ప్రొటోకాల్ కూడా లేదు.. అంతా వారి ఆధిపత్యమే?

అనంత‌పురంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒక‌టి అనంత‌పురం‌, రెండు హిందూపురం. ఈ రెండు చోట్లా కూడా వైసీపీ గుండుగుత్తుగా త‌న ఖాతాలో వేసుకుంది. అనంత అర్బన్ [more]

Update: 2020-07-03 00:30 GMT

అనంత‌పురంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒక‌టి అనంత‌పురం‌, రెండు హిందూపురం. ఈ రెండు చోట్లా కూడా వైసీపీ గుండుగుత్తుగా త‌న ఖాతాలో వేసుకుంది. అనంత అర్బన్ నుంచి బోయ రంగ‌య్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధ‌వ్‌లు విజ‌యం సాధించారు. వీరిద్దరూ కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో పాగా వేసేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా రెండు ఎంపీ సీట్లు బీసీల‌కు కేటాయించారు. ఈ క్రమంలోనే బీసీల ఓట్లు గంప‌గుత్తగా ప‌డ‌డంతో వీరు తిరుగులేని విజ‌యం సాధించారు. ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా ప‌ని చేసిన వారే. చాలా ఆశ‌ల‌తోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు, పార్టీకి అంతో ఇంతో సేవ చేయాల‌ని కూడా అనుకున్నారు. జ‌గ‌న్ కూడా వీరికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఏడాది తిరిగే స‌రికి ఇక్కడి ప‌రిస్థితి అర్ధమైంది. అనంత‌పురంలో రెడ్డి సామాజిక వ‌ర్గం హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తోంది.

ఎనిమిది మంది….

ఈ జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 8 మంది రెడ్డి వ‌ర్గానికి చెందిన వారే. దీంతో ఏం చేయాల‌న్నా.. ఏం కావాల‌న్నా.. కూడా రెడ్డి వ‌ర్గమే చ‌క్రం తిప్పుతోంది. ఏడాది కాలంగా కూడా వారంతా యునైటెడ్‌గా ప‌నిచే స్తున్నారు. ఫ‌లితంగా ఎంపీలుగా ఉన్న ఇద్దరూ కూడా డ‌మ్మీలుగా మారిపోయారా? అనే సందేహాలు వ్యక్త ‌మ‌వుతున్నాయి. వాస్తవానికి ప్రొటోకాల్ ప్రకారం ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా.. ప‌నులు చేసేందుకు స్థానికంగా ఉన్న ఎంపీకి ఆహ్వానం అందాలి. లేదా ఆయ‌న‌కు స‌మాచారం అయినా పంపాలి. కానీ, ఇక్క ‌డ ఎంపీల‌ను ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ప్రొటోకాల్ పాటించకుండా…..

ఒక‌వేళ ప్రోటోకాల్ ప్రకారం పిలిచినా.. పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేల రాజ‌కీయంలో బీసీ వ‌ర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు న‌లిగిపోతున్నార‌న్న చ‌ర్చ‌లే జిల్లా రాజ‌కీయ‌ల్లో వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో ఇద్దరు ఎంపీలు మాధ‌వ్‌, రంగ‌య్యలు మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని టాక్‌. మాధ‌వ్ కుర‌బ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీ అయితే, రంగ‌య్య.. బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. కానీ.. ఇప్పుడు వీరు రెడ్డి ఆధిప‌త్యంలో న‌లిగిపోతున్నారు. రంగ‌య్య ఏదో అర్బన్‌లో చిన్నపాటి కార్యక్రమాలకు హాజ‌ర‌వుతూ.. స‌రిపెట్టుకుంటున్నారు.

మాధవ్ సరిపెట్టుకోలేక……

కానీ, మాధ‌వ్ మాత్రం స‌రిపెట్టుకోలేక పోతున్నారు. పార్టీపైనా.. స్థానిక రెడ్డి హ‌వాపైనా ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద ప్రశ్నల వ‌ర్షం కురిపిస్తున్నార‌ట‌. అంతా మీరే చేసుకుంటుంటే.. ఎంపీగా నేనెందుకు? అంటూ.. ఆయ‌న ఆగ్రహంతో ఉన్నారు. పైగా పార్టీలోనే కొంద‌రు త‌నకు వ్యతిరేకంగా చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. ఎంపీల‌కే కాకుండా జిల్లా పార్టీకి కూడా త‌ల‌నొప్పిగా మారింది. ఇక జిల్లాకే చెందిన బీసీ వ‌ర్గానికి చెందిన మంత్రి శంక‌ర్ నారాయ‌ణ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టే ప‌రిస్థితి లేద‌ట‌. జిల్లాలో ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు త‌న‌పై క‌త్తి క‌ట్టార‌ని ఆయ‌న వాపోతున్నట్టు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. సీఎం జ‌గ‌న్ ఎంత త్వర‌గా అయితే.. అంత త్వర‌గా ఈ స‌మ‌స్యపై దృష్టి పెట్టాల‌నే డిమాండ్లు కూడా వ‌స్తున్నాయి.

Tags:    

Similar News