దేశానికి ఒక్కడు….!!!

జార్జి ఫెర్నాండజ్ గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడిగా,పోరాట యోధుడిగా పాతతరం వారికి ఆయన అత్యంత సుపరిచితుడు. దాదాపు నాలుగు దశాబ్దాల [more]

Update: 2019-02-16 18:29 GMT

జార్జి ఫెర్నాండజ్ గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడిగా,పోరాట యోధుడిగా పాతతరం వారికి ఆయన అత్యంత సుపరిచితుడు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. రైల్వేకార్మికుల సమ్మె సారధిగా, బహుళజాతి పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరరేకంగా, రైల్వే,రక్షణ, భారీపరిశ్రమల మంత్రిగా తన ప్రత్యేకతలను చాటుకున్నారు. కర్ణాటక లోని మంగుళూరులో జన్మించినప్పటికీ ముంబయి, బీహార్ లను తన రాజకీయ క్షేత్రాలుగా మలచుకుని ఉత్తరాదినాయకుడిగా పేరుపొందారు. గత ఆరేళ్లుగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఫెర్నాండజ్ సామ్యవాదిగా, మానవ హక్కుల యోధుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. జీవిత కాలం కాంగ్రెస్ వ్యతిరేకిగానే ఉండిపోయారు. కాంగ్రెస్ పై వ్యతిరేకతతో భారతీయ జనతా పార్టీకి ఫెర్నాండజ్ చేరువ కావడాన్ని కొందరు సోషలిస్ట్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు.

పుట్టింది అక్కడైనా….?

1930 జూన్ 3న మంగుళూరులోని ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన జార్జి ఫెర్నాండజ్ ను న్యాయవాదిని చేయాలని ఆయన తల్లిదండ్రులు భావించారు. అయితే మెట్రిక్ లోనే చదువు ఆపేయడంతో క్రైస్తవ మతబోధకుడిగా శిక్షణకు వెళ్లారు. అక్కడా ఇమడలేకపోయారు. 1949లో ముంబయి చేరుకుని కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 60వ దశకంలో భారతీయ రైల్వే సమ్మెకు నాయకత్వం వహించారు. తన పదునైన ప్రసంగాలు, వాగ్దాటితో ఉద్యమాన్ని ఉర్రూత లూగించారు. 1967లో ముంబయి వాయువ్య లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజం ఎస్.కె. పాటిల్ ను ఓడించడం విశేషం. 1977లో జనతా పార్టీ విజయం సాధించడంతో మురార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బహుళజాతి కంపెనీలైన ఐబీడబ్ల్యూ, కోకోకోలా కంపెనీలు నిబంధనలు అతిక్రమిస్తున్నాయంటూ వాటిని దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించి సంచలనం సృష్టించారు. అనంతరం 1989లో వీపీసింగ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. ఒకప్పుడు ఏ రైల్వే సమ్మెకు సారథ్యం వహించారో తిరిగి అదే శాఖకు మంత్రిగా రావడం విశేషం. రైల్వే మంత్రిగా ముంబయి- మంగుళూరులను కలుపుతూ కొంకణ్ రైల్వే మార్గం నిర్మాణానికి కృషి చేశారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు రైల్వే స్టేషన్లలో మట్టి గ్లాసుల్లో టీ విక్రయించేలా ఏర్పాటు చేశారు.

వాజ్ పేయికి అండగా….

1999-2004 మధ్య కాలంలో వాజపేయి మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా చారిత్రాత్మకంగా వ్యవహరించారు. కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్షలు ఆయన హయాంలో నే జరిగాయి. సరిహద్దుల్లో ఉండే సైనికులు అంటే ఆయనకు అపారమైన ప్రేమ..గౌరవం. అందుకనే తరచూ సరిహద్దులు సందర్శించి వారిలో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపేవారు. కానీ అప్పట్లో చోటు చేసుకున్న శవపేటికల కుంభకోణ: ఫెర్నాండజ్ జీవితంలో మాయమని మచ్చ వంటిది. తెహల్కా కుంభకోణంలోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వాజపేయి ప్రభుత్వానికి మద్దతు విషయంలో ఎప్పుడూ ముందుండే వారు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా గంటకు పైగా అనర్గళంగా ప్రసంగించిన ఫెర్నాండజ్ మరుసటి రోజే రాజీనామా చేయడం విశేషం. తద్వారా పరోక్షంగా జనతా పార్టీ ప్రభుత్వ పతనానికి తానే కారణమన్నది ఆయన మనోవేదన. దీంతో వాజపేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు శాయశక్తులా కృషి చేశారు.

చివరి దశలో…..

జీవిత చరమాంకంలో అనారోగ్యం ఆయనను చుట్టుముట్టింది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడ్డారు. కుటుంబపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య లైలా ఫెర్నాండజ్, సన్నిహితురాలు జయా జైట్లీ మధ్య ఆయన నలిగిపోయారు. జన్మభూమి మంగళూరును వదిలి ముంబయిని తన కర్మభూమిగా మార్చుకున్న ఫెర్నాండజ్ సొంత రాష్ట్రమైన కన్నడ రాజీకీయాలకు దూరంగా ఉండేవారు. పాకిస్థాన్ కన్నాచైనానే భారత్ కు ప్రమాదకారి అని వ్యాఖ్యానించడం ద్వారా వివాదాలకు తెరలేపారు. సోషలిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో చివరి రోజుల్లో కలసి నడిచినప్పటికీ ఫెర్నాండజ్ ప్రభ తగ్గలేదు. నేటి తరం నాయకులకు ఆయన మార్గదర్శి. స్ఫూర్తి దాయకుడు అని చెప్పడంలో సందేహం లేదు.

Tags:    

Similar News