గోరంట్ల వ్యవహారం అనుకున్నంత ఈజీ కాదట

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సొంత పార్టీపై గూడు కట్టుకున్న అంతులేని అసంతృప్తిని ఆయన ఒక్కోటిగా బయట [more]

Update: 2021-08-23 06:30 GMT

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సొంత పార్టీపై గూడు కట్టుకున్న అంతులేని అసంతృప్తిని ఆయన ఒక్కోటిగా బయట పెట్టడం చూస్తుంటే చంద్రబాబు స్వయంగా వచ్చి బతిమాలితే తప్ప పని జరిగేలా లేదు. మరి ఆ స్థాయిలో నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారా అంటే అనుమానం అనే చెప్పాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లొంగితే పార్టీలో మరికొందరు సీనియర్లు, జూనియర్లు కూడా బుచ్చయ్య ఫార్ములా అనుసరించే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ లోగా గతంలో తనకు జరిగిన చేదు అనుభవాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీక్ చేస్తుండటం అధినేతను కలవరపాటుకు గురిచేసేలాగే ఉంది.

రాష్ట్ర స్థాయి నేతను నియోజకవర్గానికే …

గోరంట్ల బుచ్చయ్య చౌదరి టిడిపి రాష్ట్ర నేత అనడంలో సందేహం లేదు. అందుకే ఆయనకు పార్టీ పరంగా ఉన్నత పదవులే దక్కినా ప్రయోజనం లేదన్న మాట వినవస్తుంది. పార్టీ మొత్తం చంద్రబాబు లోకేష్ ఛత్రం కిందనే నడుస్తూ ఉండటంతో పదవులు విజిటింగ్ కార్డు పై వేసుకునేందుకు తప్ప మరెందుకు పనికిరావంటున్నారు ఆ పార్టీ వారే. ఇదే కోవలో 1999 ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వీడి బాబు టిడిపి లోకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చినప్పుడే ఆయన పరిధిని డిసైడ్ చేశారని తెలుస్తుంది. తన నియోజకవర్గానికి మించి మిగిలిన ప్రాంతాల్లో జోక్యం కుదరదని బాబు ముందే గీత గీశారంటున్నారు. గోరంట్ల బాబు షరతులకు అంగీకరించడం తోనే ఆయనకు 2004, 2009, 2014, 2019 లలో టికెట్ దక్కిందన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే అంతర్గత ఒప్పందాన్ని ఉల్లంఘించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గీత దాటడంతోనే సమస్య వచ్చిందన్నది ఆయన ప్రత్యర్థుల మాట.

పార్టీ మనుగడ కోసమే …

తనకు 1999 లో కానీ 2014 లో కానీ మంత్రి పదవులు దక్కకపోయినా అసంతృప్తిని పెదవి దాటనీయకుండా గోరంట్ల బుచ్చయ్య చౌదరి జాగ్రత్త వహించారు. అయితే 2014 లో బిజెపి తో పొత్తును గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ప్రతిఘటించారు. దీనివల్ల భవిష్యత్తులో పార్టీ తుక్కు అయిపోతుందని ముందే జోస్యం చెప్పేశారు. అయినా చంద్రబాబు కు గోరంట్ల వంటి వారి మాటలు చెవికి ఎక్కలేదు. పైగా బుచ్చయ్య అలా అన్నందుకో ఎందుకో రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్ కు మార్చేశారు చంద్రబాబు. అయితే ఆ తరువాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పినట్లే బిజెపి వ్యూహంలో చిక్కుకుపోయారు చంద్రబాబు. దాంతో ఎన్డీయే నుంచి ఆ పార్టీని వ్యతిరేకిస్తూ బయటకు రావడం 2019 ఎన్నికల్లో నిజంగానే తుక్కు అయిపోవడం జరిగిపోయాయి. అలాగే వైసిపి నుంచి 23 మంది ఎమ్యెల్యేలను చంద్రబాబు చేర్చుకుని మంత్రి పదవులు సైతం కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు ఉన్నారు. అయినా సీనియర్ నేత మాటను పక్కన పడేశారు బాబు. అనుకున్నట్లే ఫలితాలు రివర్స్ కొట్టాయి. టిడిపి చారిత్రక తప్పిదాల్లో కాంగ్రెస్ పార్టీ తో జత కట్టడం వంటివి కూడా జరిగిపోయాయి.

వినకపోతే రచ్చ చేశారు …

ఇవన్నీ అంతర్గతంగా పార్టీ లో ప్రస్తావించడంతో బాటు కొన్ని ముఖ్యమైనవి మీడియా ముందు పెట్టేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇలా కొరకరాని కొయ్య గా మారిన గోరంట్ల ను వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదిరెడ్డిని ప్రోత్సహించడం ద్వారా సరికొత్త వ్యూహానికి అటు చంద్రబాబు ఇటు లోకేష్ లు పదును పెట్టినట్లు తెలుస్తుంది. పార్టీ మంచి కోసమే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గొంతు చించుకున్నా చివరికి ఆయన ఉనికికే ఎసరు రావడంతో ఎదురుదాడితో అధినేతకు తొడకొట్టి సవాల్ విసిరారు చౌదరి. త్రిసభ్య టీం తో వ్యవహారం కు ఎండ్ కార్డు వేయాలని అమరావతి వస్తే మాట్లాడుకుందామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ససేమిరా అనేశారంటున్నారు. మీరే రాజమండ్రి రండి నే అమరావతి రావలిసిన పని లేదని రోజుకో బాంబు పేల్చేందుకు సిద్ధం అయిపోయారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దాంతో టిడిపి లో గోరంట్ల సంక్షోభం ముదిరిపాకాన పడేలాగే ఉందంటున్నారు. గతంలోలా టీ కప్పులో తుఫాన్ లా ఈ వ్యవహారం ముగిసే అవకాశాలు తక్కువే అన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News