బాబూరావుకు జగన్ భారీ హామీ

విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆయన్ని నమ్మిన బంటు అంటారు. ఆయన స్వతహాగా అధికారి. కానీ వైఎస్సార్ అంటే ఆయనకు దేవుడితో సమానం. అందువల్ల ఆయన పదవీ విరమణతోనే [more]

Update: 2019-09-24 08:00 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆయన్ని నమ్మిన బంటు అంటారు. ఆయన స్వతహాగా అధికారి. కానీ వైఎస్సార్ అంటే ఆయనకు దేవుడితో సమానం. అందువల్ల ఆయన పదవీ విరమణతోనే కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ ప్రియ శిష్యునిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. ఆయన ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ లో వైఎస్ మరణించాక జగన్ వైపునకు వచ్చిన బాబూరావు కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవిని వదులుకుని 2012లో జరిగిన ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన్న్ని అమలాపురం ఎంపీగా పంపడంతో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబూరావు జగన్ కి అత్యంత విశ్వాస‌పాత్రుడు. జగన్ కోసం ఏమైనా చేసే నిజం అయనదని అంటారు.

తృటిలో తప్పిన పదవులు …..

ఇక గొల్ల బాబూరావు విషయం తీసుకుంటే 2014లో ఆయన్ని పాయకరావు ఎమ్మెల్యేగా ప్రకటించి అనూహ్యంగా అమలాపురం ఎంపీగా పంపారు. దాంతో ఆయన కచ్చితంగా గెలవాల్సిన ఎమ్మెల్యే సీటు కోల్పోయారు. ఇక తాజా ఎన్నికల్లో గెలిచిన వెంటనే దళిత కోటాలో ఆయన పేరు మంత్రి పదవికి వినిపించింది. అయితే గోదావరి జిల్లాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తూ విశాఖకి ఒక పదవితో సరిపెట్టేశారు. దాంతో చివరి నిముషం వరకూ వినిపించిన ఆయన పేరు కాస్తా వెనక్కుపోయింది. ఇపుడు టీటీడీ బోర్డ్ మెంబర్ గా బాబూరావుని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు మీడియాలోనే వచ్చేశాయి. మరేం జరిగిందో కానీ చివరి నిముషంలో ఆయన పేరు లేకుండా పోయింది. దాంతో ఆయనకు ముచ్చటగా మూడు సార్లు చివరి నిముషంలోనే అదృష్టం అలా తారుమారు అయిందని అనుచరులు మధనపడుతున్నారు.

స్వయంగా జగనే…..

ఈ పరిణామాల నేపధ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి బాబూరావుతో ఫోన్ లో మాట్లాడారని సమాచారం. పదవుల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదని పేర్కొంటూ తొందరలోనే కీలమైన నామినేటెడ్ పదవిని ఇస్తామని మాట ఇచ్చారని జగన్ చెప్పినట్లుగా బాబూరావు వర్గీయులు చెబుతున్నారు. ఏపీలో ముఖ్యమైన కార్పొరేషన్ పదవి ఒకదానికి చైర్మన్ గా బాబూరావుని నియమిస్తారని అంటున్నారు. జగన్ నేరుగా మాట ఇవ్వడంతో బాబురావు వర్గీయులు తెగ ఆనందిస్తున్నారు. ఇక బాబూరావు సైతం జగన్ ఎలా చెబితే అలా అంటున్నారు. తనకు జగన్ ముఖ్యమని, ఆయన ఎలా చేయమన్నా చేసేందుకు తాను సిధ్ధమని కూడా బాబూరావు అంటున్నట్లు భోగట్టా. మొత్తానికి రాజకీయాల్లో పదేళ్ళ క్రితం ప్రవేశించిన ఈ మాజీ అధికారి విశ్వననీయతకు సరికొత్త అర్ధం చెబుతూ పదవులతో సంబంధం లేకుండా జగన్ మాటనే నమ్ముకుని ఉండడం అరుదైన విషయం. తొందరలోనే బాబూరావు మంచి పదవిలో ఉంటారన్నై విశ్వాసం కూడా ఆయన వర్గంలో ఉంది.

Tags:    

Similar News