లచ్చన్న మనవరాలు అనిపించిందిగా…?

కరడు కట్టిన బ్రిటిష్ దొరలను ఎదిరించిన అనేక మంది నేతలలో ఆయన కూడా ఒకరు. ఏకంగా బ్రిటిష్ వారి చేతనే సర్దార్ బిరుదుని దక్కించుకున్న బీసీ నేత [more]

Update: 2021-05-19 03:30 GMT

కరడు కట్టిన బ్రిటిష్ దొరలను ఎదిరించిన అనేక మంది నేతలలో ఆయన కూడా ఒకరు. ఏకంగా బ్రిటిష్ వారి చేతనే సర్దార్ బిరుదుని దక్కించుకున్న బీసీ నేత ఆయన. అందుకే సర్దార్ గౌతు లచ్చన్న అంటే తెలుగు జనాలకు అంత గౌరవం. ఎక్కడో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన లచ్చన్న రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా తన ఉనికిని బలంగా చాటుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన కుమారుడు శ్యామ సుందర శివాజీ టీడీపీలో మాజీ మంత్రిగా వెలిగారు. ఇక మూడవ తరంలో శివాజీ కుమార్తె గౌతు శిరీష అయితే బాగానే రాణిస్తున్నారు.

ఓడినా వాడని…..

శివాజీ 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కుమార్తె గౌతు శిరీషను పలాసా నుంచి పోటీకి పెట్టారు. అయితే రాజకీయాలకు కొత్త అయిన డాక్టర్ సీదరి అప్పలరాజు ఆమెను భారీ ఆధిక్యతతో ఓడించారు. ఇక ఏడాది తిరగకుండానే మంత్రి కూడా అయిపోయారు. అప్పలరాజు దూకుడు ఒక వైపు సాగుతున్నా కూడా గౌతు శిరీష పలాసాలో పట్టు కోసం గట్టిగానే పోరాడాడుతున్నారు. గతం కంటే భిన్నంగా తన సొంత ప్రాంతంలో ఎక్కువ సమయం ఉంటూ ప్రతిపక్ష రాజకీయాన్ని శాసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె వైసీపీ మీద ఎంత వాడిగా వేడిగా బాణాలు వేస్తారో అంతే ధీటుగా బీజేపీ మీద కూడా వేయడమే విశేషం.

బాబు అనలేని చోట….

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకునే చంద్రబాబు గత రెండేళ్ళుగా మోడీ పేరు ఎత్తితే ఒట్టు అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. ఇక తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోర వైఫల్యం కళ్ళ ముందు కనిపించినా కూడా బాబు నోరు తెరచి పల్లెత్తు మాట అనలేదు. కానీ గౌతు శిరీష మాత్రం శ్రీకాకుళం నుంచే మోడీ వ్యతిరేక గళాన్ని గట్టిగా వినిపించారు. బీజేపీకి తగిన గుణపాఠం అయింది అంటూ సెటైర్లూ విసిరారు. బీజేపే రాజకీయ దాహానికి జనాలు చెక్ చెప్పేశారు అంటూ విమర్శలూ చేశారు. ప్రాంతీయ పార్టీలే దేశంలో ఉండకూడదు అన్న తీరున బీజేపీ పెద్దలు చేసిన దూకుడుకు జనం ఓట్ల ద్వారా తగిన తీర్పు ఇచ్చి ఆ పార్టీని ఓడించారు అంటూ గౌతు శిరీష చెప్పడం ఏదైతే ఉందో అది బాబుకు ఇబ్బందికరమే అనుకోవాలి. అంతే కాదు ఇదే తీరున రేపటి రోజున యావత్తు దేశమంతా రాజకీయ మార్పుని తీసుకువస్తుందని కూడా ఆమె అనడం ద్వారా మోడీ సర్కార్ ఓటమిని కోరుకున్నారు.

ఎందుకిలా…?

గౌతు శిరీషను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాజాగా జరిపిన నియామకాల్లో తీసుకున్నారు. ఆమె నాటి నుంచి దూకుడుగానే ఉంటోంది. జగన్ని విమర్శించడంలోనూ ముందుటోంది. అదే సమయంలో బీజేపీ చేస్తున్న తప్పులను కూడా ఎండగడుతోంది. తాజాగా మారుతున్న దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా గౌతు శిరీష తన మాటల ద్వారా ఆవిష్కరించారు. మరి ఇదే తెగువ, చొరవ టీడీపీలో పెద్ద నేతలు ఎందుకు చూపించడంలేదు అన్నదే ప్రశ్న. బీజేపీని పల్లెత్తు మాట అనవద్దు అని బాబు చెప్పారా. అలా అయినా కూడా గౌతు శిరీష గట్టిగా కాషాయ దళానికి డోస్ ఇచ్చింది అంటే ఆమె డేరింగ్ లేడీ అనే చెప్పాలిగా. ఏది ఏమైనా కూడా బాబు చేయలేని పని చేసిన గౌతు శిరీషను లచ్చన్న మనవరాలు అంటే ఇలాగే ఉండాలి కదా అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News