ఒక్క ఛాన్స్ ఇస్తే చాలట..ఇక రిటైర్మెంటేనట ?

ఆయన రాజకీయాల్లో పుట్టిపెరగలేదు. ఆయన మూడున్నర దశాబ్దాల జీవితమంతా అధికారిగానే గడచింది. వైఎస్సార్ చొరవతో నాడు ఆయన పదవీ విరమణ చేసి మరీ పాలిటిక్స్ లోకి వచ్చారు. [more]

Update: 2020-04-04 12:30 GMT

ఆయన రాజకీయాల్లో పుట్టిపెరగలేదు. ఆయన మూడున్నర దశాబ్దాల జీవితమంతా అధికారిగానే గడచింది. వైఎస్సార్ చొరవతో నాడు ఆయన పదవీ విరమణ చేసి మరీ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆయనే విశాఖ జిల్లా చిట్ట చివరి అసెంబ్లీ సీటు పాయకరావు పేటకు ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వైసీపీ సీనియర్ నేత గొల్ల బాబూరావు. ఎస్సీ నియోజకవర్గంలో తన ఉనికిని బలంగా చాటుకుని అజేయుడిగా గెలుస్తూ వస్తున్న బాబూరావు నాడు వైఎస్సార్, నేడు జగన్ లకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఆయన వైఎస్సార్ మరణాంతరం జగన్ వైపుగా రావడమే కాదు కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవిని వదిలేసుకుని 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బంపర్ మెజారిటీ మళ్ళీ గెలిచారు.

అలా దెబ్బ…

ఇక 2014 ఎన్నికల్లో కూడా పాయకరావుపేటలో అయితే బాబూరావే గెలిచేవారు. ఆయన్ని అమలాపురం ఎంపీగా జగన్ పోటీకి నిలిపారు. దాంతో ఆయన అక్కడ ఓడిపోయారు. ఇక 2019 నాటికి తిరిగి పాయకరావుపేట సీటు దక్కించుకుని గెలిచారు. జిల్లాలో సీనియర్ నేతగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని బాబూరావు భావించారు. అయితే జగన్ సమీకరణలు అన్నీ చూసుకుని బాబురావుని కాస్తా తగ్గమన్నారు. దాంతో ఆయన అధినాయకుని మాట మేరకు ఇప్పటికైతే తన పని తాను చేసుకుపోతున్నారు.

ఈసారి ఖాయమా..?

ఇక రెండున్నరేళ్ళకు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగనే స్వయంగా చెప్పినందువల్ల గొల్ల బాబూరావు ఆ విడత మీదనే ఆశలు పెట్టుకున్నారు. తనకు కచ్చితంగా 2021లో మంత్రి యోగం ఉందని ఆయన నమ్ముతున్నారు. మంత్రి పదవి కనుక వస్తే అమాత్య కుర్చీలో కూర్చుని జిల్లా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ఆయన మంత్రి హోదాలో ఓ వెలుగు వెలగాలని ఆశపడుతున్నారు. ఒకవేళ ఆ కోరిక తీరితే ఇక రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించలను కుంటున్నట్లుగా అనుచరులు చెబుతున్నారు.

పోటీగా…..

ఇదిలా ఉండగా పాయకరావుపేట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బాబూరావుతో పోటీ పడి ఓడిపోయిన కేజీహెచ్ రిటైర్డ్ డాక్టర్ బంగార్రాజు ఈ మధ్యనే ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆయన సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనంలో పేరు తెచ్చుకున్నారు. ఇక మరో వైపు అమలాపురం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు సైతం పాయకరావు పేట సీటు మీద కన్నేశారు. వీరే కాకుండా లోకల్ గా ఉన్న మరికొంతమంది నేతలు ఉన్నారు. ఈ క్రమంలో బాబురావుకు గట్టి పోటీ 2024లో తప్పదు. అందుకే టికెట్ వస్తే ఓకే లేకపోతే అప్పటికి రాజకీయాలకు గుడ్ బై కొట్టాలన్న ఆలోచన ఉందిట. దానికంటే ముందు మంత్రి పదవి చేస్తేనే అని కండిషన్ పెడుతున్నారు అనుచరులు. చూడాలి మరి. జగన్ ఆయన జాతకాన్ని ఎలా మలుపు తిప్పుతారో.

Tags:    

Similar News