గోవా..వారెవ్వా... రసపట్టులో రాజకీయం..?

Update: 2018-09-25 16:30 GMT

పర్యాటక రాష్ట్రమైన గోవాలో పాలన పడకేసింది. ఫలితంగా యావత్ అధికార యంత్రాంగం సుప్తచేతనావస్థలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఉఫ ముఖ్యమంత్రి, మరో మంత్రి అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరడంతో పరిపాలన పూర్తిగా స్థంభించి పోయింది. కానీ అదే సమయంలో రాజకీయం మాత్రం రోజురోజుకూవేడెక్కడం గమనార్హం. రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. తమ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్నికాపాడుకోవడానికి కమలనాధులు కసరత్తులు చేస్తుండగా, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఫలితంగా యావత్ రాజకీయం రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హా చుట్టూ తిరుగుతోంది. గవర్నర్ మృదుల సిన్హా వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

అనారోగ్యం...స్థంభించిన పాలన.....

2017 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఓటమి పాలైంది. 40 స్థానాల అసెంబ్లీలో 16 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అయినా అధికారాన్ని చేపట్టలేకపోయింది. వేగంగా పావుల్ని కదపలేక వెనకబడింది. జాతీయ,రాష్ట్ర నాయకత్వాల వైఫల్యాల కారణంగా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. అదే సమయంలో 14 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ మిత్రుల మద్దతుతో గద్దెనెక్కింది. ముగ్గురు సభ్యులు గల మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, మరో ముగ్గురు సభ్యులు గల గోవా ఫార్వార్డ్ పార్టీ, ముగ్గురు స్వతంత్ర సభ్యుల సహకారంతో అధికార పీఠాన్ని అధిష్టించింది. అప్పట్లో కేంద్ర రక్షణమంత్రిగా ఢిల్లీలో చక్రంతిప్పుతున్న మనోహర్ పారికర్ ను ముఖ్యమంత్రిగా పనాజీకి పంపింది. పారికర్ పెద్దరికంలో ఇప్పటి వరకూ సంకీర్ణ ప్రభుత్వం సజావుగానే సాగింది. 2017 మార్చి 14న ఆయన బాధ్యతలను చేపట్టారు. పార్టీపై పట్టు, కేంద్ర నాయకత్వం సహకారం, స్థానిక నాయకుల మద్దతుతో ఏడాది పాటు బాగానే పాలన సాగించారు. కొంతకాలంగా పారికర్ అనారోగ్యంతో సతమతమవుతుండటంతో రోజు వారీ బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించలేక పోతున్నారు. వైద్య చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లి వచ్చారు. అయినా ఫలితంలేకపోయంది. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా కూడా అనారోగ్యం పాలయ్యారు. ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరంలోచికిత్స పొందుతున్నారు. విద్యుత్తు శాఖ మంత్రి పాండురంగమద్ కైకర్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి అనారోగ్యంతో విధులు నిర్వర్తించలేకపోవడంతో పాలన పూర్తిగా పడకేసింది. ముఖ్యమంత్రి సహా మొత్తం ఆరుగురు మంత్రుల్లో ముగ్గురు అనారోగ్యం పాలవ్వడంతో పాలన పూర్తిగా స్థంభించింది. యావత్ మంత్రి వర్గం ఐసీయూలోకి వెళ్లిపోయిందని బీజేపీ విపక్షమైన శివసేన కూడా తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రులు ఫ్రాన్సిస్ డిసౌజా, పాండురంగ మద్ కైకర్ లను మంత్రివర్గం నుంచి తాజాగా తొలగించారు. వీరిస్థానంలో బీజేపీకి చెందిన నీలేశ్ కార్బల్, మలింద్ నాయక్ లను మంత్రులుగా నియమించారు.

కాంగ్రెస్ వేగంగా కదులుతూ.....

ఈపరిస్థితిని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ వేగంగా స్పందిస్తోంది. రాజకీయంగా పావులు కదుపుతోంది. 2017 ఎన్నికల అనంతరం రాజకీయం చేయలేక వెనకబడినప్పటికీ, ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా మలచుకుని అధికారాన్ని అందుకోవాలని పరితపిస్తోంది. తమకు తగిన సంఖ్యాబలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుగుతంది. కాంగ్రెస్ నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్ కల్లేకర్ నాయకత్వంలో ఎమ్మల్యేలు గవర్నర్ మృదుల సిన్హాను ఇటీవల కలిశారు. తమకు అవకాశం ఇవ్వకపోతే ప్రభతువ్ం విశ్వాస పరీక్ష నిర్వహించుకునేందుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని గవర్నర్ మృదులా సిన్హాపై వత్తిడి తెస్తోంది. తమకు 21 మంది సంఖ్యాబలం ఉందని కాంగ్రెస్ చెబుతుండటం విశేషం. పరిపాలన స్థంభించిందని పేర్కొంది. అందువల్ల అసెంబ్లీని రద్దు చేయకుండా, రాష్ట్రపతి పాలన విధించకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీని రద్దు చేస్తే ప్రజాతీర్పును వంచించినట్లవుతుందని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రపతి పాలన విధించినా బీజేపీ బేరసారాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని గవర్నర్ కు విన్నవించింది. ఏడాదిన్నర వ్యవధిలోనే అసెంబ్లీని రద్దు చేయడం తగదని కాంగ్రెస్ చెబుతోంది.

రంగంలోకి దిగిన బీజేపీ....

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో ఉలిక్కి పడిన బీజేపీ నాయకత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీనియర్ నేత రాంలాల్, బిఎల్ సంతోష్, వినయ్ పురోణిక్ లను పరిశీలకులుగా పంపింది. మిత్రపక్షాలైన మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్ర శాసనసభ్యులతో కేంద్ర పరిశీలకులు చర్చలు జరిపారు. వారిని సముదాయించారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ రాలేదని వారు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతుండటం, దేశ వ్యాప్తంగా అక్కడకక్కడా జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో కమలనాధులు ఒకింత కంగారు పడుతున్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఈ చిన్న రాష్ట్రంలో అధికారం ఎలా అయినా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లే సాహసం మాత్రం చేయబోవడం లేదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని వాడుకుని స్థానిక మిత్ర పక్షాలను బుజ్జగించి అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది. గవర్నర్ తమ వారే అయినందున ఇది చాలా తేలిక. ఇలాంటి వ్యవహారాల్లో కాంగ్రెస్ ను కొద్దికాలంలోనే కమలనాధులు మించిపోయారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News