గంటా ఉన్నట్లా..? లేనట్లా..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం పొలిటికల్ సీరియల్ ను తలపిస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నుంచి ఇప్పటికి మూడు నెలలుగా అయిపూ అజా లేరు. [more]

Update: 2019-08-12 11:00 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం పొలిటికల్ సీరియల్ ను తలపిస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నుంచి ఇప్పటికి మూడు నెలలుగా అయిపూ అజా లేరు. అటు అసెంబ్లీలోనూ గంటా శ్రీనివాసరావు వాణి ఎక్కడా వినిపించలేదు. ఇక పార్టీ సమావేశాల్లో కూడా గంటా ఊసే లేదు. విశాఖ అర్బన్ జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు మాత్రమే చురుకుగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు ఓ వర్గంగా కలసి మెలసి తిరుగుతున్నారు. గంటా శ్రీనివాసరావుని ఓ విధంగా వారు పక్కన పెట్టరా..? అసలు గంటా శ్రీనివాసరావుయే పక్కకు తప్పుకున్నారా అన్నది తెలియడంలేదు. ఇదిలా ఉండగా టీడీపీలో వర్గ పోరు కూడా గంటాకు పార్టీ నుంచి వేరు చేస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా అధికారం చలాయించినపుడు గంటా శ్రీనివాసరావు దూకుడే వేరు. తన వారికి పెద్ద పీట వేసి తానే స్వయంగా గ్రూపులు పెంచారు. ఇపుడు పదవి లేకపోవడంతో ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

పార్టీలో కొనసాగుతారా?

ఇక గంటా శ్రీనివాసరావు వైఖరి పూర్తిగా అనుమానస్పదంగా ఉంది. పార్టీలో ఆయన కొనసాగుతారా, పక్క చూపులు చూస్తారా అన్నది ఇంతవరకూ తేలలేదు. లేటేస్ట్ గా మరోమారు గంటా శ్రీనివాసరావు మీడియా ముందుకు రావడంతో ఈ చర్చ మళ్ళీ మొదలైంది. ప్రధానంగా ఉత్తర నియోజకవర్గం పార్టీ నాయకులతో గంటా శ్రీనివాసరావు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగులో ఆయన ఏపీలో మొత్తం పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని గంటా చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. అయినా సరే విశాఖ నలుగురు గెలిచారంటే అది కార్యకర్తల గొప్పతనం అని గంటా శ్రీనివాసరావు చెప్పడం విశేషం. తనని గెలిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పి వూరుకున్నారు తప్ప, పార్టీ పటిష్టతకు అందరం కలసి కృషి చేద్దామని ఎక్కడా చెప్పలేదు. పార్టీలో ఉంటూ అందరికీ అండగా ఉంటానని క్లారిటీ కూడా గంటా ఇవ్వలేదు. ఇక గంటా శ్రీనివాసరావు వర్గంగా భావిస్తున్న విశాఖ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ ఎ రహమాన్, విశాఖ నార్త్ కి చెందిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వంటి వారు హాజరయ్యారు. జీవీఎంసీలో విజయపతాక ఎగురవేస్తామని మిగిలిన నాయకులు చెబుతున్నా గంటా శ్రీనివాసరావు మాత్రం ఉలుకూ పలుకూ లేదు. దాంతో గంటా పార్టీలో ఉంటూ స్థానిక ఎన్నికల్లో గెలుపునకు కృషి చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నెత్తి మీద కత్తిలా….

ఇక గంటా శ్రీనివాసరావు టీడీపీలో కొనసాగేందుకు పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఆయన మంత్రిగా ఉన్నపుడు జరిగిన భూ దందాల విషయంలో వైసీపీ సర్కార్ కఠినంగా ఉంది. ఇటీవల విశాఖ వచ్చిన వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ భూ కుంభకోణాలపైన విచారణ జరిపించి తీరుతామని, దోషులను వదిలిపెట్టే సమస్యే లేదని విజయసాయి హెచ్చరించడంతో గంటా శ్రీనివాసరావు వర్గం పరిస్థితి ఇరకాటంలో పడింది. నిజంగా జగన్ సర్కార్ అంతపనీ చేస్తుందన్న కంగారు గంటా వర్గంలో ఉంది. అందువల్లనే అధికార పార్టీలోకే నేరుగా వెళ్దామని భావించినా జగన్ తీసుకోవడానికి సుముఖంగాలేరు.

బీజేపీలోకి వెళ్దామన్నా…

ఇక బీజేపీలోకి వెళ్దామంటే ఎమ్మెల్యే పదవి పోగొట్టుకోవాలి. పైగా అక్కడ ఉత్తరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు గంటా శ్రీనివాసరావుకు అసలు పడదు, నిజానికి ఆయనే భూ కుంభకోణాలపై అసెంబ్లీలో లేవనెత్తి పెద్ద ఇష్యూని చేశారు. గంటా శ్రీనివాసరావును ఈ రోజు వరకూ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఆయన అనుమతి లేకుండా గంటాను పార్టీలోకి తీసుకోవడానికి కమలనాధులు అంగీకరించరు. ఈ మొత్తం వ్యవహారం ఇలా గందరగోళంగా ఉండడంతోనే గంటా శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత కూడా వైసీపీ హవా ఇలాగే కొనసాగితే మాత్రం గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News