టెక్నికల్ గానే టీడీపీలో?

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ముహూర్తం ద‌గ్గర ప‌డుతోంది. ఇప్పటికి ఈ ఆరు మాసాల్లో రెండు సార్లకు పైగానే స‌భ భేటీ జ‌రిగింది. తొలిసారి జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పాట‌య్యాక [more]

Update: 2019-12-07 08:00 GMT

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ముహూర్తం ద‌గ్గర ప‌డుతోంది. ఇప్పటికి ఈ ఆరు మాసాల్లో రెండు సార్లకు పైగానే స‌భ భేటీ జ‌రిగింది. తొలిసారి జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పాట‌య్యాక ఒక‌సారి, త‌ర్వాత బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగాయి. అయితే, ఈ రెండు స‌మావేశాల‌కు కూడా విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు హాజ‌రుకాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన స‌మ‌యంలో మాత్రమే వ‌చ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఇక‌, అప్పటి నుంచి కూడా గంటా శ్రీనివాస‌రావు పార్టీ మార‌తార‌నే ప్రచారం ఊపందుకుంది.

టీడీపీలో ఉన్నా….

గంటా శ్రీనివాస‌రావు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని కొన్నాళ్లు, కేంద్రంలోని పెద్దల‌తో క‌లిసి మాట్లాడి వ‌చ్చార‌ని, ఇంకేముంది రేపో మాపో క‌మ‌లం గూటికి చేర‌తార‌ని కొన్ని రోజులు ప్రచారం జ‌రిగింది. ఇక‌, వైసీపీలో చేర్చుకునేందుకు కూడా వైసీపీనాయ‌క‌త్వం ప్రాధాన్యం ఇచ్చింద‌ని కూడా ప్రచారం సాగింది. అయితే, గంటా శ్రీనివాస‌రావు మాత్రం త‌న నిర్ణయాన్ని ఎప్పుడూ వెల్లడించ‌లేదు. ఆదిలో మాత్రం తాను టీడీపీలోనే ఉంటాన‌ని చెప్పారు. స‌రే… గంటా శ్రీనివాస‌రావు చెప్పిందే నిజ‌మ‌ని అనుకున్నా.. ఈ నాలుగు మాసాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక నిర‌స‌న‌ల‌కు, ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కదానికి కూడా గంటా శ్రీనివాస‌రావు హాజ‌రుకాలేదు.

ఏ కార్యక్రమంలోనూ….

పైగా సాక్షాత్తూ చంద్రబాబు విజ‌య‌వాడ వేదిక‌గా ఇసుక కొరతపై దీక్ష చేసిన స‌మ‌యంలోనూ గంటా శ్రీనివాస‌రావు క‌నిపించ‌లేదు. మీడియా ముఖంగా కూడా ఆయ‌న ఎలాంటి ప్రక‌ట‌నా చేయ‌లేదు. ఇక‌, ఇటీవ‌ల అమ‌రావ‌తి లో ప‌ర్యటించిన స‌మ‌యంలో బాబుపై రాళ్లు, చెప్పుల దాడి జ‌రిగింది. దీనిని కూడా గంటా శ్రీనివాస‌రావు ఎక్కడా ఖండించ‌లేక పోయారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. గంటా శ్రీనివాస‌రావు టీడీపీలో టెక్నిక‌ల్‌గా మాత్రమే ఉన్నార‌ని స్పష్టంగా తెలుస్తోంది. ఆయ‌న మ‌న‌సంతా వేరేగా ఉంద‌ని అంటున్నారు.

డెసిషన్ తీసుకుంటారా?

మ‌రోప‌క్క, నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్యక్రమా లు ఇప్పటికీ మొద‌లు కాలేదు. ఈ నేప‌థ్యంలో గంటా శ్రీనివాస‌రావు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ స‌మావేశాల నాటికి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? లేక ఇంకా మౌనంగానే ఉంటారా? అనే చ‌ర్చ స‌ర్వత్రా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు ఐదారుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి ట‌చ్‌లోకి వెళ్లిపోయార‌న్న వార్తల నేప‌థ్యంలో గంటా శ్రీనివాస‌రావు అసెంబ్లీ స‌మావేశాల టైంకు ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటార‌న్నదే ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News