కుమ్ముడు మొదలయింది…తమ్ముడు ఏంచేస్తాడో?

ప్రకాశం జిల్లాలో కీల‌క‌మైన అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు… మొత్తంగా నాలుగు సార్లు విజ‌యాలు కైవ‌సం చేసుకున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు గొట్టిపాటి ర‌వి. [more]

Update: 2019-12-05 03:30 GMT

ప్రకాశం జిల్లాలో కీల‌క‌మైన అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు… మొత్తంగా నాలుగు సార్లు విజ‌యాలు కైవ‌సం చేసుకున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు గొట్టిపాటి ర‌వి. రాజ‌కీయంగా వార‌స‌త్వ రాజ‌కీయాలు చేస్తున్న ఆయ‌నకు స్థానికంగా మంచి గుర్తింపే ఉంది. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న వ్యక్తి గ‌త ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆయన విజ‌యం సాధించారు. 2014లో వైసీపీ త‌ర‌పున విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత కొద్ది కాలానికే టీడీపీలోకి జంప్ చేసేశారు. మంత్రి ప‌ద‌విపై ఆశ‌లేక పోయినా.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిని కాక్షించే పార్టీ మారార‌నే ప్రజ‌ల‌ను న‌మ్మించ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు.

కుటుంబంలో వ్యతిరేకత రావడంతో….

ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై గొట్టిపాటి పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక ప‌వ‌నాలు, జ‌గ‌న్ సునామీ బ‌లంగా ప‌నిచేసినా.. కూడా గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో గెలుపు గుర్రం ఎక్కి త‌న హవా నిల‌బెట్టుకున్నారు. అయితే, అప్పటి నుంచి గొట్టిపాటి రవికుమార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గెలిచిన త‌ర్వాత ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆహ్వానం అందిన‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే, కుటుంబంలో పార్టీ మార్పుపై తీవ్ర వ్యతిరేక‌త రావ‌డంతో గొట్టిపాటి రవికుమార్ మౌనం వ‌హించార‌ని అంటున్నారు. ఇదిలావుంటే, ఈ ఏడాదిలోనే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లాన్ని త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న వైసీపీ వ్యాపారాల్లో ఉన్న టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేసింద‌న్న ప్రచారం జ‌రుగుతోంది.

నెలలో నాలుగు సార్లు….

ఈ క్రమంలోనే గొట్టిపాటి రవికుమార్ వ‌ర్గంపై క‌న్నేసిన వైసీపీ ఆయ‌న కు చెందిన ప్రముఖ గ్రానెట్ వ్యాపారంపై దృష్టి పెట్టింది. గ్రానైట్ లైసెన్సులు, జ‌రుగుతున్న త‌వ్వకాలు, చేస్తున్న వ్యాపారంవంటి వాటిపై విజిలెన్స్ అధికారు లు లెక్కకు మిక్కిలిగా ఇటీవ‌ల కాలంలో దాడులు చేస్తున్నారు. నిజానికి ప్రకాశంలో అనేక మంది రాజ‌కీయ నేత‌ల‌కు గ్రానైట్ బిజినెస్ ఉన్నప్పటికీ గొట్టిపాటి రవికుమార్ కేంద్రంగా మాత్రమే జ‌రుగుతున్న ఈ దాడుల‌ను వైసీపీ వ్యూహాత్మకంగా చేస్తోంద‌నే వ్యాఖ్యల‌కు బ‌లం చేకూరుస్తోంది. గ‌త నెల రోజుల వ్యవ‌ధిలోనే ఏకంగా నాలుగు సార్లు గొట్టిపాటి గ్రానైట్ క్వారీల‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.

హామీ రాకపోవడంతోనే….

ఇటీవ‌ల గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ కూడా త‌న‌పై న‌మోద‌వుతున్న కేసుల‌ను త‌ట్టుకోలేకే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాన‌ని చెప్పిన‌ట్టుగా ఇప్పుడు కేసుల వేధింపుల‌తో గొట్టిపాటి రవికుమార్ కి చెక్ పెట్టడ‌మో.. లేదా త‌మ దారిలోకి తెచ్చుకోవ‌డ‌మో చేయాల‌ని వైసీపీ ప్లాన్ చేసింద‌ని అంటున్నారు. మ‌రి వైసీపీ వ‌ల‌కు గొట్టిపాటి రవికుమార్ చిక్కుతారా? లేక‌ కేసుల‌ను ఎదుర్కొంటారా? వేచి చూడాలి. వాస్తవానికి గొట్టిపాటి రవికుమార్ గ‌తంలో వైసీపీ ఎమ్మెల్యే కావ‌డంతో ఆయ‌న పార్టీ మార్పుపై ఊగిస‌లాట‌లోనే ఉన్నార‌ని కూడా జిల్లాలో టాక్ వ‌స్తోంది. పార్టీ మారినా అక్కడ త‌న‌కు ల‌భించే ప్రాధాన్యత‌పై ఎలాంటి హామీ రాక‌పోవడంతో కూడా ఆయ‌న మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News