గుడ్ గొల్లపల్లి… కీప్ ఇట్ అప్

తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కొందరు మాత్రమే పార్టీకి అండగా ఉంటున్నారు. చంద్రబాబు అతి సన్నిహితంగా ఉండే నేతలు మౌనంగా ఉన్నప్పటికీ పార్టీ మారి వచ్చిన [more]

Update: 2020-09-16 08:00 GMT

తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కొందరు మాత్రమే పార్టీకి అండగా ఉంటున్నారు. చంద్రబాబు అతి సన్నిహితంగా ఉండే నేతలు మౌనంగా ఉన్నప్పటికీ పార్టీ మారి వచ్చిన వాళ్లే నేడు ఆయనకు చేదోడు వాదోడుగా నిలబడ్డారని చెప్పక తప్పదు. చంద్రబాబు కీలక పదవులు ఇచ్చి, పార్టీలో ఉన్నతస్థాయిని కల్పించిన వారు సయితం గత ఏడాదిన్నరగా కన్పించడం లేదు. కానీ కొందరు మాత్రం పార్టీ కోసం గట్టిగా నిలబడుతున్నారు. వారిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఒకరు.

సీనియర్ నేతగా…..

గొల్లపల్లి సూర్యారావు సీనియర్ నేత. ఆయన దాదాపు మూడు దశాబ్దాల నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. మంత్రి పదవులు కూడా అందుకున్నారు. 1985 లో తెలుగుదేశం పార్టీ నుంచి అల్లవరం (అప్పట్లో ఉండేది) నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి గొల్లపల్లి సూర్యారావు విజయం సాధించారు.

టీడీపీలో చేరి…..

తిరిగి 2004లో కాంగ్రెస్ నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు విజయం సాధించి వైఎస్ మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించుకున్నారు. 2009 లో అల్లవరం నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా మారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో గొల్లపల్లి సూర్యారావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేేరిపోయారు. వైసీపీలో వెళ్లాలనుకుని చివరి నిమిషంలో ఆయన సైకిల్ కు జైకొట్టారు.

ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న నేతల్లో…..

2014లో గొల్లపల్లి సూర్యారావు రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గొల్లపల్లి సూర్యారావు 2019లో ఓటమి పాలయ్యారు. అయినా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ వాణిని విన్పిస్తున్న వారిలో గొల్లపల్లి సూర్యారావు ఒకరు. పార్టీని క్లిష్ట సమయంలో కాడి వదిలేసిన వారు లెక్కపెట్టుకోలేని సంఖ్యలో ఉన్నారు. పార్టీనే నమ్ముకున్న అతి కొద్ది మందినేతల్లో గొల్లపల్లి సూర్యారావు ఒకరు అన్న చర్చ పార్టీలోనే నడుస్తుంది.

Tags:    

Similar News