గొట్టిపాటికి నో ఎంట్రీ అట

వైఎస్ జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే అంతే. తాను అనుకున్నది అమలు అయ్యే వరకూ ఒప్పుకోరు. ప్రభుత్వ పథకాల విషయంలోనూ, పార్టీ విషయాల్లోనూ జగన్ అలాగే వ్యవహరిస్తారు. [more]

Update: 2019-10-21 12:30 GMT

వైఎస్ జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే అంతే. తాను అనుకున్నది అమలు అయ్యే వరకూ ఒప్పుకోరు. ప్రభుత్వ పథకాల విషయంలోనూ, పార్టీ విషయాల్లోనూ జగన్ అలాగే వ్యవహరిస్తారు. ప్రకాశం జిల్లా రాజకీయాలు తీసుకుంటే ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెక్ పెట్టేందుకు పార్టీని ఎన్నికల సమయంలో వదిలేసి వెళ్లిపోయిన రావి రామనాధం బాబును తిరిగి పార్టీలో తీసుకున్నారు. పురంద్రీశ్వరి వైసీపీలోకి వస్తేనే దగ్గుబాటి పర్చూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కంటిన్యూ అవుతారన్న సంకేతాలు బలంగా పంపారు.

ఇద్దరి మధ్యే…..

ఇక అద్దంకి నియోజకవర్గంలోనూ జగన్ అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి వర్సెస్ కరణం బలరాంల మధ్య సాగుతుంది. 2014 ఎన్నికల్లో గొట్టి పాటి రవికుమార్ వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఒకరకంగా పార్టీ బలం కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు. 2014లో వైసీపీి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు.

టీడీపీలోనే ఉండటంతో….

ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే నేతలైన కరణం బలరాం, గొట్టి పాటి రవికుమార్ లు ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో గొట్టిపాటి రవికుమార్ తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తున్నారు. వైసీపీలో తనకు పరిచయం ఉన్న సీనియర్ నేతలు, ఒక మంత్రి ద్వారా జగన్ వద్దకు గొట్టిపాటి రవికుమార్ రాయబారం పంపారు.

ఆయన వస్తారనేనా?

అయితే గొట్టిపాటి రాకకు జగన్ నో చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసి రావాల్సి ఉంటుంది. గొట్టిపాటి రవికుమార్ ఇందుకు కూడా రెడీ అయ్యారు. కానీ జగన్ గొట్టిపాటిని పార్టీలోకి తీసుకునేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే అద్దంకి నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా బాచిన కృష్ణ చైతన్యను నియమించారు. గొట్టిపాటి రవికుమార్ నుంచి వస్తున్న వత్తిడికి దూరమయ్యేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ పై పోటీ చేసి ఓడిపోయిన బాచిన చెంచుగరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యను అద్దంకి ఇన్ ఛార్జిగా నియమించారు. దీంతో గొట్టిపాటి రవికుమార్ రాకకు రెడ్ సిగ్నల్ పడినట్లేనని తెలుస్తోంది.

Tags:    

Similar News