మ‌నిషి టీడీపీలో.. మ‌న‌సు వైసీపీలో…?

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎవ‌రూ ఎవ‌రికీ శాశ్వత మిత్రులు కారు.. శాశ్వత శ‌త్రువులు కూడా కారు. అవ‌కాశం.. అధికారం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే పార్టీలు, నేత‌లు ప‌రుగులు [more]

Update: 2021-06-03 14:30 GMT

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎవ‌రూ ఎవ‌రికీ శాశ్వత మిత్రులు కారు.. శాశ్వత శ‌త్రువులు కూడా కారు. అవ‌కాశం.. అధికారం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే పార్టీలు, నేత‌లు ప‌రుగులు పెడ‌తారు. ఎక్కడ వారికి అవ‌కాశం చిక్కితే.. అక్కడ బ్రేకులు వేసుకుంటారు. మ‌ళ్లీ అక్కడ అవ‌కాశం మృగ్యమైతే.. మ‌ళ్లీ మ‌రో దిశ‌గా త‌మ ప్రయాణం సాగిస్తారు. ఇలాంటి క్రమంలో నాయ‌కులకు పార్టీలు మార‌డం, పార్టీల‌కు నాయ‌కుల‌ను చేర్చుకోవ‌డం వంటివి సాధార‌ణంగా మారిపోయాయి. అయితే.. ఇలా పార్టీ మారిన వారు.. ఇప్పుడు ఇక్కడ ఉండ‌లేక‌.. గ‌తంలో ఉన్న పార్టీలోకి వెళ్లే అవ‌కాశం లేక‌.. నానా తిప్పలు ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీలకులు.

టీడీపీలో చేరి..?

క‌ర్నూలు జిల్లా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున‌ 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు గౌరు చ‌రితా రెడ్డి. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న గౌరు చ‌రితా రెడ్డికి వైసీపీ అధినేత‌… జ‌గ‌న్ మంచి వాల్యూ ఇచ్చారు. చ‌రిత భ‌ర్త వెంక‌ట‌రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప‌ని చేయ‌డంతో పాటు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఆమె పార్టీ మారిపోయారు. చంద్రబాబుకు జై కొట్టారు. ఒక్కసారి గెలుపునే సొంత బ‌లంగా భావించిన గౌరు చ‌రితా రెడ్డి.. ఎక్కడున్నా త‌మ గెలుపును ఎవ‌రూ ఆప‌లేరు.. అంటూ..వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే.. సీనియ‌ర్ నాయ‌కుడు.. ఫైవ్‌ టైమ్ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కే పాణ్యం సీటు ఇవ్వాల‌ని నిర్ణయించారు. దీంతో గౌరు దంప‌తులు టీడీపీలో చేరిపోయారు.

ఓటమి తర్వాత నుంచి….

ఇక‌, టీడీపీలో చేరిన గౌరు చ‌రితా రెడ్డి టికెట్ అయితే .. తెచ్చుకున్నా 44 వేల ఓట్ల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి టీడీపీలోనూ యాక్టివ్‌గా ఉండ‌లేక పోతున్నారు. ఇక‌, ఈ ప‌రిణామం గౌరు చ‌రితా రెడ్డి కుటుంబంలోనూ చిచ్చు రేపింద‌ని ప్రచారం జ‌రిగింది. ప్రస్తుతం జిల్లాలో టీడీపీని న‌డిపించే నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. పైగా ఎవ‌రికివారుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో చ‌రితా రెడ్డిని ప‌ట్టించుకునేవారు.. ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. పార్టీ అధినేత కూడా జంపింగుల‌పై దృష్టి పెట్టడం లేదు. ఎవ‌రినీ ఆయ‌న ప‌ల‌క‌రించ‌డం లేదు.

జగన్ నుంచి సిగ్నల్ అందక….

దీంతో గౌరు చ‌రితా రెడ్డి ఏమాత్రం వైసీపీ నుంచి సిగ్నల్ వ‌చ్చినా.. పార్టీలోకి వ‌చ్చేయాల‌ని చూస్తున్నారు. మ‌నిషిగా మాత్రమే టీడీపీలో ఉన్నారు త‌ప్ప..ఎలాంటి కార్యక్రమాలూ ఆమె చేప‌ట్టడం లేదు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏ కార్యక్రమాన్ని నిర్వహించ‌డం లేదు. మొత్తంగా చూస్తే.. ఒక్కగెలుపు పెంచిన ధీమా.. మొత్తం రాజ‌కీయ ఫ్యూచ‌ర్‌పైనే ప్రభావం చూపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇప్పట్లో వైసీపీ నుంచి గౌరు చ‌రితా రెడ్డికి పిలుపు అందే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మార‌వ‌ద్దు.. ఎమ్మెల్సీ సీటు ఇస్తాన‌ని చెప్పినా పార్టీ మారిపోయారు. అందుకే జ‌గ‌న్ గౌరు చ‌రితా రెడ్డి దంప‌తుల‌పై అదే కోపంతో ఉన్నార‌ని.. పైగా ఇప్పుడు పార్టీలోకి వ‌చ్చినా బండి ఇప్పటికే ఓవ‌ర్ లోడ్ అవ్వడంతో వాళ్లను చేర్చుకున్నా వాళ్లకు, పార్టీకి ఒరిగేదేమి ఉండ‌ద‌న్న చ‌ర్చలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News