ఖద్దర్ తొడిగారు.. విన్నర్ అయ్యారు..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సామాన్యులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో చట్టసభలకు ఎన్నికయ్యారు. ఇలా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారిలో గోరంట్ల మాధవ్ ముఖ్యులు. [more]

Update: 2019-05-27 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సామాన్యులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో చట్టసభలకు ఎన్నికయ్యారు. ఇలా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారిలో గోరంట్ల మాధవ్ ముఖ్యులు. ఒక సీఐగా పనిచేసిన ప్రాంతానికే ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం, అది కూడా స్వల్ప సమయంలోనే రాజకీయంగా కీలక స్థానానికి ఎదగడం గోరంట్ల మాధవ్ కే సాధ్యమైంది. ఎక్కడో తనకు సంబంధం లేని ప్రాంతంలో జరిగిన చిన్న గొడవ, తర్వాతి పర్యవసానాలు ఆయనను ఎంపీగా చేశాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ఓ ఆధ్యాత్మిక సంస్థకు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులకు జరిగిన గొడవలో పోలీసులు వైఫల్యం చెందారని జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో సిన్సియర్, స్ట్రిక్ట్ అధికారిగా పేరున్న కదిరి సీఐ, అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి గోరంట్ల మాధవ్ ధీటుగా స్పందించారు. జేసీ దివాకర్ రెడ్డిని నాలుక కోస్తా అని వార్నింగ్ ఇచ్చారు.

అనూహ్యంగా తెరపైకి వచ్చినా…

ఎంపీగా, బలమైన నేతగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ చేయడంతో గోరంట్ల మాధవ్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో చర్చనీయాంశమయ్యారు. ఆయన స్వంత సామాజకవర్గంలో ఒక హీరో అయ్యారు. అనంతపురం జిల్లాలో ఆయన సామాజకవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఈ ఘటన తర్వాత తను రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉండటంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడే జగన్ ఆయనకు హిందూపురం ఎంపీ టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనకే జగన్ టిక్కెట్ ఖరారు చేశారు. కానీ, ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో చివరి నిమిషం వరకు ఆయన పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఇతర అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభిస్తే ఆయన కోర్టుల చుట్టూ తిరిగారు. తనను పోటీ చేయకుండా టీడీపీ అడ్డుకుంటుందనే భావన ప్రజల్లో బలంగా వచ్చింది. ఇది ఆయనకు సానుభూతిగా మారింది.

ఇంటికే పరిమితమైన జేసీ కుటుంబం

హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. 2009, 2014 ఎన్నిల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఏకంగా ఆయన లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఆయనే ఈసారి కూడా పోటీ చేశారు. అయితే, జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉండటం, సామాజకవర్గ సమీకరణాలు కలిసి రావడం, గోరంట్ల మాధవ్ కు మంచి ఇమేజ్ ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 1,38,309 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన నిమ్మల కిష్టప్పను ఓడించి విజయం సాధించారు. దీంతో సీఐగా పనిచేసిన చోటే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై అరుదైన నేతగా మారారు. అందుకే తాను ఎవరి కిందైతే పనిచేశారో వారితోనే సెల్యూట్ కొట్టించుకుంటున్నారు. ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ ఎంపీగా ఓడిపోవడంతో, జేసీ దివాకర్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. బండ్లు ఓడలవుతాయి… ఓడలు బండ్లవుతాయి అనే నానుడికి ఇది మంచి ఉదాహరణ. అయితే, తాను ఎవరిపై కోపంతో రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే వచ్చానంటున్నారు గోరంట్ల మాధవ్.

Tags:    

Similar News