస్తున్నాయి. తమ పార్టీల ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు , చిత్తశుద్ధి ఎంతమాత్రం కనిపించడం లేదు. ప్రతిపక్షాల ఆరోపణల్లోని అసలు విషయాలను వదిలేసి అధికారపార్టీలు విరుచుకుపడుతు్న్నాయి. మీడియాకు ఇదంతా పెద్ద వినోదంగా మారింది. కరోనా విలయాన్ని రెండింతలు మూడింతలుగా కళ్లకు కట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మీడియా మధ్య మధ్యలో పార్టీల విమర్శల వినోదాన్నీ పంచుతోంది. జాతీయంగానూ, రాష్ట్రాల స్థాయిలోనూ గడచిన నెల రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇది కాదు మార్గమంటూ కొన్ని రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. రెండు మూడు రాష్ట్రాల్లోని నాయకత్వం ప్రజల ప్రాణాల కంటే రాజకీయం ముఖ్యం కాదని నిరూపిస్తున్నాయి. వాటిని అనుసరించాలా? వద్దా ? అన్నది కేంద్ర ప్రభుత్వమూ, మిగిలిన రాస్ట్ర ప్రభుత్వాలూ ఆలోచించుకోవాలి. ప్రతిపక్షాలను సైతం కోవిడ్ కట్టడి విషయంలో కలుపుకుని పోవడం ద్వారా పటిష్ఠమైన సలహా యంత్రాంగాన్ని, నిఘాను పెంచుకోవడమే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్దతి. అధికార, ప్రతిపక్సాలు కలిసి పనిచేస్తే ప్రభుత్వ యంత్రాంగమూ భయభక్తులతో ఉంటుంది. తాము కూడా జవాబుదారీ అన్న బాధ్యత ప్రతిపక్సాలపై పడుతుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే లక్స్యాన్ని దూరంగా పెట్టి తక్షణ కర్తవ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.

కేరళ నాంది..

ఇటీవల కేరళలో ఎల్డీఎప్ కూటమి ఘన విజయాన్ని సాధించింది. నలభై సంవత్సరాలుగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లు విడతల వారీగా అధికారంలోకి వస్తున్నాయి. ఆ సంస్కతికి చరమగీతం పాడుతూ రెండోసారి వరసగా ఎల్డీఎఫ్ అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి విజయన్ వివిధ సందర్బాల్లో ప్రతిపక్ష యూడీఎఫ్ ను కలుపుకుని పోవడమే దీనికి ప్రధాన కారణం. వరదలు కావచ్చు. కోవిడ్ కావచ్చు. అన్నిటా ప్రతిపక్ష నేతను సైతం విశ్వాసంలోకి తీసుకుంటూ చర్యలు చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడిని పక్కన కూర్చొపెట్టుకుని జాయింట్ గా ప్రజలకు విపత్కర పరిస్థితుల్లో సందేశాలు ఇచ్చారు. సలహా మండలిలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే మళయాళ మనోరమ అధినేతకు సైతం చోటు కల్పించారు. ఆయా చర్యల వల్ల విపక్షాల విమర్శల ధాటి తగ్గింది. అధికార యంత్రాంగంపై నిఘా పెరిగింది. రాజకీయంగానూ విజయన్ కు కలిసి వచ్చింది. మోడీ వంటి నేతలు ఈ ఆదర్శాన్ని ఆచరణలో పెడితే జాతీయంగా ప్రతిపక్షాల సహకారం పొందడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా చేతులెత్తేసిన పరిస్థితుల్లో అందరూ కలిసి నిర్మాణాత్మకంగాముందుకు వెళ్లడం ప్రజలకు నైతిక స్థైర్యం కల్పిస్తుంది.

తంబీల సంకేతం..

జయలలిత, కరుణానిధి హయాంలో ఏఐడీఎంకే, డీఎంకేలు కత్తులు దూసుకునేవి. అవి రెండూ శత్రు శిబిరాలే. ప్రజల మధ్య చీలిక పెట్టి పరిపాలించాలని చూస్తుండేవి. నాయకుల వ్యక్తిగత విద్వేషాలను ప్రజలకు అంటగట్టే వారు. హింసాత్మక చర్యలు, ప్రతీకార దాడులు చోటు చేసుకునేవి. అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రతిపక్సంపై పోలీసుల సహకారంతో నానారకాల వేధింపులకు పాల్పడుతుండేది. ఈ ధోరణికి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడ్కోలు పలకడం ముదావహం. ఏఐడీఎంకేను ఓడించి అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఎటువంటి ప్రతీకార విచారణలు, దర్యాప్తులకు పూనుకోలేదు. ఇదొక సానుకూల సంకేతం. తాజాగా కరోనా కట్టడికి నియమించిన సలహా మండలిలో సైతం ప్రతిపక్సాలన్నిటికీ స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నిపార్టీలకు కలిపి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. వారంతా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయ చర్యల్లో పాల్గొనవచ్చు. దానికంటే ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు విమర్శనాత్మక కోణంలో కాకుండా ఆచరణాత్మక రీతిలో ప్రజలకు చేరుతున్నాయో లేదో పర్యవేక్షించవచ్చు. దీంతో సర్కారీ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది.

గోవా ఘనత..

చెప్పడానికి గోవా చాలా చిన్న రాష్ట్రం. అయినా తన ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవడంలో పెద్ద మనసునే ప్రదర్శించింది. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు వాటన్నిటినీ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని వచ్చింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేసింది. దీనివల్ల పడకలను బ్లాక్ చేసి పెట్టుకోవడానికి వీలుండదు. డబ్బున్న వారికి మాత్రమే ప్రయివేటు ఆసుపత్రులు నిలయంగా మారవు. అవసరమున్నా, లేకున్నా ధనికులు ముందు జాగ్రత్తగా ఆసుపత్రులను రిజర్వ్ చేసుకునే దోరణికి అడ్డుకట్ట పడింది. ప్రతి ఆసుపత్రిని ప్రభుత్వాధికారులు పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. కరోనా కు కళ్లెం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ లోపు ప్రయివేటు కార్పొరేట్ ఆరోగ్య వ్యాపారుల ధన దాహానికి ప్రజలు బలైపోతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వాలకు అంటువ్యాధుల నివారణ చట్టాలు అధికారం కల్పిస్తున్నాయి. ఇంతటి విపత్తులోనూ ప్రభుత్వాలు ఆమేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఇది పరోక్షంగా వాటి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే పరిగణించాలి. రెమ్ డిసివర్లు, ఆక్సిజన్ సిలండర్లు, వాక్సిన్ల విషయంలో సంపూర్ణ మైన సంత్రుప్తి ప్రజలకు ఎప్పటిలోగా కలిగిస్తారో ప్రభుత్వాలు చెప్పలేక పోతున్నాయి. కనీసం తమకున్న అధికారాల పరిధిలో ప్రయివేటు దోపిడీని అయినా అరికడితే అదే పదివేలని భావిస్తున్నారు మధ్యతరగతి ప్రజలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News