గోదావరి జిల్లాలను వణికిస్తున్న ఆ రెండు ?

గోదావరి జిల్లాలకు ఎన్నడూ లేని కష్టం దాపురించింది. ఒక పక్క రాష్ట్రంలోనే అత్యధిక కరోనాకేసులు నమోదు అవుతున్నాయి. ఇవి ఇంకా తగ్గుముఖం పెట్టకుండానే గోదావరికి వరద ఉగ్ర [more]

Update: 2020-08-18 09:30 GMT

గోదావరి జిల్లాలకు ఎన్నడూ లేని కష్టం దాపురించింది. ఒక పక్క రాష్ట్రంలోనే అత్యధిక కరోనాకేసులు నమోదు అవుతున్నాయి. ఇవి ఇంకా తగ్గుముఖం పెట్టకుండానే గోదావరికి వరద ఉగ్ర రూపంలో వచ్చి విరుచుకుపడుతూ ఉండటంతో పరివాహక ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ రెండు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పుడు కరోనా, వరదలను ఒకేసారి ఎదుర్కోవడం కత్తిమీద సాముగా తయారైంది. ఒక పక్క వరద బాధితులకు పునరావాసానికి తరలించడం, మరోపక్క వైరస్ బాధితులకు క్వారంటైన్ లకు పంపడం వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి.

బలహీనంగా ఏటిగట్లు …

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి రికార్డ్ స్థాయిలో ప్రవహిస్తుంది. అటు భద్రాచలం, ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి మూడోవ ప్రమాద హెచ్చరిక దాటి ఉరకలు వేస్తుంది. కేంద్ర జలవనరుల సంఘం అంచనా ప్రకారం వరద మరికొంత కాలం అతలాకుతలం చేస్తుందనే సమాచారం గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. గతంలో చెన్నారెడ్డి, ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో మాత్రమే ఏటి గట్ల పటిష్టతపై దృష్టి పెట్టారు.

ఆ వరదలు ప్రామాణికం …

గోదావరి వరద చరిత్రలో 1986 వచ్చిన ఫ్లడ్ అత్యధికం. నాడు గట్లు దాటిన వరద గోదావరి కి దాదాపు 33 లక్షల నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డ్ లు చెబుతున్నాయి. ఆ స్థాయి కన్నా తక్కువ 1955 లో ఒకసారి మాత్రమే వచ్చింది. అందుకే 1989 లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రపంచ బ్యాంక్ నిధులతో గోదావరి ఏటిగట్లను 86 వరదల స్థాయి కి పెంచారు. ఆ తరువాత వైఎస్ ఉభయగోదావరి లోని 550 కిలోమీటర్ల పరిధిలో పటిష్టతపై దృష్టి పెట్టి వాటిని పటిష్టం చేశారు. ఆ తరువాత ఏ ప్రభుత్వం ఏటిగట్లపై ఆలోచనే చేయలేదు. ఇప్పుడు సుమారు 20 లక్షల క్యూసెక్కుల వరదనీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. 1986 వరదల స్థాయి ఇప్పుడు గోదావరి పెరిగితే మాత్రం తట్టుకునే సామర్ధ్యం అనుమానమే.

తిప్పలు పడుతున్న యంత్రాంగం …

ఇదిలా ఉంటే ముంపు ప్రాంతాల్లోని 160 గ్రామాల ప్రజలను తరలించడానికి అధికార యంత్రాంగం నానా తిప్పలు పడుతుంది. కరోనా ప్రభావంతో పునరావాసకేంద్రాలకు తరలిరావడానికి ముంపు ప్రాంతాల్లో ఉండేవారు భయపడుతున్నారు. దాంతో వారిని ఒప్పించి ఆ కేంద్రాలకు తరలించడం పెద్ద టాస్క్ గా మారింది అధికారయంత్రాంగానికి. ఒక పక్క కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ముంపు బాధితులను పునరావాసానికి తరలిస్తూ వారికి భోజన సదుపాయాలు కల్పించడం వారికి సవాల్ గానే మారింది.

Tags:    

Similar News