మీసం మళ్లీ మెలేస్తారా…??

ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగాన్ని వదిలేసిన వైఎస్సార్ [more]

Update: 2019-04-20 15:30 GMT

ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగాన్ని వదిలేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా హిందూపురం ఎంపీగా పోటీ చేశారు. దీంతో సీఐ మాధవ్.. ఎంపీ మాధవ్ అవుతారా..? పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంటులో అడుగుపెడతారా..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో గోరంట్ల మాధవ్ గట్టి పోటీ ఎదుర్కున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 97 వేల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డిపై విజయం సాధించారు. 2009లోనూ ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు. అయితే, ఈసారి మాత్రం ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది.

బలమైన సామాజకవర్గం…

పోలీస్ అధికారుల సంఘం నేతగా ఉన్న గోరంట్ల మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి నాలుక కోస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన బాగా హైలెట్ అయ్యారు. నిజాయితీ అధికారిగా అప్పటి వరకు ఆయన పనిచేసిన ప్రాంతాల్లో, జిల్లాలోనే తెలిసిన మాధవ్ ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా హైలెట్ అయ్యారు. కురబ సామాజకవర్గానికి చెందిన ఆయన అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా కురబ సామాజకవర్గంలో ఆయనను కొందరు హీరోగా చూస్తున్నారు. దీంతో ఆయన పోలీస్ ఉద్యోగాన్ని వీడి వైసీపీలో చేరారు. మాధవ్ కు స్థానికంగా ఉన్న పేరు, సామాజకవర్గ బలంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆయనకు వైసీపీ హిందూపురం పార్లమెంటు టిక్కెట్ ఇచ్చింది.

ఈసారి వైసీపీ బలం పెరిగింది..!

అయితే, టిక్కెట్ దక్కినా ఆయన పోటీపై అనేక అనుమానాలు వచ్చాయి. పదవీ విరమణ చేసి రెండున్నర నెలలు అయినా ఆయనను ప్రభుత్వం రిలీవ్ చేయకపోవడంతో కోర్టుకెళ్లాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. ఈ పరిణామాలు గోరంట్ల మాధవ్ పట్ల బాగా సానుభూతి పెంచింది. మాధవ్ పార్లమెంటుకు వెళ్లకుండా అధికార పార్టీ కక్షసాధిస్తుందనే భావన ప్రజల్లో నెలకొంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో కురబ సామాజకవర్గ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఇది మాధవ్ కు కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీకి ఈ పార్లమెంటు పరిధిలోని రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ రాగా వైసీపీకి కేవలం కదిరిలో మాత్రమే టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

క్రాస్ ఓటింగ్ జరిగిందా..?

ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. గత ఎన్నికల్లో టీడీపీ వైపు ఉన్న అసెంబ్లీల్లో కనీసం సగం స్థానాల్లో ఈసారి వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, గోరంట్ల మాధవ్ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతలో మాధవ్ పట్ల ఎక్కువ సానుకూలత కనిపించింది. క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని, అసెంబ్లీకి ఇతర పార్టీలకు వేసిన వారు కూడా పార్లమెంటుకు మాత్రం మాధవ్ కు ఓటేశారని అంటున్నారు. మరి, గోరంట్ల మాధవ్ ఎంపీ అవుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News