అంబేద్కర్ ను బెజవాడ తీసుకురండి కానీ?

విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేసినట్టు చూశాను. రేపే శంఖుస్థాపన అని కూడా చదివాను. విజయవాడలో అంత భారీ [more]

Update: 2020-07-08 00:30 GMT

విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేసినట్టు చూశాను. రేపే శంఖుస్థాపన అని కూడా చదివాను. విజయవాడలో అంత భారీ విగ్రహం ఏర్పాటుచేయాలనే ఆలోచనను స్వాగతిస్తున్నాను. అయితే విజయవాడ నగరానికి ఉన్న ఏకైక “లంగ్ స్పేస్” స్వరాజ్య మైదానం. గతంలో, ఇప్పుడు కూడా అక్కడ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. నగరానికి నడిబొడ్డున ఉండడం వల్ల ఎలాంటి వినోదం లేని నగరవాసులకు ఈ ఎగ్జిబిషన్ చాలావరకు ఆటవిడుపు. మిగిలిన సమయాల్లో పిల్లలు, యువత ఆ మైదానంలో ఆడుకుంటారు. ఇంత పెద్దనగరంలో అలా ఆడుకునేందుకు అంత విశాలమైన స్థలం ఉండడం గొప్ప అవకాశం.

గత ప్రభుత్వ హయాంలోనూ…..

ఇప్పుడు ఈ మైదానంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఇంకా ఏవో నిర్మిస్తామంటున్నారు. ఒక నగరానికి ఉన్న “లంగ్ స్పేస్” ఏ రూపంలోనైనా, ఏ కారణంతోనైనా లేకుండా చేయడం సమర్ధనీయం కాదు. గత ప్రభుత్వం చైనా ప్రాజక్టు (సిటీ సెంట్రల్ పార్కు) ప్రతిపాదించినప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్వరాజ్య మైదానం కదల్చకుండా పక్కన ఉన్న ప్రభుత్వ భవనాలు సిటీ సెంట్రల్ పార్కు కోసం వినియోగించుకుంటే మంచిదనే అభిప్రాయం వచ్చింది. వ్యక్తిగతంగా నాదికూడా అదే అభిప్రాయం. విజయవాడ నగరానికి “లంగ్ స్పేస్” అలా ఉంచండి. అంబేద్కర్ ను విజయవాడకు తీసుకురండి.

వివాదాలు లేకుండా….

ప్రభుత్వం నిజంగా అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టు ఏర్పాటుచేయదలస్తే స్వరాజ్య మైదానం పక్కనే ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్, విద్యుత్ సబ్ స్టేషన్, డిజిపి క్యాంపు కార్యాలయం (పూర్వపు ఆఫీసర్స్ క్లబ్) స్థలాలను సేకరించి మైదానానికి అనుబంధంగా అంబేద్కర్ ప్రాజెక్టు చేపట్టొచ్చు. అప్పుడు మైదానం ఉంటుంది. అంబేద్కర్ ప్రాజెక్టు వస్థుంది. ఈ మైదానంలో ఎప్పటిలా ఎగ్జిబిషన్లు నిర్వహించుకోవచ్చు. పైగా స్వరాజ్యమైదానంలోని భవనాలు, రైతుబజారు ఖాళీచేస్తే మరింత విశాలమైన మైదానం వస్తుంది. ప్రభుత్వం తన ఆలోచనలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే వివాదాలు లేకుండా ప్రాజెక్టు విజయవంతంగా అమలుచేయవచ్చు.

హడావిడి ఎందుకు?

అలా కాకుండా స్వర్యాజ్య మైదానంలోనే యదాతథంగా ఈ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే సమస్యలు తప్పవు. ఎవరి భుజంమ్మీదో తుపాకి పెట్టి ఇంకెవరినో కాల్చాలంటే అంబేద్కర్ పేరుతో అనవసర వివాదం అవుతుంది. అయినా ఇంత హడావుడిగా ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయడానికి రేపు అంబేద్కర్ జయంతీ కాదు, వర్ధంతీ కాదు. పునరాలోచన చేయడం విజ్ఞత. హైద్రాబాద్ లో మల్లేపల్లి లక్ష్మయ్య గారి నేతృత్వంలో అంబేద్కర్ ప్రాజెక్టు ఉంది. అలాంటి ఆలోచన చేస్తే మంచిది. ఇంత భారీ ప్రాజెక్టు ఇంత హడావుడిగా మొదలుపెట్టడం సరికాదు.

 

-గోపిదారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News